
‘కోల్‌కతా ట్రైనీ డాక్టర్’కు సంఘీభావంగా నిలిచారని నోటీసులు.. దేశాన్ని కదిలించిన ఘటనను ఖండించినందుకు శిక్ష
ఏఎస్‌ఆర్ జిల్లాలో 33 మంది మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లపై అక్కసు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విస్మయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్ బుక్ టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు భావ ప్రకటనా స్వేచ్ఛనూ హరిస్తోంది. హత్యలు, దాడులు, దౌర్జన్యాలతో ఇప్పటికే రాక్షసానందం పొందుతున్న టీడీపీ– జనసేన– బీజేపీ సర్కారు ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు, అన్యాయంపై ప్రశ్నించే గొంతుకకు తావులేదన్నట్లుగా తన తీరును, భావ దారిద్య్రాన్ని నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది. ఇందుకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకున్న ఘటనే ఉదాహరణ.
దేశాన్ని కుదిపేసిన కోల్‌కత ఆర్జీ కార్ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైద్యశాఖకు సంబంధించిన 33 మంది మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ)లు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పైఅధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఇందులో పాల్గొన్నందుకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ జమాల్ బాషా వీరికి షోకాజ్ నోటీసులు జారీచేశారు.
ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు బాషా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 24 గంటల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని.. లేనిపక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా అందులో హెచ్చరించారు. నోటీసులు అందుకున్న 33 మందిలో 31 మంది మహిళలే ఉండటం గమనార్హం. నిజానికి.. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సంఘీభావం ప్రకటించి సానుభూతి చూపించాల్సిన ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా చీమకుట్టినట్లు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో రిషితేశ్వరి.. ఇప్పుడు తాజాగా ఈ రెండు నెలల్లో ముచ్చుమర్రి, హోంమంత్రి వంగలపూడి ఇలాకా అనకాపల్లి జిల్లాల్లో బాలికల దారుణ హత్యలపై చలనంలేని మొద్దుబారిన కూటమి సర్కారు.. కోలకత ఘటనపట్ల స్పందించకపోగా అందుకు నిరసన వ్యక్తంచేసిన వారిపై కక్షసాధింపునకు దిగడాన్ని పౌరహక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment