పింఛన్లపై పిడుగు | Chandrababu Govt new move to remove the pensions | Sakshi
Sakshi News home page

AP: పింఛన్లపై పిడుగు

Published Mon, Aug 19 2024 5:16 AM | Last Updated on Mon, Aug 19 2024 12:46 PM

Chandrababu Govt new move to remove the pensions

పేదల పింఛన్లు భారీగా తొలగించేందుకు చంద్రబాబు కొత్త ఎత్తు

ఎన్నో ఏళ్లుగా లబ్ధిదారులుగా ఉన్న వారికి నోటీసులు

గ్రామాల్లో మళ్లీ 2014–19 నాటి తరహా జన్మభూమి కమిటీల పెత్తనం 

ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరుల పేర్లు తొలగించాలని కూటమి నేతల ఒత్తిళ్లు 

పింఛన్ల తగ్గింపే లక్ష్యం.. తప్పుడు ఫిర్యాదులు మొదలు.. అధికారుల నోటీసులు

పేర్లు తొలగింపునకు ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు వెసులుబాటు 

ఇందులో భాగంగా సాధ్యం కాని అడ్డగోలు నిబంధనలతో నోటీసుల జారీ 

దివ్యాంగ లబ్ధిదారులు 15 రోజుల్లోనే కొత్త సదరం సర్టిఫికెట్‌ ఇవ్వాలట  

మూడు నెలలకొకసారి సదరం స్లాట్లు విడుదలైతే ఇదెలా సాధ్యం? 

వృద్ధులు మూడు రోజుల్లో ఆధార్‌ అప్‌డేట్‌ హిస్టరీ ధ్రువీకరణ ఇవ్వాలట 

ఇంత తక్కువ వ్యవధిలో అధికారులతో సర్టిఫికెట్‌ ఎలా తెచ్చుకుంటారు? 

పక్కా కుట్ర, కుతంత్రాలతో పింఛన్‌ ఎగ్గొట్టేందుకే అలవిగాని నిబంధనలు 

కొత్తగా పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమే లేదు

సూపర్‌ సిక్స్‌ హామీలిచ్చారు.. ఇంకా వాటిని ఎందుకు అమలు చేయడంలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పటికే అమలవుతున్న పథకాలలో కోతలకు మాత్రం కత్తులు నూరుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులన్న కనికరం లేకుండా పింఛన్లు ఎగ్గొట్టడానికి దారులు వెతుకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాబితాలు సిద్ధం చేశారు. ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు నోటీసులు అందాయి. ఇంకా అందుతున్నాయి. ఎన్టీఆర్‌ భరోసా పోర్టల్‌లో పెన్షన్‌ లబ్ధిదారులకు నోటీసులిచ్చేందుకు, వెరిఫై చేసేందుకు, పెన్షన్‌ తొలగించడానికి ఎంపీడీవోలకు ఆప్షన్‌ ఇచ్చేశారు. కొత్త పెన్షన్‌ చేర్చడానికి మాత్రం ఎలాంటి ఆప్షన్‌ ఇవ్వలేదు. దీనిని బట్టి అర్థమవుతున్నదేమిటంటే పెన్షన్‌లను పెద్ద ఎత్తున తొలగించబోతున్నారు. కొత్తగా ఒక్క పెన్షన్‌ కూడా ఇవ్వబోవడం లేదు..  

సాక్షి, అమరావతి:  సామాజిక పింఛన్లకు కోతలు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏళ్ల తరబడి ప్రతి నెలా ఠంఛన్‌గా పింఛను తీసుకుంటున్న లబ్ధిదారులకు ‘మీ పింఛను తాత్కాలికంగా నిలుపుదల చేయడమైంది’ అంటూ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల గ్రామాల్లో అధికార టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు తమకు నచ్చని పింఛను లబ్ధిదారులను టార్గెట్‌ చేసి.. స్థానిక అధికారులకు లేనిపోని ఆరోపణలతో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. 

ఈ క్రమంలో అలాంటి వారి పింఛన్‌ తొలగింపునకు అధికారులు నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులుగా గుర్తించిన వారి పేర్లను ప్రభుత్వ అధికారిక సామాజిక పింఛన్ల ఆన్‌లైన్‌ పోర్టల్‌ నుంచి తొలగించే వెసులుబాటును ఆయా మండల ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సంబంధిత అధికారులకు మొబైల్‌ మేసేజ్‌ రూపంలో సమాచారం ఇచ్చారు.  


చెప్పినట్లు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి 
గత ఐదేళ్లలో ఏ పైరవీలు, రాజకీయ పక్షపాతాలకు తావు లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా పింఛన్‌ డబ్బులు తీసుకున్న పేద లబ్ధిదారులకు మళ్లీ రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయి. అప్పట్లో 2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో గ్రామాల్లో జన్మభూమి కమిటీల ఆగడాల తరహాలోనే ఇప్పుడు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వంలోనూ అధికార పార్టీ నాయకులు తమకు నచ్చని పింఛను లబ్ధిదారులను టార్గెట్‌ చేస్తున్నారు. స్థానిక అధికారులకు లేనిపోని ఆరోపణలతో తప్పుడు ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆపై పింఛన్‌ తొలగింపు నోటీసులు ఇప్పిస్తున్నారు. తాము చెప్పినట్లు చేయాలని కొన్ని చోట్ల బలవంతంగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. 

అర్హతను నిరూపించుకోవడానికి గడువివ్వరా? 
పేద లబ్ధిదారులు తాము పింఛను పొందేందుకు అర్హులమని నిరూపించుకోవడానికి వీలులేకుండా నోటీసులో అసాధ్యమైన గడువు విధిస్తున్నారు. దివ్యాంగులు తమ శరీర వైకల్యాలను ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించుకుని, తాను దివ్యాంగుడిగా నిరూపించుకునే సర్టిఫికెట్లు పొందడానికి ‘సదరం’లో పేర్లు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రతి మూడు నెలలకొకసారి స్లాట్లు విడుదల చేస్తూ అవకాశం ఇస్తుంది. 

స్లాట్లు విడుదలైన మూడు రోజుల్లోనే 90 రోజులకు సరిపడా పేర్ల నమోదు పూర్తయిపోతోంది. మిగిలిన వారు మళ్లీ మూడు నెలల దాకా ఆగాల్సిన పరిస్థితి. అలాంటిది ఓ దివ్యాంగుడు ఎన్నో ఏళ్ల క్రితం వైద్య పరీక్షల అనంతరం తన శరీర వైకల్య సర్టిఫికెట్‌ పొంది, ప్రతి నెలా పింఛను డబ్బులు తీసుకుంటున్న నేపథ్యంలో.. ‘ప్రస్తుతం నువ్వు అర్హత లేకుండా పింఛను పొందుతున్నావు. 

నీ శరీర వైకల్యాలకు సంబంధించి 15 రోజుల్లో కొత్తగా మళ్లీ వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహించుకుని, ఆ సర్టిఫికెట్‌ అధికారులకు అందజేయాలి’ అని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. అంటే ఈ లెక్కన ఉద్దేశ పూర్వకంగా అతని పింఛను శాశ్వతంగా తొలగించేందుకు రంగం సిద్ధమైందని ఇట్టే అర్థమవుతోంది. 



వృద్ధాప్య పింఛను పొందే లబ్ధిదారులకు ఇచ్చే నోటీసుల్లో కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఇచ్చి, ఆయా లబ్ధిదారుల ఆధార్‌లో మొదటి నుంచీ జరిగిన మార్పులు, చేర్పుల వివరాలతో కూడిన (అప్‌డేట్‌ హిస్టరీ ఫామ్‌) ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని నోటీసులు ఇస్తు­న్నారు. లేదంటే శాశ్వతంగా పింఛన్‌ రద్దు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.  

పింఛను లబ్ధిదారునికి పల్నాడు జిల్లా శావల్యాపురం ఎంపీడీవో జారీ చేసిన నోటీసు  

ఇలాంటి ఉదాహరణలు ఎన్నెన్నో..
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం పరిధిలో అక్కడి స్థానిక టీడీపీ నాయకుల ఫిర్యాదుల కారణంగా ఆ మండల పరిధిలోని కేవలం 8 గ్రామాల్లో 209 మంది లబ్ధిదారులకు ఎంపీడీవో షోకాజ్‌ నోటీసులు జారీ చేసే ప్రక్రియ చేపట్టారు.   

⇒ విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతలపేట గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు 60 మంది లబ్ధిదారులకు ఎంపీడీవో నోటీసులు జారీ చేశారు.  

⇒ అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హసనాపురం పంచాయతీలో 13 మంది దివ్యాంగ లబ్ధిదారులపై స్థానిక టీడీపీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో మండలాధికారులు నోటీసు జారీ చేశారు.  

⇒ శ్రీకాకుళం జిల్లా పరిధిలోని స్థానిక అధికార పార్టీ నాయకుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు నందిగాం మండలం నౌగాం పంచాయతీలో ఎనిమిది మంది దివ్యాంగులతో పాటు ఇద్దరు వృద్ధులు, కవిటి మండలంలో 9 మందికి నోటీసులు జారీ చేశారు. ఆమదాలవలసలో 8 మందికి,  సరుబుజ్జిలి మండలం వ్యాసలిపేటలో 9 మంది లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చారు. 

⇒ శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగించాలన్న టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు 730 మంది లబ్ధిదారులకు అధికారులు నోటీసులు అందజేశారు. ఒక్కో గ్రామంలో 10 నుంచి 50 మంది దాకా నోటీసులు ఇచ్చారు. కనగానపల్లి మండలం వేపకుంటలో 52 మందికి, భానుకోటలో 40 మందికి, నరసంపల్లిలో 25 మందికి, కోనాపురంలో 26 మందికి నోటీసులు ఇచ్చారు.  

పార్టీ నేతల కనుసన్నల్లో ‘పింఛన్లు’
జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కొత్తగా ఏర్పడిన టీడీపీ–జనసేన –బీజేపీ కూటమి ప్రభుత్వం జూలైలో తొలిసారి పింఛన్లు పంపిణీ చేసింది. పేరుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమం కొనసాగినా, ప్రతి చోటా పంపిణీ మొత్తం అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది. గతంలోనూ 2014–19 మధ్య వృద్ధులు, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్ల పంపిణీలో ప్రతి అంశంలోనూ అప్పటి అధికార టీడీపీకి సంబంధించిన జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యం విపరీతంగా కొనసాగిన విషయం తెలిసిందే. 

2019 తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పింఛన్ల మంజూరు మొదలు, పంపిణీలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీ నాయకుడి జోక్యం లేకుండా, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకం అమలు కొనసాగిన విషయం తెలిసిందే. 

గత ఐదేళ్ల పరిస్థితికి పూర్తి భిన్నంగా జూలై, ఆగస్టు నెలలో జరిగిన పింఛన్ల పంపిణీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల వెంట ఆ ప్రాంతంలోని స్థానిక అధికార పార్టీ నాయకులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తూ ఫొటోలు కూడా దిగారు. కొన్ని ప్రాంతాల్లో తమకు ఓటు వేయలేదన్న కారణంతో పింఛను డబ్బులు ఇవ్వకుండా ఆపేయించారు. పింఛన్ల పంపిణీలో ఆధిపత్యం కోసం పలు ప్రాంతాల్లో కూటమి పార్టీ నాయకులు పరసర్పం గొడవలు కూడా పడ్డారు.  

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింఛన్లు పొందేందుకు అర్హత ప్రమాణాలపై అప్పటి జన్మభూమి కమిటీల పేరుతో తనిఖీలు చేపట్టి లక్షల మంది పింఛన్లకు కోత పెట్టారు. రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్‌ 2వ తేదీ నాటికి రాష్ట్రంలో 43.11 లక్షల మంది పింఛనుదారులు ఉన్న పరిస్థితిలో 2014 జూన్‌ 8వ తేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 

అప్పట్లో సర్పంచి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు.. తదితర పదవులకు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలతో జన్మభూమి కమిటీలు వేశారు. వారి ద్వారా పింఛన్లపై తనిఖీలు చేయించారు. దీంతో సెపె్టంబర్‌ నాటికి పింఛన్‌ లబ్ధిదారుల సంఖ్య 39 లక్షలకు తగ్గిపోయింది. అంటే ఏకంగా నాలుగు లక్షల మందికి పైగా పింఛన్లను తొలగించారు. 

అప్పట్లో పింఛన్ల పంపిణీ సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో జన్మభూమి కమిటీ సభ్యులకే ఎక్కువగా భాగస్వామ్యం కల్పించారు. జన్మభూమి కమిటీ సభ్యులు ప్రతి పథకం మంజూరులోనూ లబ్ధిదారులు తమ పార్టీ వారా, కాదా అని నిర్ధారించుకుని.. పక్షపాతం చూపేవారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో పింఛన్‌ రద్దు అయిన లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించి తిరిగి పింఛన్‌ పొందిన విషయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement