వంద రోజుల వంచన.. మంచి ఎక్కడ? అంతా మోసమే | Colossal failure of Chandrababu governance in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వంద రోజుల వంచన.. మంచి ఎక్కడ? అంతా మోసమే

Published Fri, Sep 20 2024 4:24 AM | Last Updated on Fri, Sep 20 2024 7:32 AM

Colossal failure of Chandrababu governance in Andhra Pradesh

అన్ని వర్గాలకు సీఎం చంద్రబాబు దగా.. పాలనలో ఘోర వైఫల్యం

రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులకు మోసమే.. సూపర్‌ 6 హామీలను అటకెక్కించి రెడ్‌బుక్‌ పాలన

కుట్రలు.. అరాచకం.. దాడులు.. వైఫల్యాలు.. ఇదీ బాబు సర్కారు వందరోజుల ట్రాక్‌ రికార్డ్‌

ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దగా చేయడమే మంచి పాలనా?

జగన్‌ ఇచ్చిన పథకాలనూ అడ్డుకుంటారా? ఇది మోసం కాదా బాబూ? అని నిలదీస్తున్న కోట్లాది ప్రజానీకం

వంద నాలుకలు..! వంద మోసాలు... వైఫల్యాలు..! ఇదీ సీఎం చంద్రబాబు వంద రోజుల పాలన!! అన్ని వర్గాలను దారుణంగా మోసగించి సూపర్‌ సిక్స్‌ హామీలను అటకెక్కించిన సీఎం చంద్రబాబు తాజాగా ఇది మంచి ప్రభుత్వం అంటూ తన ఫొటోలతో ఇంటింటికీ స్టిక్కర్లు అతికించేందుకు సిద్ధం కావడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చాక దగా చేశారు. నాడు ఇంటింటికీ తిరిగి సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రచారం చేసి బాండ్లు ఇస్తామని ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఆ హామీల పేరు వింటేనే భయమేస్తోందంటున్నారు. దీన్ని మంచి అంటారా? మోసం అంటారా? అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది.  

సూపర్‌ సిక్స్‌ మోసాలివిగో..

సాక్షి, అమరావతి: బడికి వెళ్లే పిల్లల దగ్గర నుంచి తల్లులు, విద్యార్థు­లు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు .. ఇలా అన్ని వర్గాలకు ఇచ్చి­న హామీలను విస్మరించిన సీఎం చంద్రబాబు ఏ ఒక్కటైనా నెర­వేర్చారా? అని నిలదీస్తున్నారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. అదే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉండి ఉంటే ఈపాటికి అన్ని పథకాలు అందేవని, ఆయన ఇచ్చిన పథకాలకు సైతం చంద్రబాబు అడ్డుపడటాన్ని మంచి అంటారా? మోసం అంటారా? అని ప్రశ్నిస్తున్నా­రు. 

ఇవాళ ఏ రైతన్నను పలుకరించినా రైతు భరోసా లేదని.. రూ.20 వేలు పెట్టుబడి సాయం హామీని మట్టిలో కలిపేశారని, క్రాప్‌ ఇన్సూరెన్స్, సున్నా వడ్డీ, ఈ క్రాప్‌ ఊసే లేకుండా వంచించారని ఆవేదన చెందుతున్నారు. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు ఇస్తామంటూ చిన్న పిల్లలను సైతం చంద్రబాబు మోసగించారని తల్లులు ఆక్రో­శిస్తున్నారు. 40 లక్షల మందికిపైగా తల్లులు అమ్మ ఒడికి దూరమై నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. 

చంద్రబాబు ఇచ్చి­న హామీతో ఒక్కో ఇంటికి రూ.30 వేలు చొప్పున వస్తాయని నమ్మామని ఇద్దరు పిల్లలున్న తల్లులంటున్నారు. పిల్లలకు నాణ్యమైన గోరుముద్ద కరువైందని, ఇంగ్లీషు మీడియం చదువులు, టోఫెల్, ఐబీ, సీబీఎస్‌ఈ సిలబస్‌ సర్కారు బడికి దూరమయ్యాయని, నాడు–నేడుతో బాగుపడ్డ స్కూళ్లు కళ తప్పాయని నిర్వేదంగా చెబుతున్నారు.

ఆసరా, చేయూత వంటి పథకాలు ఏవీ? 
ఇప్పటికీ చేయూతగానీ, సున్నావడ్డీ గానీ, ఆసరా లాంటి పథకాలు గానీ అందలేదని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికే అందాల్సిన మత్స్యకార భరోసాగానీ, వాహనమిత్ర లాంటి పథకాలుగానీ అందలేదని సొంత ఉపాధి పొందుతున్న వారు పేర్కొంటున్నారు. ఇక 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న హామీకి చంద్రబాబు తూట్లు పొడిచారు. యువతకు నిరుద్యోగ భృతి లేకపోగా డీఎస్సీ దరిదాపుల్లోనే లేదు..! ఇన్ని మోసాలు చేశాక ఇక మంచి ఎక్కడుందని నిలదీస్తున్నారు. 

గత వంద రోజులుగా రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కొత్తవి ప్రవేశపెట్టకపోగా గత ఐదేళ్లుగా అమలైన సంక్షేమ పథకాలు, వ్యవస్థలను రద్దు చేయడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. కనీసం బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేక కాలయాపన చేస్తుండటం 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబు వైఫల్యానికి నిదర్శనం. ఉచిత ఇసుక విధానం ముసుగులో పచ్చముఠాల భారీ దోపిడీకి రాచబాట వేశారు. 

టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన 700 ఎంబీబీఎస్‌ సీట్లకు మోకాలడ్డి, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేసి మన విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది. విజయవాడను వరదలు ముంచెత్తుతాయని స్పష్టమైన సమాచారం ఉన్నా అలవి మాలిన నిర్లక్ష్యంతో వ్యవహరించింది. వరదలు బీభ­త్సం సృష్టిస్తుంటే ప్రభుత్వం పత్తాలేకుండా పోయింది. వంద రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం సాధించింది మాత్రం ఒక్కటి ఉంది... అదే  రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరిట రాష్ట్రంలో అరాచక రాజ్యాన్ని సృష్టించడం. 

హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, లైంగిక దాడులు, వేధింపులు, కక్ష సాధింపులతో రాష్ట్రాన్ని భయానక వాతావరణంలోకి నెట్టివేయడం. ఇదీ చంద్ర­బాబు వంద రోజుల పాలన ట్రాక్‌ రికార్డ్‌! ఈ నేపథ్యంలో ఇన్ని మో­సాలు చేసి రెడ్‌బుక్‌ పాలన సాగిస్తూ మంచి చేశామని నిస్సిగ్గుగా చెప్పుకునేందుకు మనసు ఎలా వచ్చింది? అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది.  


పాలనలో ఘోర వైఫల్యం.. 
ముఖ్యమంత్రిగా చంద్రబాబు వైఫల్యానికి తాజా నిదర్శనం విజయ­వాడను ముంచెత్తిన వరదలే. అతి భారీ వర్షాలతో బుడమేరుకు వరద వస్తుందని వాతావరణ విభాగం (ఐఎండీ) రెండు, మూడు రోజులు ముందే హెచ్చరించినా సీఎం చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఫ్లడ్‌ కుషన్‌ నిబంధనలను పాటించలేదు. అధికార యంత్రాంగంతో కనీసం సమీక్షించలేదు. 

వరద ముంపు ప్రభావిత ప్రాంతాల వారిని తరలించడం కాదు కదా కనీసం వారికి సమాచారం కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. వరదలు వచ్చిన పది రోజుల వరకూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు.  దాంతో వరద భారీగా ముంచెత్తి 50 మందికిపైగా దుర్మరణం చెందగా దాదాపు రూ.10వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇదీ చంద్రబాబు పాలనా దక్షత! 



రద్దులే.. కొత్త పద్దు లేదు.. 
చంద్రబాబు అధికారం చేపట్టాక ఎస్‌జీటీలకు పదోన్నతి లేకుండా బదిలీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చేపట్టిన నాడు–నేడు కార్యక్రమాన్ని నిలిపివేశారు. కౌలు చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించడంతో 16 లక్షలమంది సన్న, చిన్నకారు రైతులు సంక్షేమ పథకాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. అమూల్‌ కేంద్రాలు మూసివేయడంతో దాదాపు 6 లక్షల మంది పాడి రైతులు రోడ్డున పడ్డారు. 

వ్యవసాయ సలహా మండళ్లను రద్దు చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వృద్ధాప్య, సామాజిక పింఛన్లను తొలగింపునకు ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. 

ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసి...టీడీపీ నేతల సిండికేట్‌ దోపిడీకి రాచబాట పరుస్తూ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని అక్టోబరు నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. సచివాలయాల వ్యవస్థను అస్తవ్యస్థంగా మార్చి వలంటీర్లకు పొగబెట్టారు. ఇంటింటికీ రేషన్‌ సరుకులు అందించే ఎండీయూ వాహనాలను నిలివేశారు.   

రైతన్నకు వెన్నుపోటు..  
ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియంను చెల్లించకపోవడంతో రూ.1,500 కోట్లకుపైగా పంటల బీమా పరిహారం అన్నదాతలకు అందలేదు.  కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లను ఎగవేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల సరఫరాలో కోత పెట్టడంతో లక్షలాదిమంది ఎరువులు అందక ఖరీఫ్‌ సీజన్‌లో ఇబ్బందులు పడ్డారు. నాన్‌ సబ్సిడీ విత్తనాల పంపిణీ నిలిపివేశారు.   

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై యూటర్న్‌ 
భూ వివాదాలు లేని శాశ్వత వ్యవస్థ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూపొందించిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో దుష్ప్రచారం చేసి తప్పుదారి పట్టించింది. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేసినట్టు నమ్మించారు. భూసర్వే వెంటనే నిలిపివేయాలన్నారు. కానీ అంతలోనే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై యూటర్న్‌ తీసుకున్నారు. 

ప్రజలకు ఉపయోగకరమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఆ చట్టాన్ని అమలు చేసే రాష్ట్రాలకే 50 ఏళ్లపాటు వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపారు.  దాంతో ఆ చట్టం పేరు మార్చి అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంటే కేవలం ప్రజల్ని భయపెట్టేందుకే టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారానికి తెర తీసినట్లు స్పష్టమవుతోంది.  

ఇది అప్పుల కుప్ప ప్రభుత్వం
సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారు. 80 రోజుల్లోనే ఏకంగా రూ.19 వేల కోట్ల మేర కొత్త అప్పులు చేసి టీడీపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అంత  భారీ అప్పులు చేసినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ 6 హామీలను మాత్రం అమలు చేయకపోవడం గమనార్హం.  

ఆరోగ్యంతో ఆటలు..  
ప్రతిపక్షంలో ఉండగా కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కి కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌ పరం చేసేందుకు సిద్ధపడ్డారు.  ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున డయేరియా కేసులు పెరుగుతున్నాయి. 

పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. డెంగీ, మలేరియా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. గురుకులాలు, హాస్టళ్లలో కలుíÙత ఆహారంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రులపాలయ్యారు. అయినా సరే ప్రభుత్వం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది.

ఉచితం అంటూ.. ఇసుక దోపిడీ 
రాష్ట్రంలో ఇసుక విధానాన్ని పచ్చముఠాలు తమ దోపిడీకి మార్గంగా మార్చుకున్నాయి. ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా ముందుచూపుతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇసుక యార్డుల్లో నిల్వ చేసిన లక్షల టన్నుల ఇసుకను టీడీపీ ప్రజాప్రతినిధులు అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు. దీంతో నిర్మాణ రంగం స్తంభించి లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోసం అల్లాడుతున్నారు. పేరుకి ఉచిత ఇసుక అంటూ టీడీపీ నేతల సిండికేట్‌ అధిక రేట్లు నిర్ణయించి భారీగా సొమ్ము చేసుకుంటోంది.  

డీఎస్సీ ఆశలు ఆవిరి.. 
మెగా డీఎస్సీ పేరిట చంద్రబాబు నిరుద్యోగులను బురిడీ కొట్టించారు. 25వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత 16 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించి రానున్న ఆరు నెలల్లో భర్తీ చేస్తామన్నారు. తొలి సంతకాన్ని ఈ ఫైల్‌ మీదే చేశారు. కొత్తగా ఈ ఏడాది డీఎడ్‌ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తామంటూ టెట్‌ను అక్టోబరుకు వాయిదా వేశారు. 

అనంతరం టెట్‌కు, డీఎస్సీకి మధ్య కనీస వ్యవధి 90 రోజులు ఉండాలంటూ డీఎస్పీ నిర్వహణను పూర్తిగా పక్కనపెట్టేశారు. దీంతో ఈ ఏడాది అసలు డీఎస్సీ నిర్వహించరన్నది తేలిపోయింది. ఆ తరువాత కూడా ఎప్పుడు నిర్వహిస్తారన్నది చెప్పలేని పరిస్థితి. మరోవైపు రేషనలైజేషన్‌ పేరిట ప్రభుత్వ పాఠశాలలను కుదించివేస్తున్నారు. తద్వారా ఉపాధ్యాయ పోస్టులు భారీగా రద్దు  చేసేందుకు కుట్రపన్నుతున్నారు.  

రెడ్‌ బుక్‌ అరాచకం
చంద్రబాబు ప్రభుత్వం వంద రోజుల్లో సాధించింది ఏమైనా ఉందంటే... రెడ్‌బుక్‌ పేరిట రాష్ట్రంలో అరాచకానికి తెగబడుతూ బీభత్సం సృష్టించడమే. తొలి వంద రోజుల్లోనే ఏకంగా 40 మంది హత్యకు గురి కాగా, 400 మందిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. 3 వేలకుపైగా దాడులతో పచ్చ ముఠాలు చెలరేగిపోయాయి. 40 మంది మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 

వారిలో నలుగురు బాధితులు హత్యకు గురయ్యారు. టీడీపీ గూండాల దాడులతో 3 వేల కుటుంబాలు తమ గ్రామాలు విడిచి వెళ్లిపోయాయి. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా­ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు యథేచ్చగా దాడులకు పురిగొల్పుతున్నారు. కేసులు బనాయిస్తూ అక్రమ అరెస్టులతో వేధిస్తున్నారు. 

ఎంపీ మిథున్‌ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పపై పుంగనూరులో దాడి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌ తదితరులపై అక్రమ కేసులు బనాయించారు. 

10 మంది ఐఏఎస్‌లు, 24 మంది ఐపీఎస్‌ అధికారులకు మూడు నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. హనీ ట్రాప్, ఫోర్జరీ కేసుల్లో నిందితురాలు కాదంబరీ జత్వానీని అడ్డం పెట్టుకుని ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్‌ గున్నిలపై అక్రమంగా సస్పెన్షన్‌ వేటు వేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement