6 నెలల్లో తారుమారు.. హామీలకు చంద్రబాబు తూట్లు | Chandrababu Govt six-month rule is all about fraud | Sakshi
Sakshi News home page

6 నెలల్లో తారుమారు.. హామీలకు చంద్రబాబు తూట్లు

Published Thu, Dec 12 2024 4:46 AM | Last Updated on Thu, Dec 12 2024 8:00 AM

Chandrababu Govt six-month rule is all about fraud

ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలకు చంద్రబాబు తూట్లు 

అన్ని వర్గాలను నమ్మించి అధికారంలోకి వచ్చాక నయవంచన

మహిళలు, రైతులు, పిల్లలు, నిరుద్యోగులను నిలువునా ముంచిన బాబు 

ఏ ఒక్క హామీ అమలు చేయకుండా నెలకో డైవర్షన్‌ పాలిటిక్స్‌తో కాలక్షేపం 

జగన్‌ ఇచ్చిన పథకాలన్నింటినీ నిలిపివేసి పేదలకు అన్యాయం 

రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం హామీని నెరవేర్చకుండా దగా  

ప్రతి మహిళకి ఏటా రూ.18,000 సాయం.. ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు 

తల్లికి వందనం, యువతకు నిరుద్యోగ భృతిపై గప్‌చుప్‌ 

లెక్కలేనన్ని హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయకుండా దాటవేత వైఖరి 

వలంటీర్ల వేతనాలు పెంచకపోగా ఏకంగా వ్యవస్థను రద్దు చేసిన వైనం 

చంద్రబాబు ఆరు నెలల పాలనలో అన్నీ మోసాలే

మోసాల్లో ‘సిక్సర్‌’

స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్ధికీ ఏడాదికి రూ.15 వేలు. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తాం..! 

46 లక్షల మంది తల్లుల ఎదురు చూపులు!! 

ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున ఆర్ధిక సహాయం..  

54 లక్షల మంది రైతన్నల పడిగాపులు!! 

19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలందరికీ ఏటా రూ.18 వేలు చొప్పున ఆర్థిక సహాయం! 

1.80 కోట్ల మంది అక్క చెల్లెమ్మల ఆరాటం!! 

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

దాని ఊసేలేదు  

ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు 

ఈ ఆర్థిక ఏడాది రెండు సిలిండర్లు ఎగనామం

నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి.. కోటిమంది ఎదురు చూపులు!  

ఓ నాయకుడు మాట ఇస్తే... ఆరు నూరైనా నూరు ఆరైనా కట్టుబడి ఉండాలంటారు! కానీ సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ఏరు దాటాక తెప్ప తగలేశారు! ఆర్నెళ్ల పాలనలో కనిపించేదంతా ఉత్త ‘గ్యాసే’!

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయకపోగా ఇసుకలో దోపిడీ.. మద్యంలో దోపిడీ.. రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్తు చార్జీల బాదుడుతో ప్రజలను గుల్ల చేస్తున్నారు. మరోవైపు కొత్త పథకాలు లేకపోగా ఉన్నవాటినే రద్దు చేస్తూ రెడ్‌బుక్‌ పాలనతో ప్రశ్నించే గళాలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యమయ్యాయి. రెడ్‌బుక్, మాఫియా రాజ్యంతో స్కామ్‌ల పాలన సాగుతోంది. ఎన్నికలు జరిగిన ఏడు నెలలు తరువాత.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆర్నెళ్లు గడిచాక ఇదీ పరిస్థితి!!

సాక్షి, అమరావతి: అలవి మాలిన హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం చంద్రబాబు అభూత కల్పనలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా గత ఐదేళ్లూ అమలైన పథకాలు, వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి పేద వర్గాలకు తీరని ద్రోహం తలపెట్టారు. ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పిన ‘తల్లికి వందనం’ ఊసే లేదు. దీనికోసం 46 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. 

ఏటా రూ.20 వేలు చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం ఎటు పోయిందో తెలియక 54 లక్షల మంది అన్నదాతలు ఉసూరుమంటున్నారు. కోటి మందికిపైగా యువత నిరుద్యోగ భృతి లేదంటే ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇక చంద్రబాబు ప్రకటించిన పేదలను ధనికులుగా మార్చే ‘పూర్‌ టు రిచ్‌’ కాన్సెప్ట్‌ కాగితాలకే పరిమితం! ‘యువగళం’, ‘ఆడబిడ్డ నిధి’ పథకాలు కనుచూపు మేరలో లేవు. 

‘ఆడబిడ్డ నిధి’ కోసం 1.80 కోట్ల మంది మహిళలు ఆశగా పడిగాపులు కాస్తున్నారు. అయితే కనీసం వాటిని అమలు చేసే ఉద్దేశం కూడా ప్రభుత్వ పెద్దల్లో కానరాక పోవడంతో మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అంతా అదే జగన్‌ అధికారంలో ఉండి ఉంటే ఈ సమయానికి ఏ పథకాల కింద, ఎంత లబ్ధి చేకూరేదో బేరీజు వేసుకుంటున్నారు. గత ఐదేళ్లూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ప్రజల ఇంటి వద్దకే వైఎస్‌ జగన్‌ చేరవేశారు. 


రాజకీయ వేదికలుగా ప్రభుత్వ విద్యా సంస్థలు..
అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలో 16 వేలకుపైగా పోస్టులతో మెగా డీఎస్సీని పూర్తి చేస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన తొలి సంతకం మురిగిపోయింది! వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని విద్యా సంస్కరణలను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కారు ఆర్నెళ్లుగా ప్రభుత్వ పాఠశా>లలపై అనేక ప్రయోగాలు చేసి ఒక్క హామీనీ అమలు చేయలేదు. 

ఐబీ, సీబీఎస్‌ఈ, టోఫెల్‌ను రద్దు చేసి.. తల్లికి వందనం పథకం అమలుపై మాత్రం చేతులెత్తేసింది. ఇంగ్లీషు మీడియం చదువులు, డిజిటల్‌ తరగతి గదులు, పిల్లలకు ట్యాబ్‌లపై చేతులెత్తేసింది. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేట్‌కు లబ్ధి చేకూరుస్తోంది. రాష్ట్రంలో స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఓ  కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికీ ఇస్తామన్న హామీ గాలికి ఎగిరిపోయింది. 

స్కూళ్లల్లో అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చిందే గానీ ఒక్క విద్యా సంస్కరణను అమలు చేసింది లేదు. మెగా పీటీఎం పేరుతో ఉపాధ్యాయులను ఉరుకులు పెట్టించి ప్రభుత్వ విద్యా సంస్థలను రాజకీయ ప్రచార వేదికలుగా మార్చేశారు. రాష్ట్రానికి రావాల్సిన 700 ఎంబీబీఎస్‌ సీట్లకు మోకాలడ్డిన కూటమి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు మన విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది. 

అన్ని విధాలా దగా పడిన రైతన్న 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని రెండు వ్యవసాయ సీజన్లు గడుస్తున్నా అందించలేదు. అన్నదాతా సుఖీభవ కోసం 54 లక్షల మంది అన్నదాతలకు రూ.10 వేల కోట్లు అవసరం కాగా బడ్జెట్‌లో రూ.1000 కోట్లు మాత్రమే విదిలించడం గమనార్హం. ఇంతవరకు పథకం విధివిధానాలే ఖరారు చేయలేదు. 

ఇక ఖరీఫ్‌ 2023 సీజన్‌కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. సున్నా వడ్డీ రాయితీ ఊసే లేదు. రబీ సీజన్‌లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. 

ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు సేవా కేంద్రాలను (ఆర్బీకేలు) చంద్రబాబు నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేల ద్వారా నాన్‌ సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేశారు. గత ఆర్నెళ్లలో 70 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది.


జాడలేని ఆడబిడ్డ నిధి..
19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలందరికీ ఏటా రూ.18 వేలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సహాయం అందచేస్తామని సూపర్‌ సిక్స్‌ హామీల్లో చంద్రబాబు పేర్కొన్నారు. 1.80 కోట్ల మంది మహిళలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. 

నిరుద్యోగికి నయవంచన..
యువతకు ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నెలకు రూ.4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి రూ.57,600 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్‌లో ఇందుకు ఒక్కపైసా విదల్చక పోవటాన్ని  బట్టి నిరుద్యోగ భృతి లేదని తేలిపోయింది.

వైఎస్‌ జగన్‌ హయాంలో ఏటా ఏప్రిల్‌లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.. మే లో విద్యా దీవెన, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా.. జూన్‌లో అమ్మ ఒడి.. జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు.. ఆగస్టులో విద్యా దీవెన, నేతన్న నేస్తం.. సెప్టెంబర్‌లో చేయూత.. అక్టోబర్‌లో రైతు భరోసా.. నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు సున్నా వడ్డీ రుణాలు.. డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేపట్టారు.

సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన ఇతర ముఖ్యమైన హామీలు
⇒ పూర్‌ టు రిచ్‌.. పీ–4 పథకాలు అంటూ ఇంతవరకు ఏ ఒక్కటీ ప్రకటించలేదు
⇒ ఏటా జాబ్‌ క్యాలెండర్‌ జాడే లేదు
⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను హామీ మేనిఫెస్టోకే పరిమితం.
⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ అమలు చేయలేదు
⇒ ఉద్యోగుల సీపీఎస్, జీపీఎస్‌ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పి కనీసం చర్చ కూడా జరపలేదు
⇒ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్, డీఏ ప్రకటిస్తామనే హామీని విస్మరించారు
⇒ వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచకపోగా ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పాడారు
⇒ కాపుల సంక్షేమ కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి బడ్జెట్‌లో అందుకు తగ్గట్టు నిధులు ఇవ్వలేదు
⇒ విద్యుత్‌ బిల్లుల భారం తగ్గించకపోగా ఆర్నెళ్లలోనే రూ.15 వేల కోట్లకుపైగా చార్జీల భారం మోపారు.
⇒ ఉచితంగా ఇసుక అంటూ దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు.

ఆసరా, చేయూత అసలే లేవు
వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉండగా పేద మహిళలను ఆర్థికంగా నిలబెట్టిన చేయూత, సున్నా వడ్డీ, ఆసరా లాంటి పథకాలు చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడంతో అక్క చెల్లెమ్మల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పటికే అందాల్సిన మత్స్యకార భరోసాగానీ, వాహనమిత్ర లాంటి పథకాలుగానీ అందలేదని ఆయా వర్గాలు వాపోతున్నాయి. 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న హామీ బూటకంగా మారింది. 

కొత్తవి లేవు.. అన్నీ రద్దులే
తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతోపాటు వారి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతానంటూ ఉగాది పండుగ సందర్భంగా ఇచ్చిన హామీని చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పలికి 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారు. 

ఉచిత గ్యాస్‌లోనూ మాయ
ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు జిమ్మిక్కులతో మహిళలను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దీంతో కేవలం కోటి మందికి మాత్రమే ఒక్క సిలిండర్‌ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది రెండు సిలిండర్లకు కోత పెట్టారు.

రూ.15,485.36 కోట్ల విద్యుత్‌ చార్జీల భారం
అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని.. ఇంకా తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్‌ షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే రూ.6,072.86 కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని వినియోగదారులపై మోపిన కూటమి ప్రభుత్వం మరో రూ.9,412 కోట్ల భారం కూడా మోపేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్నెళ్లలో వేసిన మొత్తం విద్యుత్‌ చార్జీల భారం రూ.15,485.36 కోట్లకు చేరింది.

మద్యం సిండికేట్లతో లూటీ
ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసిన సీఎం చంద్రబాబు టీడీపీ సిండికేట్‌ దోపిడీకి రాచబాట పరిచారు. ప్రైవేటు మద్యం దుకాణాలను నెలకొల్పారు. టెండర్ల ప్రక్రియను ఏకపక్షంగా నిర్వహించి టీడీపీ సిండికేట్‌కే అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా చేశారు. ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా పోలీసు యంత్రాంగంతో బెదిరించి అడ్డుకున్నారు. మాట వినకుంటే దాడులకు పురిగొల్పారు. 

తద్వారా రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్‌ గుప్పిట పట్టింది. ప్రతి మద్యం దుకాణం పరిధిలో 4 నుంచి పది వరకు బెల్ట్‌ షాపులను ఏర్పాటు చేసి ఊరూవాడా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పీ కంటే రూ.15, బెల్ట్‌ దుకాణాల్లో ఎంఆర్‌పీ కంటే రూ.25 చొప్పున అధిక ధరలకు విక్రయిస్తూ అడ్డగోలుగా దోపిడీకి తెర తీశారు. మద్యం విక్రయాల ద్వారా టీడీపీ సిండికేట్‌ ఏటా రూ.41,850 కోట్ల చొప్పున ఐదేళ్లలో 2.09 లక్షల కోట్ల దోపిడీకి పన్నాగం పన్నింది.

పాలనా వైఫల్యాలు.. డైవర్షన్‌ రాజకీయాలు
ఆర్నెళ్ల పాలన అంతా వైఫల్యాల మయంగా మారడంతో డైవర్షన్‌ రాజకీయాలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్‌లో రుషికొండ భవనాల పేరుతో బురద చల్లి మభ్యపుచ్చేందుకు యత్నించారు. ఆగస్టులో కాదంబరి జెత్వానీ కేసు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. సెప్టెంబర్‌లో  ప్రకాశం బ్యారేజీని వైఎస్సార్‌సీపీ నేతలు బోట్లతో ఢీకొట్టి ధ్వంసం చేయడానికి కుట్ర పన్నారంటూ ఏమార్చే కుతంత్రాన్ని రచించారు. 

ఆ తర్వాత తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీ­యడమే కాకుండా తిరుమలను రాజకీయాలకు వాడుకున్న వ్యక్తిగా మిగిలిపోయారు. అక్టోబర్‌లో వైఎస్సార్‌ కుటుంబ వ్యవహారాలను వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేశారు. నవంబర్‌లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కుప్పలు తెప్పలుగా సోషల్‌ మీడియా కేసులు పెట్టారు. 

అమెరికాలో అదానీపై కేసుల వ్యవహారాన్ని వైఎస్‌ జగన్‌కు ముడిపెట్టి దుష్ప్రచారానికి కుట్ర పన్నారు. కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతుల వ్యవహారాన్ని రాజకీయం చేసి తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విఫల యత్నాలు చేస్తున్నారు.

ఇది అప్పుల కుప్ప ప్రభుత్వం
సంపద సృష్టిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని నిరంతరం అప్పుల ఊబిలోకి దించుతున్నారు. ఇప్పటివరకు రూ.67,237 వేల కోట్ల మేర కొత్త అప్పులు చేసి రికార్డు సృష్టించారు. అతి తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ అప్పులు చేశారు. ఇన్ని అప్పులు చేసి కూడా హామీలను నెరవేర్చలేదు.

ఉచితం అంటూ.. ఇసుక దోపిడీ
ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం యార్డుల్లో 80 లక్షల టన్ను­లను నిల్వ చేయగా కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ ప్రజాప్రతినిధులు మాయం చేశారు. 108 రీచ్‌లకు షార్ట్‌ టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద అయిన వారికి అప్పగించేశారు. ఇసుక లేక నిర్మాణ రంగం స్తంభించి లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికులు అల్లాడుతున్నారు. 

భూ సమస్యలు మళ్లీ మొదటికి
ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ద్వారా భూ వివాదరహితంగా మార్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లక్షలాది ఎకరాల భూములపై ఆంక్షలు తొలగిస్తే ఇప్పుడు టీడీపీ మళ్లీ ఆంక్షలు పెట్టి రైతులను కష్టాల్లోకి నెడుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement