కోకో.. లాభాల కేక.. | AP tops in cocoa production | Sakshi
Sakshi News home page

కోకో.. లాభాల కేక..

Published Sun, Nov 3 2024 4:51 AM | Last Updated on Sun, Nov 3 2024 4:51 AM

AP tops in cocoa production

సాగు, ఉత్పాదకత, ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ టాప్‌

ఐదేళ్లలో రికార్డు స్థాయిలో విస్తరణ 

21 వేల హెక్టార్ల నుంచి 44,993 హెక్టార్లకు పెరిగిన సాగు 

దేశంలో సాగవుతున్న విస్తీర్ణంలో 41 శాతం ఇక్కడే 

దిగుబడుల్లోనూ మన రాష్ట్రమే నంబర్‌–1 

పెద్దఎత్తున చాక్లెట్‌ పరిశ్రమల ఏర్పాటుకు చేయూత ఇచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం  

సాక్షి, అమరావతి: నోరూరించే చాక్లెట్లు, బిస్కెట్లు, పానీయాలతో పాటు బేవరేజెస్, ఏడిబుల్, మెడికల్, కాస్మోటిక్స్‌ వంటి వాటి తయారీలో విరివిగా ఉపయోగించే కోకో సాగుకు ఆంధ్రప్రదేశ్‌ కేరాఫ్‌గా మారింది. ఐదేళ్లుగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విస్తరించడమే కాదు చరిత్రలో ఎప్పుడూలేని విధంగా టన్నుకు రూ.10 లక్షలకు పైగా రైతులకు కాసుల వర్షం కురిపించింది. 2019కు ముందు కేవలం 21వేల హెక్టార్లలో మాత్రమే సాగు జరిగేది. అలాంటిది ఏటా 5వేల హెక్టార్ల చొప్పున వైఎస్‌ జగన్‌ సర్కారు విస్తరించడంతో మొత్తం విస్తీర్ణం ప్రస్తుతం 44,993 హెక్టార్లకు పెరిగింది.

ఇక జాతీయ స్థాయిలో 1.11 లక్షల హెక్టార్లలో కోకో సాగవుతుండగా, అందులో 41శాతం ఏపీలోనే సాగవుతోంది. ఇక దిగుబడులపరంగా చూస్తే జాతీయ స్థాయిలో 30,388 టన్నుల దిగుబడులొస్తుండగా, అందులో 19,436 టన్నులు మన రాష్ట్రం నుంచే వస్తున్నాయి. సాగులోనే కాదు.. ఉత్పాదకత, ఉత్పత్తిలో కూడా దేశంలోనే నెం.1గా ఏపీ నిలిచింది. అలాగే, ఏటా 80–85 శాతం పంట జనవరి నుంచి జూన్‌ వరకు, 15–20 శాతం పంట జూలై నుంచి అక్టోబరు మధ్య కోతకు వస్తుంది. దిగుబడిలో 80 శాతం పీపీపీ పద్ధతిలో రైతుల నుంచి నేరుగా క్యాడ్బరీ సంస్థ సేకరిస్తుంది. మిగిలిన వాటిని నెస్లే, క్యాంప్కో, లోటస్‌ వంటి కంపెనీలూ కొనుగోలు చేస్తుంటాయి.  

ఐదేళ్లలో కొత్తగా 25 వేల హెక్టార్లు
రాష్ట్రంలో 2.58 లక్షల ఎకరాల్లో కొబ్బరి, 5.46 లక్షల హెక్టార్లలో ఆయిల్‌ పామ్, 3.50 లక్షల ఎకరాల్లో జీడి మామిడి సాగవుతుంది. ప్రస్తుతం కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో మాత్రమే అంతర్‌ పంటగా కోకోను జీడి మామిడిలో కూడా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. నాటిన తర్వాత మూడేళ్ల పాటు హెక్టార్‌కు రూ.20వేల వరకు ఆరి్థక చేయూతనివ్వడంతో పాటు సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం.. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీపై బిందు పరికరాలందిస్తూ ప్రోత్సహించారు. అలాగే, ప్యాక్‌ హౌసెస్‌ కోసం రూ.2 లక్షలు, ప్రాసెసింగ్‌ యూనిట్లకు రూ.10 లక్షలు, ఎఫ్‌పీఓల కోసం రూ.11లక్షల వరకు ఆరి్థక చేయూతనిచ్చారు. ఫలితంగా ఐదేళ్లలో 25వేల హెక్టార్లను కొత్తగా సాగులోకి తీసుకురాగలిగారు. హెక్టార్‌కు 850–950 కేజీల చొప్పున దిగుబడి వస్తోంది. నాటిన మూడో ఏట నుంచి మొదలై 40 ఏళ్లపాటు దిగుబడి వచ్చే పంట ఇది.  

రాలిన ఆకులతో భూసారం పెరుగుదల
కోకో చెట్ల నుంచి ఏటా టన్ను నుంచి రెండు టన్నుల ఆకులు రాలి నేలలో కలిసి భూసారం పెరుగుతుంది. భూమిపై ఏర్పడే ఆకుల పొరవల్ల కలుపు సమస్య ఉండదు. తోటల్లోని భూమిలో తేమ శాతం నిలిచి ప్రధాన పంటకు నీటి కొరత లేకుండా చేస్తుంది. కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో పిందె రాలిపోవడాన్ని నివారిస్తుంది. అంతర పంటగా కోకో సాగుచేయడంవల్ల ప్రధాన పంటల్లో 20 శాతం దిగుబడి పెరుగుతుందని సీటీఆర్‌ఐ తెలిపింది.  

ఆసియాలోనే అతిపెద్ద చాక్లెట్‌ ఫ్యాక్టరీ..
ఇక కోకో సాగులో నెం.1గా ఉన్న ఏపీలో మోండెలెజ్‌ ఇండియా ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.1,600 కోట్ల పెట్టుబడితో గతేడాది భారీ పరిశ్రమ నెలకొల్పింది. క్యాడ్బరీ, టాంగ్, బోరి్నవిటా, ఓరియో, 5–స్టార్‌ వంటి చాక్లెట్లు  ఉత్పత్తి చేసే ఈ సంస్థ ఏటా 2.20 లక్షల టన్నుల కోకోవాను ప్రాసెస్‌ చేసే సామర్థ్యంతో ఈ యూనిట్‌ ఏర్పాటుచేసింది. ప్రత్యక్షంగా 500 మందికి ఉపాధి కలి్పస్తుండగా, 18వేల మంది రైతులకు లబ్ధిచేకూరుతోంది. అలాగే, డీపీ చాక్లెట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏటా 60 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో చిత్తూరులో రూ.300 కోట్లతో 700 మందికి ఉపాధి కలి్పంచేలా ఇండస్ట్రియల్‌ అండ్‌ కన్సూ్యమర్‌ చాక్లెట్స్‌ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటుచేసింది. ఈ రెండు కంపెనీలు ప్రస్తుతం ఫామ్‌ గేటు వద్ద రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు.. ఏలూరులో రూ.75 కోట్లతో కోకోవా, వెనిలా ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పాలని సంకల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement