సాక్షి, అమరావతి: కోకో పంటకు ప్రపంచస్థాయి బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు స్థానికంగా మాత్రమే కోకో గింజలను విక్రయిస్తున్న రైతుల ద్వారా ఫైన్ ఫ్లేవర్డ్ కోకో గింజల్ని ఉత్పత్తి చేసి వాటిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో ఉత్పత్తి చేసిన ప్రీమియం కోకో గింజలను ఫ్రాన్స్‌కు ఎగుమతి చేయడంతో ఇదే స్ఫూర్తితో మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు చేయూతనివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.
కోకో సాగు, ఉత్పాదకతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఏపీలో సాగు విస్తీర్ణం నాలుగేళ్లలో 21వేల హెక్టార్ల నుంచి 39,714 హెక్టార్లకు విస్తరించింది. తద్వారా 10,903 టన్నుల కోకో గింజలు ఉత్పత్తి వస్తుండగా దిగుబడిలో 80 శాతం క్యాడ్బరీ, మిగిలింది నెస్ట్‌లే, క్యాంప్కో వంటి కంపెనీలు సేకరిస్తున్నాయి.
అదనపు ధర కల్పించడమే లక్ష్యంగా..
రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ఏలూరులో రూ.75 కోట్లతో కోకోవా, వెనీలా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేస్తున్న ప్రభుత్వం మరోవైపు గింజల్ని ఫర్మెంటేషన్ చేయడం ద్వారా నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. శాస్త్రీయ పద్ధతిలో ఫర్మెంటేషన్ వల్ల ప్రీమియం చాక్లెట్స్ తయారీకి అవసరమైన ఫ్లేవర్ కోకో గింజలకు వస్తుంది.
వీటికి మార్కెట్ ధర కంటే 30% అదనంగా చెల్లించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. సేంద్రియ పద్ధతిలో సాగు, శాస్త్రీయ పద్ధతిలో ఫర్మెంటేషన్ చేస్తే మరో 15% అదనంగా చెల్లిస్తామంటున్నాయి. ప్రీమియం చాక్లెట్స్ తయారీలో ఉపయోగించే ఫైన్ ఫ్లేవర్డ్ గింజల ఉత్పత్తే లక్ష్యంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా ప్రభుత్వం 35% సబ్సిడీపై రూ.28 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోంది.
గోదావరి కోకోకు గ్లోబల్ బ్రాండింగ్
గోదావరి కోకోకు గ్లోబల్ బ్రాండింగ్ కల్పించడమే లక్ష్యంగా ముందుకొచ్చే రైతులు, ఎఫ్‌పీఓలకు సబ్సిడీపై ఆర్ధిక చేయూతనిస్తున్నాం. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో మరింతమంది రైతుల ద్వారా ప్రీమియం కోకో గింజలను ఉత్పత్తి చేసి నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
– చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్
Comments
Please login to add a commentAdd a comment