న్యూఢిల్లీ: ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ స్థూల దేశీయోత్పత్తి 13.5 శాతంగా నమోదయ్యింది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (2021 ఏప్రిల్-జూన్) ఎకానమీ వృద్ధి రేటు 20.1 శాతంకాగా, మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో (జనవరి-మార్చి)లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కేవలం 4.09 శాతంగా నమోదయ్యింది. వినియోగం, సేవలుసహా పలు రంగాల్లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇక ఉత్పత్తి స్థాయి వరకూ విలువను పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ)ను తీసుకుంటే మొదటి త్రైమాసి కంలో 12.7 శాతంగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 17.6%.
13.5 శాతం వృద్ధి అంటే..
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ప్రకారం, 2021–22లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ (2011-12 స్థిర ధరల ప్రాతిపదికన) విలువ రూ.32.46 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.36.85 లక్షల కోట్లు. వెరసి వృద్ధి రేటు 13.5 శాతంగా ఉంది. ఇక జీవీఏను విలువను తీసుకుంటే, ఇది 12.7 శాతం వృద్ధితో రూ.34.41 లక్షల కోట్లుగా ఉంది. కాగా ద్రవ్యోల్బణం పెరుగుదలతో సర్దుబాటు చేయని నామినల్ జీడీపీ (కరంట్ ప్రైసెస్ వద్ద) విలువ మొదటి త్రైమాసికంలో 26.7 శాతం ఎగసి రూ.51.27 లక్షల కోట్ల నుంచి రూ.64.95 లక్షల కోట్లకు ఎగసిందని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది.
సవాళ్లు ఉన్నాయ్...
రానున్న త్రైమాసికాల్లో వృద్ధి తీరుపై ఆందోళనలు నెలకొన్నాయి. వ్యవస్థపై ద్రవ్యోల్బణం సవాళ్లు, వడ్డీరేట్ల భారం, ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మాంద్యం భయాలు వంటివి ఇక్కడ ప్రధానమైనవి. మొదటి త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలకన్నా తక్కువగా వృద్ధి రేటు నమోదవడం గమనార్హం. 2022-23లో జీడీపీ 7.2 శాతంగా అంచనా. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భావిస్తోంది.
సమీక్షా కాలంలో తయారీ రంగం 4.8 శాతంగా నమోదుకావడం ఆందోళన కలిగించే విషయం. ఇక ఎగుమతులకన్నా, దిగుమతుల పరిమాణం ఎక్కువగా ఉండడమూ సమస్యాత్మకమే. దీనికితోడు వర్షపాతం దేశ వ్యాప్తంగా విస్తృత ప్రాతిపదికన తగిన విధంగా లేనందున వ్యవసాయ వృద్ధి, గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణంపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. గడచిన ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతానికి పైబడి నమోదవుతుండడంతో మే నుంచి ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 1.40 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 5.4 శాతానికి చేరింది. బ్యాంకులు కూడా వడ్డీరేట్ల పెంపు బాటన నడవడం ప్రారంభించాయి.
7-7.5 శాతం శ్రేణిలో ఉండవచ్చు: కేంద్రం
భారత్ ఎకానమీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 నుంచి 7.5 శాతం శ్రేణిలో నమోదుకావచ్చని కేంద్రం భావిస్తోంది. 2021-22లో భారత్ 8.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. ‘‘మొదటి త్రైమాసిక గణాంకాలు మేము ఆశించిన తీరులోనే ఉన్నాయి. వివిధ రంగాల పనితీరు పూర్తిస్థాయి ఆశాజనకంగా ఉంది. వృద్ధి రేటు 7-7.5 శాతం శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నాం. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలుసైతం ఇదే అంచనాలను వెలిబుచ్చుతున్నాయి’’ అని ఫైనాన్స్ కార్యదర్శి టీవీ సోమనాథన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment