goveernment
-
గ్రామీణ యువతికి ఆరు నెలల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంత యువతులు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తాము యువకులకు ఏమాత్రం తక్కువకాదని నిరూపిస్తున్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కల్పన దీనికి ఉదాహరణగా నిలిచారు. రాజస్థాన్‌లోని ఫతేపూర్ షెఖావతి పరిధిలోని రినౌ గ్రామానికి చెందిన కల్పనా బిర్దా ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువతి. ఆమె తొలుత సీహెచ్ఎస్ఎల్లో క్లర్క్ ఉద్యోగం సంపాదించింది. తరువాత ఆడిటర్‌గా ఉద్యోగం దక్కించుకుంది. ఇప్పుడు సీజీఎస్టీలో ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేజిక్కించుకుంది. కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో కల్పన పెద్దది. బనస్థలి విద్యాపీఠ్‌లో చదువు పూర్తి చేసింది. కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. కల్పన తండ్రి మహిపాల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె తల్లి పొలం పనులతో పాటు ఇంటిపనులకు కూడా చేస్తుంది. కల్పన ఇన్స్పెక్టర్గా ఎంపికకావడంతో వారి ఇంటిలో ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. కల్పన మీడియాతో మాట్లాడుతూ తాను పోటీపరీక్షల కోసం తొలుత ఢిల్లీలో కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నానని, ఆ తర్వాత ఇంట్లోనే చదువుకున్నానని తెలిపింది. చదువుతో పాటు ఎప్పటికప్పుడు రివిజన్ కూడా చేసుకునేదానినని, ఈ రివిజన్ కారణంగానే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగానని తెలిపింది. -
చెక్కుచెదరని భారత్ వృద్ధి వేగం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ స్థూల దేశీయోత్పత్తి 13.5 శాతంగా నమోదయ్యింది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (2021 ఏప్రిల్-జూన్) ఎకానమీ వృద్ధి రేటు 20.1 శాతంకాగా, మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో (జనవరి-మార్చి)లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కేవలం 4.09 శాతంగా నమోదయ్యింది. వినియోగం, సేవలుసహా పలు రంగాల్లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇక ఉత్పత్తి స్థాయి వరకూ విలువను పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ)ను తీసుకుంటే మొదటి త్రైమాసి కంలో 12.7 శాతంగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 17.6%. 13.5 శాతం వృద్ధి అంటే.. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ప్రకారం, 2021–22లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ (2011-12 స్థిర ధరల ప్రాతిపదికన) విలువ రూ.32.46 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.36.85 లక్షల కోట్లు. వెరసి వృద్ధి రేటు 13.5 శాతంగా ఉంది. ఇక జీవీఏను విలువను తీసుకుంటే, ఇది 12.7 శాతం వృద్ధితో రూ.34.41 లక్షల కోట్లుగా ఉంది. కాగా ద్రవ్యోల్బణం పెరుగుదలతో సర్దుబాటు చేయని నామినల్ జీడీపీ (కరంట్ ప్రైసెస్ వద్ద) విలువ మొదటి త్రైమాసికంలో 26.7 శాతం ఎగసి రూ.51.27 లక్షల కోట్ల నుంచి రూ.64.95 లక్షల కోట్లకు ఎగసిందని ఎన్ఎస్ఓ పేర్కొంది. సవాళ్లు ఉన్నాయ్... రానున్న త్రైమాసికాల్లో వృద్ధి తీరుపై ఆందోళనలు నెలకొన్నాయి. వ్యవస్థపై ద్రవ్యోల్బణం సవాళ్లు, వడ్డీరేట్ల భారం, ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మాంద్యం భయాలు వంటివి ఇక్కడ ప్రధానమైనవి. మొదటి త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా తక్కువగా వృద్ధి రేటు నమోదవడం గమనార్హం. 2022-23లో జీడీపీ 7.2 శాతంగా అంచనా. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భావిస్తోంది. సమీక్షా కాలంలో తయారీ రంగం 4.8 శాతంగా నమోదుకావడం ఆందోళన కలిగించే విషయం. ఇక ఎగుమతులకన్నా, దిగుమతుల పరిమాణం ఎక్కువగా ఉండడమూ సమస్యాత్మకమే. దీనికితోడు వర్షపాతం దేశ వ్యాప్తంగా విస్తృత ప్రాతిపదికన తగిన విధంగా లేనందున వ్యవసాయ వృద్ధి, గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణంపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. గడచిన ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతానికి పైబడి నమోదవుతుండడంతో మే నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 1.40 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 5.4 శాతానికి చేరింది. బ్యాంకులు కూడా వడ్డీరేట్ల పెంపు బాటన నడవడం ప్రారంభించాయి. 7-7.5 శాతం శ్రేణిలో ఉండవచ్చు: కేంద్రం భారత్ ఎకానమీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 నుంచి 7.5 శాతం శ్రేణిలో నమోదుకావచ్చని కేంద్రం భావిస్తోంది. 2021-22లో భారత్ 8.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. ‘‘మొదటి త్రైమాసిక గణాంకాలు మేము ఆశించిన తీరులోనే ఉన్నాయి. వివిధ రంగాల పనితీరు పూర్తిస్థాయి ఆశాజనకంగా ఉంది. వృద్ధి రేటు 7-7.5 శాతం శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నాం. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలుసైతం ఇదే అంచనాలను వెలిబుచ్చుతున్నాయి’’ అని ఫైనాన్స్ కార్యదర్శి టీవీ సోమనాథన్ పేర్కొన్నారు. -
2 Years YSJagan Ane Nenu: ప్రజల నాడి పట్టిన ప్రభుత్వం
అమరావతి: పేద, మధ్యతరగతి ప్రజలు ఎవరూ ఇబ్బందిపడకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో వైద్య రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో మొదలు పెట్టి టెలిమెడిసన్ వరకు వైద్య సేవలను విస్త్రృతం చేశారు. గత రెండేళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వైద్యానికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే చాలు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సాయం పొందే వెసులుబాటు ఏపీ ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా క్యాన్సర్‌తో సహా 2,434 వైద్య ప్రక్రియలకు ఉచితంగా చికిత్సలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వెలుపల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలలోని 130కి పైగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచడంతో రాష్ట్రంలోని దాదాపు 95 శాతం కుటుంబాలు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వచ్చాయి. అంతేకాదు ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోగులు కోలుకునే వరకు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని జననేత వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా రోజుకు రూ. 225ల చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000ల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులూ రోగులకు ఆర్థిక భరసా కల్పిస్తున్నారు. పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు రెండు చెవులకూ కాక్లియర్ పరికరం అమర్చడం వంటి అరుదైన సేవలందిస్తోంది. కార్పొరేటుకి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు సమూలంగా మార్చి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్య సేవలు అందించాలనే లక్క్ష్యంతో నాడు-నేడు పథకం కింద ఆసుపత్రుల ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్‌లు, 1,147 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆసుపత్రులు, 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనంత మంది సిబ్బంది ఉండాలనే లక్ష్యంతో గడిచిన రెండేళ్లలో 9,712 డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందిని నియమించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కొత్త మెడికల్ కాలేజీలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ వంతున కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు వీటికి తోడుగా కొత్తగా మూడు క్యాన్సర్, రెండు కిడ్నీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు గిరిజన ప్రాంత ప్రజల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐటీడీఏల పరిధిలో ఆరు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టారు. దశలవారీగా మూడేళ్లలో అన్ని పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 1,088 కొత్త అంబులెన్సులు ఆపత్కాలంలో రోగులకు అత్యసర వైద్య సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం రూ.210 కోట్లతో 1,088 అంబులెన్సులు కొనుగోలు చేసింది. వీటిని 104, 108 సర్వీసులలో ఉపయోగిస్తున్నారు. ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే ఘటనా స్థలికి అంబులెన్స్ చేరుకునే వీలు చిక్కింది. మరోవైపు 104 సేవల్లో భాగంగా వైద్య సిబ్బంది పల్లెలకు వెళ్లి బీపీ, షుగర్, ఈసీజీ ఇలా 20 రకాల వైద్య సేవలతో పాటు మందులు ఉచితంగా అందిస్తున్నారు. 104, 108 సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు నేటి పరిస్థితులకు తగ్గ గౌరవ వేతనం అందిస్తున్నారు. కంటి వెలుగు వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా కంటి వైద్య సేవలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారికి కంటి అద్దాలు అందిస్తున్నారు. మరోవైపు అవ్వా తాతలకు గ్రామ సచివాలయాల్లో ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేపడుతున్నారు. శస్త్ర చికిత్సలు జరిగిన వారికి ఇంటివద్దకే వచ్చి ఉచిత కంటి అద్దాలు అందచేసేలా ఈ పథకానికి సీఎం జగన్ రూప కల్పన చేశారు. టెలిమెడిసిన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14,410 కాల్ సెంటర్ ద్వారా టెలిమెడిసిన్ సేవలు అందిస్తోంది. ప్రతీ జిల్లాకు ఒక టెలిమెడిసిన్ సేవా కేంద్రంతో పాటు ప్రతీ కేంద్రంలో 10 నుంచి 15 మంది స్సెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. వీరు రోగి నుంచి జబ్బు వివరాలు తెలుసుకొని మందులు, సూచనలను ఫోన్ ద్వారా అందిస్తున్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో టెలీమెడిసిన్ కేంద్రాల ద్వారా ప్రతి రోజు వేలాదిమంది రోగులకు ఆరోగ్య సేవలు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. -
ఇంటి నుంచే స్పందన
సాక్షి, రైల్వేకోడూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలగజేస్తోంది. పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపడంతో వారం వారం ఈ కార్యక్రమానికి వెల్లువెత్తుతున్నారు. అర్జీలు చేతబట్టి సోమవారం వేలాదిగా తరలివస్తున్నారు. అధికారులు వారి వినతులు స్వీకరించిఎప్పటిలోగా పరిష్కరించేదీ ఒక రశీదు కూడా ఇస్తున్నారు. ఇది ఎక్కువగా ప్రజలను ఆకర్షిస్తోంది. దీనిపై ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఒక్క సోమవారమే కాకుండా ఎప్పుడైనా ఇంటి నుంచే నేరుగా ఆన్లైన్లో అర్జీలు సమర్పించే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశం.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వీలుపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిగా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం ఉంటేచాలు అధికారుల చెంతకు వెళ్లి అర్జీలు ఇవ్వాల్సిన అవసరం తప్పుతుంది. ప్రతి సోమవారం ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. మండల , జిల్లా, రాష్ట్ర కార్యాలయాలకు వెళ్లి అర్జీలు ఇవ్వాలంటే ప్రజలు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. అర్జీ ఇవ్వడానికి కొంత కష్టపడక తప్పడం లేదు. ఇలాంటి వారి ఇబ్బందులు తొలగించేలా ఆన్లైన్లో అర్జీ సమర్పించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వారంలో అన్నిరోజుల్లోనూ వినతులను ఆన్లైన్లో తెలియజేయవచ్చు. ఇందుకు సంబంధించి సమగ్ర సమాచారం ఆన్లైన్ పోర్టల్‌లో ఉంచింది. జిల్లా, మండల, గ్రామాల వారీగా వివరాలు పేర్కొని సమస్యను నివేదించేలా పోర్టల్‌ను తీర్చిదిద్దారు. ఆన్లైన్లో అర్జీలు నమోదు చేసుకోవడం చాలా సులభం.. ఆన్లైన్ పోర్టల్‌లో అర్జీలను నమోదుచేసుకోవడం సులభం. సమాచారం తెలుగులోనూ ఉంటుంది. స్పందన.ఏపి.జీఓవి.ఇన్ టైప్ చేస్తే స్పందన పోర్టల్ తెరుచుకుంటుంది. దీని గురించి క్షుణంగా తెలుసుకోవాలంటే వాడుక సూచికపై క్లిక్ చేయాలి. ఇందులో 50 పేజీలు ఉన్న పీడీఎఫ్ ఫైల్ తెరుచుకుంటుంది. ఇందులో ప్రతి అంశాన్ని పొందుపరిచారు. ఇలా దరఖాస్తు చేయాలి.. దరఖాస్తు చేయాలంటే ఆన్‌లైన్‌యూజర్ లాగిన్‌పై క్లిక్ చేయాలి. ప్రత్యేకంగా ఒక పేజి తెరపై కనిపిస్తుంది. ఆన్లైన్ సిటిజన్ లాగిన్‌ను క్లిక్ చేయాలి. ఆధార్ సంఖ్య నమోదు చేయమని అడుగుతుంది. తరువాత ఆధార్‌తో అనుసంధానమైన చరవాణికి ఓటీపీ సంఖ్య వస్తుంది. దీనిని నమోదు చేయాలి. తక్షణం స్పందన అర్జీ పేజీ తెరుచుకుంటుంది. ఇందులో మూడు సూచికలు పొందుపరిచారు. మొదటిది యూజర్ ఇన్‌బాక్స్, రెండోది అర్జీ నమోదు, మూడోది అర్జీ నకలు జతచేయడం. యూజర్ ఇన్‌బాక్స్‌ను క్లిక్ చేస్తే గతంలో ఆధార్ సంఖ్యతో అనుసందానమై అర్జీలు ఆన్లైన్లో నమోదుచేసి ఉంటే వివరాలు కనిపిస్తాయి. వాటి ప్రగతి తెలుసుకోవచ్చు. రెండో సూచిక అర్జీ నమోదుపై క్లిక్‌చేస్తే స్పందన దరఖాస్తు తెరపై కనిపిస్తుంది. ఇందులో ఫిర్యాదు చేయాల్సిన ప్రభుత్వ విభాగాన్ని ఎంచుకుని అంశాల వారీగా వివరాలు నమోదు చేయాలి. ఇదే పేజీలో దిగువన టైప్ అన్న చోట ఆన్లైన్ యూజర్ అనే ఆప్షన్ ఎంచుకున్నాక ప్రభుత్వ శాఖల వివరాలు ఎంపిక చేసుకుని దరఖాస్తు అంశాలు నింపే వీలుంటుంది. రిపోర్టులు, ఇతర స్కాన్ ఫైళ్లు కూడా పంపేందుకు అర్జీ నకలు జతచేయండి అనే అంశంపై క్లిక్‌చేసి అప్లోడ్ చేసేలా తీర్చిదిద్దారు. ఈ విధానం ప్రజలకు ఎంతో మేలు చేసేవిదంగా తీర్చిదిద్దారని పలువురు తెలుపుతున్నారు. -
అయినా మనిషి మారలేదు
‘మారిన మనిషిని నేను.. నన్ను నమ్మండి.. మీ జోలికి రాను’ అని 2014 ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాటలివి.. బాబు చెప్పిన మాటలు నమ్మిన ఉద్యోగులు ఆయనను ముఖ్యమంత్రి కుర్చీలో కుర్చోబెట్టారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. సమస్యలు పక్కనబెట్టి క్షణం తీరిక లేకుండా టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలు అంటూ వారిని పరుగులు తీయించాడు. నాలుగున్నర సంవత్సరాలు ఉద్యోగులకు నిద్రలేకుండా చేసిన చంద్రబాబు వారి జీవితాలతో ఆడుకున్నాడు. బాబు తీరుతో విసిగిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు నిన్ను నమ్మం బాబూ అంటూ తేల్చిచెబుతున్నారు. నెల్లూరు(పొగతోట): 2019 ఎన్నికలు సమీపించడంతో మళ్లీ ఇప్పుడు సీఎం చంద్రబాబుకు ప్రభుత్వ ఉద్యోగులపై అభిమానం పెరిగిపోయింది. 20 శాతం ఐఆర్ ఇస్తూ కొద్దిరోజుల క్రితం జీఓ జారీ చేశారు. పీఆర్సీ కమిటీ వేయడంలోనూ జాప్యం చేశాడు. తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో చేసేదేమీ లేక చంద్రబాబు గత ప్రభుత్వం ఇచ్చిన 29 శాతం కలుపుకుని 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించాడు. చంద్రబాబు ప్రకటించింది 14 శాతం మాత్రమే. చంద్రబాబుకు భజన సంఘాలు ఉన్నాయి. ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఆ సంఘాలు భజన బృందాలుగా మారిపోయాయి. ఉద్యోగులకు హెల్త్‌కార్డులకు సంబంధించి గెజిటెడ్ ఉద్యోగుల నుంచి నెలకు రూ.120, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల నుంచి రూ.90 వసూలు చేస్తున్నారు. హెల్త్‌కార్డుల ద్వారా ఉద్యోగులకు వైద్యసేవలు అందడం లేదు. హెల్త్‌కార్డుల ద్వారా మెరుగైన వైద్యసేవలు అందక ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన చేసినా ఫలితం లేదు. ఉద్యోగుల ఆశలపై నీళ్లు జిల్లాలో 28 వేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సుమారు 25 వేల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉద్యోగులతో అధికంగా పనులు చేయించుకోవడమే కానీ వారికి ఉపయోగపడింది చాలా తక్కువ. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ప్రకటించి పెండింగ్‌లో ఉన్నాయి. మూడో డీఏ కూడా రాబోతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించి జీఓ విడుదల చేస్తే నగదు వెంటనే తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన ఐఆర్ జీఓ ఉద్యోగుల కంటితుడుపు చర్యగా ఉంది. చంద్రబాబు చరిత్రలో లేని విధంగా ఎన్నికల ముందు ఐఆర్ జీఓ విడుదల చేశాడని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐఆర్ ప్రకటించి జూన్‌లో నగదు తీసుకునేలా జీఓ విడుదల చేయడం పట్ల ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఇతర శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ జీఓ నంబర్ 27ను తీసుకువచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. ఇంతవరకు అమలు చేయలేదు. 2019లో కూడా ఇదే హామీ ఇచ్చాడు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు రాయితీలు కోల్పోతున్నారు. చంద్రబాబు తీరుతో ప్రభుత్వ ఉద్యోగులు విసిగి వేసారిపోయారు. నిన్ను నమ్మం బాబూ అంటూ తేల్చిచెబుతున్నారు. సీఎంకు ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే 2018 జూలై నుంచి అరియర్స్ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించిన వెంటనే రాష్ట్ర ఉద్యోగులకు డీఏ ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ రూ.20 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ఉద్యోగులకు తక్కువ ధరలకు నివాస స్థలాలు కేటాయించాలని ఇలాంటివి చేసే ప్రభుత్వం రావాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఐఆర్ 27 శాతం ప్రకటించిన వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, సకాలంలో పీఆర్సీ, 43 శాతం కన్నా మిన్నగా ఫిట్మెంట్ ఇస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వం పింఛన్ ఇవ్వదు.. మీరే ఆదుకోండి..!
సాక్షి, రామభద్రపురం: ఈ చిత్రంలోని వృద్ధుల పేర్లు నూకమ్మ, సీతయ్య. రామభద్రపురం మండలం గొల్లవీధికి చెందినవారు. ఒక కుమార్తె. ఆమెకు పెళ్లి చేసి పంపించారు. కానీ ప్రస్తుతం ఎలాంటి ఆధారం లేక బతుకుబండి భారంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పింఛన్ డబ్బులు కూడా రావడం లేదు. వాస్తవానికి నూకయ్యకు 73, సీతమ్మకు 67 ఏళ్లు ఉంటాయి. కానీ ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లో వయసు తక్కువ పడింది. దీంతో ప్రస్తుతం ఇటీవల తీసుకొచ్చిన 65 ఏళ్లకే పెన్షన్ ప్రకారం ఇద్దరికి పింఛన్ అందడం లేదు. మహానేత వైఎస్సార్ హయాంలో ఇద్దరికి పింఛన్ వచ్చేది. ఇప్పుడు రావడం లేదు. వృద్ధులు కావడంతో పని చేసేందుకు శక్తి లేదు. ఆస్తులు లేవు. కూమార్తెకు పెళ్లి చేసినా అల్లుడు తాగుబోతు కావడంతో ఆమె పరిస్థితి అలాగే ఉంది. మొన్నటి వరకు ప్రభుత్వం అందించే 10 కేజీల బియ్యంతో కాలం గడిపేవారు. కానీ ఇటీవల నూకయ్య ఆరోగ్యం బాగాలేకపోతే రేషన్ కార్డును కుదువ పెట్టేశారు. ఇప్పుడు ఆ బియ్యం కూడా కరువైపోయే. ఈ విషయం మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ కె.అప్పారావుకు తెలిసింది. వెంటనే స్పందించి నెలకు 25 కేజీల చొప్పున బియ్యం అందిస్తున్నాడు. ఇప్పటికైనా దిక్కులేని వారికి దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే 91824 35104, 98854 08274 నంబర్లకు సంప్రదించాల్సిందిగా అప్పారావు కోరుతున్నారు. -
ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు గట్టి షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు షాకిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పటికే బేసిక్ ఎక్సైజ్ సుంకంతో విదేశీ మొబైల్స్‌కు చెక్ చెప్పిన ప్రభుత్వం మరోసారి కొరడా ఝుళిపించింది. వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మొబైల్స్‌పై బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకనుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్న మొబైల్ ఫోన్ల ధరలు మోత మోగనున్నాయి. మేక్ ఇన్ ఇండియాకు మరింత ప్రోత్సాహమిచ్చే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్లపై గతంలో విధించిన 10శాతం బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని తాజాగా 15శాతానికి పెంచింది. దీనికి సంబంధించి గురువారం రాత్రి రెవెన్యూ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కలర్ టీవీలు, మైక్రోవేవ్ అవెన్లపై బేసిక్ కస్టమ్ సుంకాన్ని 20శాతంగా నిర్ణయించింది. ఎలక్ట్రిక్ ఫిల్మెంట్, వాటర్ హీటర్లు, హెయిర్ డ్రెస్సింగ్ సాధనాలు, డిశ్చార్చ్ లాంప్స్ లాంటి కొన్ని ఇతర అంశాలపై కూడా కస్టమ్స్ సుంకాన్ని సవరించింది. దేశీయ పరిశ్రమలకు ప్రోత్సహహంతోపాటు, ఇప్పటికే తయారీలో ఉన్న కంపెనీలకు గట్టి పోటీ ఉండేలా ఈ చర్య చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కాగా గత జూలైలో మొదటిసారి బేసిక్ కస్టమ్ సుంకాన్ని విధించిన ప్రభుత్వం దేశీయ మొబైల్ కంపెనీలకు ఊతమిచ్చేలా విదేశీ మొబైల్స్‌పై దీన్ని10శాతంగా పేర్కొన్న సంగతి విదితమే. -
రవాణా రంగం నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర
– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏగఫూర్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కేంద్ర ప్రభుత్వం రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే కుట్ర పన్నుతోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యద్శి ఎంఏ గఫూర్ ఆరోపించారు. పెంచిన ఆర్టీఏ చలానా, జరిమానాలతో కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మోటార్స్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా కార్యాలయంలో ఈ.పుల్లారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. నూతన మోటార్ ట్రాన్స్‌ఫోర్టు చట్టంతో కార్మికులు జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఫీజులను తగ్గించకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. మోటార్ ట్రాన్స్‌ఫోర్టు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ సుభాన్ మాట్లాడుతూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక చాలా మంది యువకులు ఆటోలు, లారీలు, ఇతర వాహనానలు నడుపుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వీరు రోజంతా కష్టపడితే వచ్చే నగదంతా చలానాలు, జరిమానాలు కట్టడానికే సరిపోతే వారి కుటుంబాల జీవనం ఎలా సాగించాలని ప్రశ్నించారు. ఇప్పటికే ఆర్టీఏ అధికారుల దాడులతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే చలానా, జరిమానాల ఫీజులను పెంచితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లాంగ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మిన్నల్లా, లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు రామకృష్ణ, యూసుఫ్ మియ్యా, లైట్ వెహికల్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస యాదవ్, మెకానిక్స్ యూనియన్ నాయకులు గోవిందు పాల్గొన్నారు. పోరాట కమిటీ ఎన్నిక పెంచిన ఆర్టీఏ చలానా, జరిమాన ఫీజులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు పోరాట కమిటీని ఎన్నకున్నారు. కమిటీ కన్వీనర్‌గా సీఐటీయూ నాయకులు ఇ.పుల్లారెడ్డి, కోకన్వీనర్ మిన్నల్లా, యూసూఫ్మియాతోపాటు 12 రంగాల నుంచి 42 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.