మేఘసందేశం = ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీ వర్షాలు | Heavy Rains Across Telangana In August And September | Sakshi
Sakshi News home page

మేఘసందేశం = ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీ వర్షాలు

Published Mon, Jul 15 2019 2:28 AM | Last Updated on Mon, Jul 15 2019 11:09 AM

Heavy Rains Across Telangana In August And September - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘నైరుతి’ నిస్తేజంతో దిగాలుపడుతున్న తెలుగు రాష్ట్రాల రైతులకు వాతావరణ నిపుణులు తీపి కబురు అందించారు. ప్రపంచ వాతావరణంపై ప్రత్యేకించి మన దేశంలో రుతుపవనాల కదలికలపై ప్రతికూల ప్రభా వం చూపుతున్న ఎల్‌ నినో స్థితి క్రమంగా బలహీనపడుతోందని తాజా అధ్యయనంలో తేల్చారు. ఇది ఒకటి, రెండు నెలల్లో తటస్థ స్థితికి చేరుకుంటుందని, దీని ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తు తం నైరుతి రుతుపవనాలు బలహీనంగా మారడంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు  నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నెలకొంది. దీంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఫలితంగా దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ పరిస్థితులకు ప్రధానంగా ఎల్‌నినో ప్రభావం, నైరుతి రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు తరలిపోవడమే కారణం. నైరుతి రుతుపవనాల ఆగమనం, విస్తరణకు అనేక సందర్భాల్లో అడ్డుగా నిలిచేది ఎల్‌నినో అనేది తెలిసిందే. అదిప్పుడు బలహీన పడుతుండటంతో రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నా యని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సాధారణంగా దక్షిణాదివైపు రావాల్సిన నైరుతి రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు వెళ్లిపోయింది. ఆ రుతుపవన ద్రోణి ఇప్పుడు తిరిగి దక్షిణాది ప్రాంతంపైకి త్వరలో రానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో సాధారణం కంటే భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధి కారి రాజారావు తెలిపారు. ఎల్‌నినో క్రమంగా బలహీన పడుతుండటంతో మున్ముందు మంచి వర్షాలు కురుస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు కూడా విశ్లేషించారు. రుతుపవనాలపై దాని ప్రభావం పూర్తిగా తొలగిపోకున్నా క్రమంగా ఆ ప్రభావం తగ్గిపోతుందని అంటున్నారు. అయితే ఎల్‌నినో క్షీణించినా మంచి వర్షాలు పడుతాయని కచ్చితంగా చెప్పలేమని మరికొందరు నిపుణులు అంటున్నారు. 

ఎల్‌నినో అంటే? 
పసిఫిక్‌ మహాసముద్రంలో భూమధ్యరేఖ దగ్గర జల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీలు అధికంగా ఉంటే దాన్ని ఎల్‌నినో అంటారు. అంతకంటే తక్కువగా ఉంటే లానినో అంటారు. ఎల్‌ నినో ఉంటే వర్షాలు తక్కువగా కురుస్తాయని, లా నినా వల్ల వర్షాలు అధికంగా కురుస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌ నినో ప్రభావం ఆసియా దేశాలపై పడుతుంది. ఫలితంగా ఇక్కడి సముద్రపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ఏడాదీ ఎల్‌ నినో ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో నైరుతి రుతుపవనాలు బలïßహీనం అయ్యాయి. ఈసారి వర్షాకాలం ఆలస్యంగా ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఎల్‌ నినో అని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఫలితంగా కీలకమైన జూన్‌ నెలలో లోటు వర్షపాతం నమోదై వ్యవసాయ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. జూన్, జూలైలలో ఇప్పటివరకు సాధారణం కంటే లోటు వర్షపాతం వల్ల భూగర్భ జలాలు అడుగంటి వర్షాభావంతో విలవిలలాడుతున్నాయి. అయితే ఒక్కోసారి ఎల్‌ నినో, లా నినాలతో సంబంధం లేకుండానే మంచి వర్షాలు కురిసిన సందర్బాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి విశ్లేషించారు. అయితే లా నినో ఏర్పడిన ఎక్కువ సందర్బాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, కొన్ని సందర్భాల్లో అధికంగా కూడా వర్షాలు కురిశాయని ఆయన తెలిపారు. ఎల్‌ నినో బలంగా ఉంటే వర్షాలు కురవవని అనుకోవడానికి వీల్లేదని ఆయన పేర్కొన్నారు.

 దారితప్పిన నైరుతి రుతుపవన ద్రోణి... 
ఎల్‌ నినోకు తోడు ఈసారి నైరుతి రుతుపవన ద్రోణి మనల్ని ముంచింది. రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు వెళ్లిపోవడం ప్రస్తుత పరిస్థితికి మరో కారణంగా వాతావరణ కేంద్రం చెబుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక నైరుతి రుతుపవన ద్రోణి ఏర్పడుతుంది. ఇది నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే సమయంలో రాజస్తాన్‌లోని గంగానగర్‌ నుంచి అలహాబాద్‌ మీదుగా ఉత్తర బంగాళాఖాతం వరకు ఏర్పడుతుంది. ఆ సమయంలో నైరుతి రుతుపవన ద్రోణి సాధారణ స్థితి నుంచి గాలుల దిశను బట్టి కిందనున్న దక్షిణం వైపునకు రావాల్సి ఉంటుంది. అప్పుడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురుస్తాయి. అయితే ఈసారి అలా కాకుండా అది సాధారణ స్థితి నుంచి పైకి అంటే ఉత్తరం వైపు నుంచి హిమాలయాలవైపు వెళ్లి పోయింది.

రుతుపవనాలు ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటాయి. అవెప్పుడు ఎలా మారుతాయో వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది. అవి దిశ మార్చుకోవడానికి గాలుల తీవ్రతే కారణమని, దానివల్ల ఈసారి రుతుపవన ద్రోణి ఉత్తరం వైపు వెళ్లిపోయిందని రాజారావు అంటున్నారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షాభావం నెలకొంది. ఒక్కోసారి అది దిశ మార్చుకోకుండా సాధారణ స్థితిలోనే ఉంటే అప్పుడు ఉత్తరం వైపునకు, దక్షిణం వైపునకు కాకుండా అక్కడే తటస్థంగా ఉండిపోతుంది. అప్పుడు దేశం మొత్తం ఒకేసారి ఒకేవిధంగా భారీ వర్షాలు కురుస్తాయి. కానీ అదిప్పుడు హిమాలయాలవైపు వెళ్లిపోవడంతో మనకు వర్షాలు తక్కువగా కురిశాయని రాజారావు తెలిపారు. అయితే రుతుపవనాలు దక్షిణాది వైపు రావడం తప్పనిసరిగా జరిగే పరిణామమేనని, కానీ అవెప్పుడు వస్తాయో సాధారణంగా చెప్పలేమన్నారు. కానీ ఈసారి ఈ నెల చివరి నాటికి వస్తాయని అంచనా వేశామన్నారు. ఎల్‌ నినో ప్రభావం ఎంతో, దానికంటే ఎక్కువగా నైరుతి రుతుపవన ద్రోణి దిశ మార్చుకోవడం వల్ల కూడా వర్షాభావం ఏర్పడిందని అంటున్నారు. 

ఎల్‌నినో ఏర్పడిన సంవత్సరాలు... 
దేశంలో ఈ శతాబ్దంలో అంటే 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఐదు సార్లు ఎల్‌ నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయా సంవత్సరాల్లో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే పడాల్సిన దానికన్నా కనిష్టంగా 14 శాతం లోటు వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతానికి, ఎల్‌ నినోకు దగ్గరి సంబంధం ఉందని పలు శాస్త్రీయ అధ్యయనాలు తేల్చాయి. వాతావరణశాఖ దేశం మొత్తాన్ని 36 సబ్‌ డివిజన్లుగా విభజించింది. 2000 సంవత్సరం నుంచి పరిశీలిస్తే ఈ మొత్తం డివిజన్లలో 25 శాతం ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అయితే ఎల్‌ నినో ప్రభావం వల్ల 2002, 2009లలో 36 సబ్‌ డివిజన్లలో 20కి పైగా ప్రాంతాల్లో లోటు వర్షపాతం, క్షామ పరిస్థితులు తలెత్తాయి. ఎల్‌ నినో ఏర్పడిన ఏడాది దేశమంతా సాధారణ వర్షాలు పడి, కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధ్వాన పరిస్థితులు నెలకొన్న ఉదాహరణలూ ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement