elnino
-
మండే ఎండల్లో కూల్ న్యూస్..‘ఐఎండీ’ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఎండలు మండుతున్న వేళ దేశ వాసులకు భారత వాతావరణ శాఖ( ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. దేశంలో దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) 87 సెంటీమీటర్లుగా ఉండగా ఈ ఏడాది ఇందులో 106 శాతం వర్షపాతం రికార్డయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది. ప్రస్తుతం మధ్య పసిఫిక్ సముద్రం మీదుగా ఎల్‌నినో(వర్షాభావ) పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఇది మెల్లగా తొలగిపోతూ రుతుపవనాలు ప్రారంభమయ్యే సరికి తటస్థ స్థితి(ఈఎన్ఎస్ఓ) ఏర్పడుతుందని వెల్లడించింది. కాగా, భారత్‌లోని ఏకైక ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ కూడా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. స్కైమెట్ అంచనాలు ఐఎండీ అంచనాలకు దగ్గరగా ఉండటం విశేషం. ఇదీ చదవండి.. నేటితో హిమాచల్‌కు 76 ఏళ్లు -
వెదర్ అప్డేట్: కొనసాగనున్న హీట్‌వేవ్
న్యూఢిల్లీ: దేశంలో ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ తాజా అప్డేట్ ఇచ్చింది. రానున్న రోజుల్లో దక్షిణ, ఉత్తర భారతాల్లోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది. అయితే ఈశాన్య భారతంలోని కొన్ని చోట్ల మాత్రం వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాజధాని ఢిల్లీలో వేసవి ప్రారంభం అయినప్పటి నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 36.4డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ కావడం గమనార్హం. రానున్న ఐదు రోజుల్లో విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, అధిక ఉష్ణోగ్రతలకు కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. మండే ఎండల్లో వర్ష సూచన -
భారత్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో ‘ఎల్‌నినో’ మాయం!
న్యూఢిల్లీ: దేశంలోని రైతులకు వాతావరణ సైంటిస్టులు గుడ్‌న్యూస్ చెబుతున్నారు. గత ఏడాదిలా కాకుండా ఈ ఏడాది దేశంలో సమృద్ధిగా వర్షాలు పడతాయని వారు అంచనా వేస్తున్నారు. 2023లో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావానికి కారణమైన ఎల్‌నినో పరిస్థితులు నైరుతి రుతుపవనాలు వచ్చే సమయానికి మారిపోతాయని అమెరికాతో పాటు భారత్‌కు చెందిన వాతావరణ సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడంతో ఏర్పడిన ఎల్‌నినో(వర్షాభావ పరిస్థితి) జూన్ నాటికి బలహీనపడి లా నినా ఏర్పడుతుందని అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్, నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించాయి. ఎల్‌నినో తొలుత ఏప్రిల్-జూన్ మధ్య ఈఎన్ఎస్ఓ(తటస్థ స్థితి)కి రావడానికి 83 శాతం, ఆ తర్వాత ఇది జూన్-ఆగస్టు మధ్య లానినాగా మారడానికి 62 శాతం అవకాశం ఉందని వెల్లడించాయి. లా నినా పరిస్థితులు ఏర్పడితే గనుక ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో దేశంలో సాధారణవర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సైంటిస్టులు చెబుతున్నారు. ఒక వేళ లానినా ఏర్పడకపోయినా తటస్థ(ఈఎస్ఎన్ఓ) పరిస్థితులు ఏర్పడినా భారత్‌లో ఈ ఏడాది వర్షాలకు ఢోకా ఉండదని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ మాధవన్ రాజీవన్ తెలిపారు. భారత్‌లో 70 శాతం వార్షిక వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్లే నమోదవుతుంది. జీడీపీలో 14 శాతం వాటా కలిగిన వ్యవసాయరంగానికి ఈ రుతుపవనాలే కీలకంగా ఉండటం గమనార్హం. ఇదీ చదవండి.. రైతుల ఉద్యమం మరింత ఉధృతం -
జూన్‌లో వర్షాభావం
న్యూఢిల్లీ: ఫసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పడినప్పటికీ వాయవ్య భారత్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే జూన్ నెలలో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులుంటాయని తెలిపింది. దక్షిణ కర్ణాటక, ఉత్తర తమిళనాడు, రాజస్తాన్, లద్దాఖ్ మినహా మిగిలిన ప్రాంతాల్లో జూన్ నెలలో వానలు అంతగా కురిసే అవకాశాల్లేవని అంచనా వేసింది. ఫసిఫిక్ మహా సముద్రం వేడెక్కడం ఇప్పటికే ప్రారంభమైందని మన రుతుపవనాలపై ప్రభావాన్ని చూపిస్తే ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం 90శాతం ఉందని కేంద్ర వాతావరణ శాఖ పర్యావరణ పర్యవేక్షణ అధ్యయన కేంద్రం చీఫ్ డి. శివానంద చెప్పారు. అయితే వానలు కురవడానికి అనుకూలమైన ఇండియన్ ఓషన్ డిపోల్ (ఐఓడీ) హిందూ మహాసముద్రంలో ఏర్పడడం వల్ల చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. మధ్య భారతదేశంపై ఎల్‌నినో ప్రభావాన్ని ఐఓడీ సమర్థంగా ఎదు ర్కోవడం వల్ల ఏడాది మొత్తమ్మీద సాధారణ వర్షపాతం కురుస్తుందని వివరించారు. -
రుతుపవనం లో తటస్థంగా లానినా
న్యూఢిల్లీ: ఈ ఏడాది రుతుపవనాల కాలంలో ‘లానినా’ తటస్థంగా ఉంటుందనీ, దేశంలో సాధారణ వర్షపాతం నమోదవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవన్ సోమవారం చెప్పారు. ఎల్ నినో ప్రభావం వల్ల పసిఫిక్ మహా సముద్ర జలాలు వేడెక్కితే, లానినా వల్ల చల్లబడతాయి. సాధారణంగా ఎల్ నినో వల్ల తక్కువ వర్షాలు కురిస్తే, లానినా వల్ల మంచి వానలు పడతాయి. ‘ప్రస్తుతం లానినా ఓ మాదిరిగా ఉంది. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే సమయానికల్లా అది తటస్థంగా ఉంటుంది. సముద్రంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ) ఈసారి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది’ అని రాజీవన్ వెల్లడించారు. -
మళ్లీ ఎల్‌నినో!: స్కైమెట్
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలపై గత రెండేళ్లుగా ప్రతికూల ప్రభావం చూపి కరువుకు కారణమైన ఎల్‌నినో ఈ ఏడాది కూడా కొనసాగవచ్చని వాతావరణ అధ్యయన సంస్థ ‘స్కైమెట్’పేర్కొంది. దీనిని కొట్టి పారేస్తూ ఎల్‌నినోపై ఇప్పుడే మాట్లడటం తొందరపాటు అవుతుందని భారత వాతావరణ సంస్థ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ అన్నారు. ప్రస్తుతం లానినా ఉందనీ, వర్షాలు తగినంత కురవొచ్చని ఆయన తెలిపారు. లానినా వల్ల పసిఫిక్ మహా సముద్రంలో నీళ్లు చల్లబడి సమృద్ధిగా వర్షాలు కురిస్తే..ఎల్‌నినో వల్ల నీళ్లు వేడెక్కి అల్ప వర్షపాతం నమోదవుతుంది. ఈ ఏడాది ప్రస్తుతం లానినా ఉన్నప్పటికీ, ఎల్‌నినో మళ్లీ వస్తుందని వాతావరణ నమూనాలను పరిశీలిస్తే అనిపిస్తోందని స్కైమెట్ పేర్కొంది. అలాగే, నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపేది ఎల్‌నినో మాత్రమే కాదనీ, ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) కూడా ప్రభావితం చేస్తుందని తెలిపింది. కాబట్టి రుతుపవనాల సమయంలో ఎల్‌నినో ప్రభావాన్ని ఐఓడీ తటస్థీకరించగలదేమో వేచి చూడాలని స్కైమెట్ అంటోంది. -
తెలంగాణలో మండుతున్న ఎండలు
- సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికం - ఎల్‌నినో పోయినా... లానినా రాని పరిస్థితి - వర్షాలు లేక విలవిలలాడుతోన్న రైతన్న - వచ్చే నెలలో మరిన్ని వర్షాలుంటాయంటోన్న వాతావరణశాఖ సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో అనేకచోట్ల ఉక్కపోత వాతావరణం కనిపిస్తోంది. ఖమ్మంలో సాధారణంగా గరిష్ట ఉష్ణోగత్ర 31 డిగ్రీలు ఉండాల్సి ఉండగా... గత 24 గంటల్లో అక్కడ 37 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో సాధారణంగా 30 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా... ఐదు డిగ్రీలు అధికంగా 35 డిగ్రీలు నమోదైంది. మెదక్, భద్రాచలం, హకీంపేట్, హన్మకొండ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో పది రోజులకు పైగా ఒక్క చుక్క వర్షం కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. కీలకమైన పూత, కాత దశలో వర్షాలు లేకపోవడం... ఎండలు మండుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో మొక్కజొన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని పంటల కంటే కూడా భారీగా నష్టపోయేది మొక్కజొన్నేనని చెబుతున్నారు. తేలికపాటి నేలల్లో వేసిన ఈ పంట ఎండిపోతుందని ఆందోళన చెందుతున్నారు. పత్తి పంట నల్లరేగడి భూముల్లో వేయడం వల్ల ప్రస్తుతానికి ఫర్వాలేదనుకున్నా... వారం రోజులపాటు వర్షాలు పడకుంటే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఎల్‌నినో వెళ్లినా... లానినా రాని పరిస్థితి పరస్పర విరుద్ధ చర్యలు కలిగించే ఎల్‌నినో, లానినాలు వాతావరణ పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అధిక ఎండలకు కారణమయ్యే ఎల్‌నినో ప్రభావం పూర్తిగా తగ్గింది. కానీ అధిక వర్షాలకు కారణమయ్యే లానినా మాత్రం ఇంకా ఏర్పడలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఎల్‌నినో, లానినాల ప్రభావం లేదని... రెండింటికి మధ్య తటస్థ స్థితి కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెలలో లానినా ఉధృతి పెరిగే అవకాశం ఉందని... ఆ నెలలో సాధారణం కంటే భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అల్పపీడనం... ఇదిలావుంటే పశ్చిమబెంగాల్, గ్యాంగ్‌టక్ వైపు అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వచ్చే మూడు రోజుల తర్వాత రాష్ట్రంపై ఉంటుంది. కానీ సాధార ణం లోపే వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
ఎల్‌నినోకు ఆ మంటలు కారణమా!
రుతుపవనాలను కకావికలం చేసి చాలాదేశాల్లో కరవుకు ఎల్‌నినో కారణమవుతోంది. మరి దీనికి ఆజ్యం పోస్తున్నదెవరు..? ఇండొనేసియాలో ఉన్న పామాయిల్ తోటల మంటలే ఇందుకు కారణమా..? అవుననే అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. ఎక్కడో దక్షిణ అమెరికాలోని భూమధ్య రేఖకు సమీపంలో సముద్రపు నీరు వెచ్చబడితే దాని ప్రభావం వల్ల మేఘాలు ఏర్పడటంపై పడుతుందని తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి భారత్ వరకు వర్షపాతాన్ని తగ్గిస్తుందనీ తెలిసిన విషయమే. దీన్నే ఎల్‌నినో అని పిలుస్తున్నారు. అయితే అయితే ఇండొనేసియాలోని పామాయిల్ తోటల్లోని చెత్తను అక్కడి రైతులు తగలేయడం ఎల్‌నినో ప్రభావాన్ని మరింత తీవ్రం చేస్తోందని నాసా చెబుతోంది. ఈ మంటల ద్వారా వెలువడే పొగ ఆఫ్రికా ఖండం దాటి వెళుతోందని ఉపగ్రహాల ద్వారా నాసా గుర్తించింది. గతేడాది ఎల్‌నినో సందర్భంగా ఇండొనేసియా నుంచి దాదాపు 150 కోట్ల టన్నుల కాలుష్య కారకాలు పొగ రూపంలో వెలువడ్డాయని వివరించింది. 1997-2015 మధ్య కాలంలో ఎల్‌నినో వచ్చిన సమయాల్లో ఈ మంటలు ఎక్కువగా ఉన్నపుడు కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్లు నాసా పేర్కొంది. -
ఎల్‌నినోకు ఆ మంటలు కారణమా!
రుతుపవనాలను కకావికలం చేసి చాలాదేశాల్లో కరవుకు ఎల్‌నినో కారణమవుతోంది. మరి దీనికి ఆజ్యం పోస్తున్నదెవరు..? ఇండొనేసియాలో ఉన్న పామాయిల్ తోటల మంటలే ఇందుకు కారణమా..? అవుననే అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. ఎక్కడో దక్షిణ అమెరికాలోని భూమధ్య రేఖకు సమీపంలో సముద్రపు నీరు వెచ్చబడితే దాని ప్రభావం వల్ల మేఘాలు ఏర్పడటంపై పడుతుందని తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి భారత్ వరకు వర్షపాతాన్ని తగ్గిస్తుందనీ తెలిసిన విషయమే. దీన్నే ఎల్‌నినో అని పిలుస్తున్నారు. అయితే అయితే ఇండొనేసియాలోని పామాయిల్ తోటల్లోని చెత్తను అక్కడి రైతులు తగలేయడం ఎల్‌నినో ప్రభావాన్ని మరింత తీవ్రం చేస్తోందని నాసా చెబుతోంది. ఈ మంటల ద్వారా వెలువడే పొగ ఆఫ్రికా ఖండం దాటి వెళుతోందని ఉపగ్రహాల ద్వారా నాసా గుర్తించింది. గతేడాది ఎల్‌నినో సందర్భంగా ఇండొనేసియా నుంచి దాదాపు 150 కోట్ల టన్నుల కాలుష్య కారకాలు పొగ రూపంలో వెలువడ్డాయని వివరించింది. 1997-2015 మధ్యకాలంలో ఎల్‌నినో వచ్చిన సమయాల్లో ఈ మంటలు ఎక్కువగా ఉన్నపుడు కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్లు నాసా పేర్కొంది. -
ఎండ తగలనివ్వం!
♦ ఎండ తీవ్రతనుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్రం సన్నద్ధం ♦ అహ్మదాబాద్ ప్లాన్ అమలుకు రాష్ట్ర విపత్తు శాఖ ఏర్పాట్లు ♦ మార్చి నుంచి అమలయ్యేలా ప్రణాళిక ♦ ఈసారి మరింత తీవ్రం కానున్న ఎండలు హెచ్చరికలు రెడ్ అలర్ట్ : అత్యంత తీవ్రమైన ఎండలతో కూడిన వడగాలులు ఉన్నప్పుడు చేసే హెచ్చరిక ఆరెంజ్ అలర్ట్ : తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు.. ఎల్లో అలర్ట్ : సాధారణంగా ఎండాకాలంలో వేడిగా ఉంటే వైట్ అలర్ట్ : సాధారణం కంటే తక్కువ ఎండలు ఉన్నప్పుడు చేసే హెచ్చరిక. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి ఎండలు మరింత మండనున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి నెలాఖరు వరకు చలికాలం ఉంటుంది. కానీ అప్పుడే సాధారణం కంటే ఐదారు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తీవ్రమైన ఎల్‌నినో కారణంగా వాతావరణంలో భారీ మార్పులు సంభవించి అదనపు ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయని, వచ్చే వేసవిలో పరిస్థితి మరింత తీవ్రం కానుందని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. వచ్చే వేసవిలో గత ఏడాది కంటే రెండు మూడు డిగ్రీల అదనంగా నమోదవుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అహ్మదాబాద్ కార్యాచరణ ప్రణాళికను అమలుచేయాలని నిర్ణయించింది. అహ్మదాబాద్ బాటలో... గత వేసవిలో ఖమ్మంలో అత్యధికంగా 47.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకాగా, అనేక చోట్ల 45 డిగ్రీలకు మించింది. ఈసారి 49 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వై.కె.రెడ్డి చెబుతున్నారు. గతంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు 10 రోజుల వరకు మాత్రమే ఉంటే... వచ్చే వేసవిలో ఏకంగా నెల రోజులపాటు సుదీర్ఘ కాలం వడగాలులు ఉంటాయన్నారు. గత ఏడాది రాష్ట్రంలో 500 మందికి పైగా వడదెబ్బతో చనిపోయారు. ఈ పరిస్థితిని నివారించేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రణాళికే దేశంలో ఆదర్శంగా ఉన్నందున దాని ఆధారంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని విపత్తు నిర్వహణశాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద్ చెప్పారు. మార్చి నుంచి అమలు చేసేందుకు ఇప్పటికే ముసాయిదా తయారుచేశారు. అహ్మదాబాద్ ప్రణాళిక ఇదీ... ♦ రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టి ఉష్ణోగ్రతల వివరాలు ప్రదర్శించడం. ♦ టీచర్లకు శిక్షణ ఇచ్చి విద్యార్థులకు వడదెబ్బ నుంచి రక్షణ తీసుకునేలా చేయడం. ♦ పాఠశాలల వేళలను మార్పు చేయడం. ♦ ఎఫ్ఎం రేడియోతో అప్రమత్తం చేయడం. ♦ ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను, 108 సర్వీసును అందుబాటులో ఉంచడం. ♦ ఆరోగ్య కేంద్రాల వేళలను పెంచడం. ♦ ఆరు బయట శ్రమ చేసేవారికి నీడ కల్పిం చడం. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఐదింటి వరకు పని లేకుండా చూడటం. ఫ్యాక్టరీల్లో ఏసీ ఏర్పాటు చేయడం. ♦ ట్వీటర్, ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం. మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపడం. ♦ అత్యంత ఎండ తీవ్రతలున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం. ♦ అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి తాగునీరు, వైద్య వసతి, నీడ కల్పించడం. ♦ వడదెబ్బకు గురైన వారికోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను నెలకొల్పడం. -
ఈ శీతాకాలమంతా వెచ్చనే!
* ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికం * నామమాత్రంగా చలి ప్రభావం * ఎల్‌నినో, యాంటీ సైక్లోన్ కారణం * 2015, డిసెంబర్‌ను హాటెస్ట్ వింటర్‌గా తేల్చిన ఐఎండీ సాక్షి, విశాఖపట్నం: శీతాకాలమంటేనే వణికించే సీజన్.. సాధారణంగా నవంబర్ రెండోవారం నుంచి ఆరంభమై డిసెంబర్, జనవరిల్లో గజగజలాడిస్తుంది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి ఎక్కడుంది? చలికాలం అనుభూతి కలిగించకుండానే నిష్ర్కమిస్తోంది. వెచ్చని శీతాకాలంగా రికార్డులకెక్కింది. ఈ ఏడాది తెలుగురాష్ట్రాల్లో శీతాకాలంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 3 నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. చలి తీవ్రంగా ప్రభావం చూపే డిసెంబర్ తొలి రెండువారాల్లోనైతే ఏకంగా 6 నుంచి 10 డిగ్రీలదాకా అధికంగా నమోదయ్యాయి. ఎల్ నినో ప్రభావం, రాజస్థాన్‌పై బలమైన యాంటీ సైక్లోన్ కొనసాగడం, ఉత్తర భారత పర్వత శ్రేణుల్లో పశ్చిమ ఆటంకాలు ప్రభావం చూపకపోవడం వంటివి ఈ పరిస్థితికి కారణంగా వాతావరణ నిపుణులు విశ్లేషించారు. 2015 వేసవిలో ఎల్‌నినో వల్ల తెలుగురాష్ట్రాల్లో 45-48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో 2015 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నిలిచింది. దీనికితోడు రాజస్థాన్‌లో యాంటీ సైక్లోన్‌వల్ల పశ్చిమదిశ నుంచి వేడితో కూడిన పొడిగాలులు వీచాయి. మరోవైపు ఉత్తరాదిన పశ్చిమ ఆటంకాలు బలంగా లేక అక్కడ మంచు అధికంగా కురవలేదు. ఉత్తర భారతంలో అధిక పీడనం(హై ప్రెషర్) ప్రభావం చూపింది. ఇవన్నీ ఉష్ణోగ్రతలు పెరిగి శీతల ప్రభావాన్ని తగ్గించడానికి కారణమయ్యాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ, సముద్ర అధ్యయన విభాగపు పూర్వ విభాగాధిపతి భానుకుమార్ ‘సాక్షి’తో చెప్పారు. 114 ఏళ్లలో హాటెస్ట్ డిసెంబర్‌గా రికార్డు.. 2015 డిసెంబర్లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు సృష్టించినట్టు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) పేర్కొంది. 1901 నుంచి 2015(114 ఏళ్ల) వరకు డిసెంబర్ నెల ఉష్ణోగ్రతల్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ధారణకొచ్చింది. సాధారణంగా శీతాకాలంలో డిసెంబర్ నెల అత్యంత చలిగా ఉంటుంది. దీంతో ఆ నెలనే లెక్కల్లోకి తీసుకుంది. ఆ మేరకు 2006 డిసెంబర్లో 0.82 డిగ్రీలు, 2012లో 1.0, 2009లో 1.04, 2008లో 1.10, 2015లో 1.20 డిగ్రీలు చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినట్టు గుర్తించింది. ఇకపై పెరగనున్న ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా శీతాకాలంలో తెలంగాణలోని ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా లంబసింగిలోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 2014లో ఆదిలాబాద్‌లో 4 డిగ్రీలు, లంబసింగిలో సున్నా డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కానీ ప్రస్తుత శీతాకాలం(2015-16)లో ఆదిలాబాద్‌లో 8, లంబసింగిలో 3 డిగ్రీలకంటే తక్కువ నమోదు కాలేదు. ‘‘సంక్రాంతి నుంచి సూర్యుడు మకరరేఖలోకి వెళ్లడంతో ఉష్ణోగ్రతలు ఊపందుకుంటాయి. ఇకపై కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశంలేదు’ అని రిటైర్డ్ వాతావరణ శాస్త్రవేత్త ఆర్.మురళీకృష్ణ తెలిపారు. -
చెన్నైలో మండుతున్న ఎండలు
- సముద్రపు గాలి రాకలో ఆలస్యం - ఎల్‌నినో కారణమంటున్న వాతావరణ కేంద్ర నిపుణులు ప్యారిస్: చెన్నై సహా రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరంలో 1948లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌ను ప్రస్తుత ఎండలు సమీపిస్తున్నాయి. కొన్నేళ్లకంటే ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రత అధికమైనట్లు వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి ఏటా అగ్ని నక్షత్ర ఎండా కాలం మే నెలలో 24 రోజులు ఉంటుంది. ఇందులో మే నెల లో 15, 16 తేదీల్లో ఉష్ణోగ్రత భారీ స్థాయికి చేరుకుంటుంది. ఈ ఏడాది ఆ రోజుల్లో ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఆ తర్వాత ఎండలు కొంత తగ్గా యి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాం తాల్లో ఎండలు కాస్త తగ్గుముఖం పట్టి వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల రాకతో కన్యాకుమారి, తిరునల్వేలి, కోయంబత్తూరు జిల్లాల్లో వర్షాలు కురి శాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఉష్ణోగ్రత కొంత తగ్గింది. సాధారణగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో నైరుతీ రుతు పవనాలు వీస్తారు. తద్వారా వర్షాలు కురిసి ఎండలు తగ్గుముఖం పడతాయి. ఈ ఏడాది అందుకు విరుద్ధంగా ఎండ వేడిమి అధికమైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షాలు తక్కువగానే కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలుపుతోంది. చెన్నైలో: చెన్నైకు సంబంధించినంత వరకు 1948లో అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత 2012లో 42.4 డిగ్రీలు, 2013లో 39.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ ఏడాదిలో గత నెలలో 42 డిగ్రీలు, ఈ నెలలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. సాధారణ స్థాయికంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ అధికంగా కని పిస్తోంది. నగరంలో ఎండలు రోజు రోజు కూ పెరిగిపోతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అలాగే నెల్లై, మదురై, తిరుచ్చి, వేలూర్ వంటి నగరాల్లో కూడా ఎండల తీవ్రత పెరుగుతోంది. కొన్ని రోజులుగా మదురై, తిరుచ్చి, వేలూర్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. కన్యాకుమారి, కోవై జిల్లాల్లో సాధారణ స్థితి కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. పుదుచ్చేరిలో: పుదుచ్చేరిలో 2012లో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది 41 డిగ్రీల ఎండ కాస్తోంది. ఇదే స్థితి కొనసాగితే గత ఏడాది కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పెరుగుదల గురించి చెన్నై వాతావరణ కేంద్ర డెరైక్టర్ రామన్ మాట్లాడుతూ పశ్చిమ దిశలో గాలి అధికంగా వీస్తుండడంతో సముద్రపు గాలి రావడంలో ఆలస్యం ఏర్పడుతోందన్నారు. దీంతో ఉష్ణోగ్రత స్థాయి పెరుగుతోందన్నారు. ఎల్‌నినో కారణం: పసిఫిక్ సముద్రంలోని నీటి ప్రవాహంలో ఉష్ణోగ్రత (ఎల్‌నినో) అధికం కావడమే ఉష్ణోగ్రత పెరగడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని గురించి వాతావరణ శాఖ అధికారి విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎల్‌నినో కారణంగా ఉష్ణోగ్రత పెరుగుతుందన్నారు. -
ఈసారి వర్షపాతం తక్కువే!
న్యూఢిల్లీ/తిరువనంతపురం: ఈ సారి వర్షపాతం సగటు కన్నా తక్కువగా ఉంటుందని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ఆగమనంలో జరిగిన ఆలస్యంతో పాటు ‘ఎల్‌నినో’ వాతవరణ పరిస్థితులను అందుకు కారణంగా పేర్కొంది. ఇప్పటికే సగటు కన్నా 44% తక్కువ వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ శాఖ డెరైక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోర్ వెల్లడించారు. ‘ఎల్‌నినో’ వాతావరణ పరిస్థితి జులై చివర్లో, ఆగస్టు మొదట్లో తీవ్రంగా ఉండొచ్చన్నారు. ఇప్పటివరకైతే అది బలహీనంగానే ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. జూన్ 14 వరకు నైరుతి రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా జూన్, సెప్టెంబర్ నెలల మధ్య రుతుపవన వర్షపాతం సగటు కన్నా తక్కువగా.. 93 శాతమే ఉండొచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక రంగ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వర్షాలు సరిగ్గా లేకపోతే రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు, సబ్సీడీకి డీజిల్, అదనంగా విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ తెలిపారు. అల్పపీడన ద్రోణి సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనికితోడు విశాఖ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు, తెలంగాణా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందంది. ఉష్ణోగ్రతల్లో కూడా సోమవారం వ్యత్యాసాలు నెలకొన్నాయి. -
రుతు రాగంలో అపశృతి... ఎల్‌నినో
ఎల్‌నినో అంటే: ఎల్‌నినోకు స్పానిష్ భాషలో అర్థం..లిటిల్‌బాయ్. దక్షిణ అమెరికా పశ్చిమ తీరాన (పెరూ, ఈక్వెడార్) వందల ఏళ్ల క్రితం జాలర్లు తొలిసారిగా ఎల్‌నినోను గుర్తించారు. దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు ఉన్నట్లుండి అసాధారణంగా పెరగడాన్ని ఎల్‌నినో అంటారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో వేడి సముద్ర గాలులు తూర్పు, మధ్య పసిఫిక్ నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు పశ్చిమ దిశగా వీస్తాయి. ఎల్‌నినో సమయంలో తూర్పు, మధ్య పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో అసాధారణంగా సముద్ర ఉపరితలం వేడెక్కుతుంది. ఫలితంగా పెరూ, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో విపరీత వర్షపాతం నమోదవుతుంది. దీని పర్యవసానంగా పశ్చిమ పసిఫిక్ ప్రాంతమంతా చల్లగా ఉంటూ.. భారత్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో రుతుపవనాలు బలహీన పడి వర్షపాతం తగ్గుతుంది. భారత సేద్యానికి గొడ్డలిపెట్టు: భారత వ్యవసాయరంగాన్ని స్వల్ప నుంచి తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసే అంశాల్లో ఒకటి ఎల్‌నినో. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావాన్ని చవిచూసే అవకాశం ఉందని ఇప్పటికే భారత్‌తో పాటు ఇతర దేశాల వాతావరణ విభాగాలు నిర్ధారించాయి. జూన్-ఆగస్ట్ మధ్య కాలంలో సంభవించే ఎల్‌నినో ద్వారా నైరుతి రుతుపవనాలు ప్రభావితమై అల్ప వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకతకు విఘాతం వాటిల్లనుంది. అదే జరిగితే అన్నదాతలను ఆదుకునేలా కనీస మద్దతు ధరలను ప్రభుత్వం పెంచాల్సి ఉంటుంది. వరి, చక్కెర, కూరగాయలు, ఫలాల ధరలు పెరుగుతాయి. ఈ పరిణామాలు రూపాయి విలువను తగ్గించి ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలవుతాయి. ఎల్‌నినో సాధారణంగా 3 నుంచి 7 ఏళ్లకోసారి సంభవిస్తుంది. భారత్‌పై నైరుతి రుతుపవనాల కాలంలో దీని ప్రభావం ద్వారా పంటల దిగుబడి దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. 2001-2010 ఖరీఫ్ కాలంలో 2002, 2007, 2009లో ఎల్‌నినో దాపురించడంతో వర్షపాతం వరుసగా 19 శాతం, 13 శాతం, 23 శాతం మేరకు తగ్గింది. భారత వాతావరణ విభాగం (ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్) ప్రకారం ఈ ఏడాది ఎల్‌నినో సంభవిస్తే వర్షపాతం సుమారు 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఐ.ఎమ్.డి ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య కాలంలో ఎల్‌నినో ప్రభావం ఉంటుంది. ఆస్ట్రేలియా బ్యూరో వాతావరణ విభాగం ప్రకారం ఇది జూలైలో అభివృద్ధి చెందనుంది. ఎల్‌నినో ప్రభావం కనిపించిన గత పరిణామాలను పరికిస్తే... 2002, 2004, 2009లో పప్పు దినుసుల దిగుబడి వరుసగా 14,23,27 శాతం మేర క్షీణించింది. అదే విధంగా వాణిజ్య పంటైన చెరకుతోపాటు సజ్జలు, మొక్కజొన్న, రాగి పంటల దిగుబడి కూడా తగ్గింది. ఖరీఫ్ సేద్యానికి నైరుతి రుతుపవనాల వర్షపాతమే ప్రధాన ఆధారం. ఇక వర్షాదార ప్రాంతాలకైతే వేరే చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఏ విధమైన సేద్యపు నీటి సదుపాయాలు ఉండవు. ఈ ప్రాంతాల్లో పప్పు దినుసుల సాగు అధికం. జూలై- సెప్టెంబర్ కాలంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆగ స్ట్లో వర్షపాతం తగ్గితే..వీటి దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. ఐఎమ్‌డీ అంచనా ప్రకారం ఆగస్ట్‌లో ఎల్‌నినో ప్రభావం ఉండనుంది. అంటే ప్రధాన ఆహార ధాన్యాలతోపాటు పప్పు దినుసుల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావం ద్వారా భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఇదివరకే ఎల్‌నినో సంభవించిన సంవత్సరాల్లో దేశ జీడీపీ కూడా తగ్గింది. ప్రస్తుతం దేశ జనాభాలో 68.9 శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. దేశ వ్యవసాయ భూ విస్తీర్ణత 56 శాతంలో వర్షాధార వ్యవసాయం కొనసాగుతోంది. కాబట్టి వ్యవసాయరంగ క్షీణత అధిక జనాభాపై ప్రభావాన్ని చూపుతుంది. ఎల్‌నినో ద్వారా వ్యవసాయ ఆదాయం తిరోగమిస్తే అది అనేక రంగాలపై దుష్ర్పభావం చూపుతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల కొనుగోలు సామర్థ్యం కుంటుపడుతుంది. ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ రంగాలపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. నిత్యావసర ధరలు పెరిగి దేశ ద్రవ్యోల్బణం రేటు కూడా పెరుగుతుంది. వ డ్డీ రేట్లు పెరిగి చివరకు పారిశ్రామిక ఉత్పత్తికి విఘాతం వాటిల్లుతుంది. మూడు నుంచి ఏడేళ్లకోసారి సంభవించే ఎల్నినోలతోనే ఇంతటి విపత్కర పరిణామాలు దాపురిస్తే ఏటా పునరావృతమైతే ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఏడింటిలో రెండు మాత్రమే: 1991 నుంచి ఇప్పటిదాకా 7 ఎల్‌నినో ప్రభావాలు సంభవించాయి. అయితే ఈ ఏడింటిలో కేవలం రెండు మాత్రమే తీవ్ర కరువు పరిస్థితులకు దారితీశాయి. 1994లో తలెత్తిన ఎల్‌నినో ధాటికి రుతుపవనాల ద్వారా 10 శాతం అధికంగానే వర్షపాతం నమోదైంది. అయితే ఈసారి వచ్చే ఎల్‌నినో ద్వారా రుతుపవనాలు 30 శాతం మేరకు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని క్రిసిల్ భావిస్తోంది. మూలాలెక్కడ? ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఈ అసాధారణ వాతావరణ సంఘటన దాదాపు ప్రపంచంలోని అనేక దేశాలపై ఏదో ఒక రూపంలో కష్టనష్టాలకు గురిచేస్తోంది. అమెరికా తీర ప్రాంతంలో వరద లు ముంచెత్తితే, భారత్‌లో రుతుపవనాలకు విఘాతం కలిగిస్తూ కరువు కాటకాలకు కారణ భూతమవుతోంది. ఎల్‌నినోపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ దాని మూలాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలు ఇంకా పూర్తి స్థాయిలో సఫలీకృతులు కాలేకపోతున్నారు. అమెరికా దీనిపై సమగ్ర అధ్యయనాలను నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా కావాల్సినంత సమాచారం అందుబాటులోకి రాలేదు. భూతాపం (గ్లోబల్ వార్మింగ్) ఈ ఎల్‌నినోకు కారణమా? లేదా? భూతాపం ద్వారా ఎల్‌నినో తీవ్రత పెరుగుతుందా? అనే విషయంలో స్పష్టతకు రాలేదు. భిన్నాభిప్రాయాలు: ఎల్‌నినో ప్రభావంపై వాతావరణ శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎమ్‌డీ అంచనాల ప్రకారం ప్రతికూలత కొంత మాత్రమే ఉండొచ్చని 96 శాతం వర్షాలు కురుస్తాయని చెబుతుండగా.. అమెరికా వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం 1997-1998 నాటి తీవ్ర ఎల్‌నినో ఈసారి సంభవించనుందని అంచనావేస్తున్నారు. ఇలా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందని అన్ని ప్రధాన వాతావరణ విభాగాలు నిర్ధారించినప్పటికీ అది ఏ స్థాయిలో ఉంటుందనే విషయమై ఏకాభిప్రాయం కనిపించడం లేదు. నైరుతి గతికి ఇవే ప్రామాణికాలు: మన దేశంపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఏవిధంగా ఉంటుందనే విషయంలో నిపుణులు ప్రధానంగా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 1. ఫిబ్రవరి, మార్చి నెలలో దక్షిణ హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు 2. ఫిబ్రవరి, మార్చి నెలలో తూర్పు ఆసియా దేశాల్లో నమోదైన వాతావరణ పీడనాలు . 3. జనవరిలోని వాయవ్య ఐరోపాలోని భూఉపరితల ఉష్ణోగ్రతలు 4. ఫిబ్రవరి,మార్చిలలో పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రతలు వీటి ఆధారంగా నైరుతి రుతుపవనాల గమనం ఎలా ఉంటుందో అంచనా వేస్తారు. ఇప్పటి వరకు అనుకూలం: ఈ ఏడాది అనుకున్నదానికంటే రెండు రోజుల ముందుగానే మే 18 నాటికే భారత ఉపఖండంలో నైరుతి జల్లులు ప్రవేశించాయి. వాటికి అనుకూలంగానే ప్రస్తుతం బంగాళాఖాతంలో విస్తరించడానికి సానుకూల వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతమంతటా విస్తరించిన తర్వాత అరేబియా సముద్రం మీదుగా నైరుతి కేరళ తీరాన్ని తాకుతుంది. వాస్తవానికి అన్ని వాతావరణ పరిస్థితులను అంచనావేస్తే భారత్ వాతావరణ శాఖ ఎల్‌నినో ప్రభావం ఉందని అంచనా వేసింది. కానీ దాని ప్రభావం ఉండుంటే రుతు పవనాల ఆగమనం మరింత ఆలస్యమయ్యేది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే...రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనికి శుభశకునంగానే తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని, తద్వారా రుతుపవనాల విస్తరణకు తోడ్పడుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.రుతుపవనాల విషయానికి వస్తే ఈ గాలులు దేశమంతా విస్తరించిన తర్వాతే నైరుతి ద్రోణి ఏర్పడుతుంది. ఈద్రోణికి సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, వాయుగుండాలు, తీవ్రవాయుగుండాలు తోడైతే దేశమంతా మంచివానలే కురుస్తాయి. వీటి ద్వారా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశమంతా చిరుజల్లులనుంచి భారీవర్షాల వరకు పలు దఫాలుగా కురిసే అవకాశముంది. మన రాష్ట్రానికి వస్తే: మన రాష్ట్రంలో జూన్-సెప్టెంబర్ మధ్య నైరుతి ప్రభావం అధికంగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు, కోస్తా, రాయలసీమల్లో ఈశాన్య రుతుపవనాలు అధికంగా ప్రభావం చూపుతాయి. గడచిన ఐదేళ్ల వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది అంత ఎక్కువగా ఉండకపోవచ్చని నిపుణుల అంచనా. అయితే మధ్యలో వచ్చే అల్పపీడనాలు, వానలు, రుతుపవనాల ఉపసంహరణతో వచ్చే వర్షపాతాలు, ఆ లోటును పూడుస్తాయని మొత్తంగా చూస్తే ఈ ఏడాది మంచి వానలే కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే పరిరక్షణ: పర్యావరణ దినోత్సవం... క్యోటో ప్రోటోకాల్... జీవ వైవిధ్య సదస్సు... ఓజోన్ పరిరక్షణ దినం... ఇలా నెలకోమారు ఏదో రూపంలో మన పర్యావరణాన్ని కాపాడేందుకు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా సదస్సులు, చర్చాగోష్ఠులు, మేధోమథనం లాంటివి చేపడుతున్నా మరోవైపు జరగరాని నష్టం జరుగుతూనే ఉంది. ఈ సదస్సులు చేపట్టిన నాటి నుంచి కనీసం వైపరీత్యాల పరంపరకు అడ్డుకట్ట పడడం లేదు సరికదా నష్టాల తీవ్రత రేటు పెరిగి పోతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు పెచ్చరిల్లుతున్నాయి. పర్యావరణానికి ఎనలేని విఘాతం కలిగిస్తున్నాయి. వీటిని నిషేధించాలని వేదికలపై గొంతెత్తి చాటుతున్న ఏలికలు తమ పరిపాలనలో అమలు చేయడంలో మాత్రం ఘోర వైఫల్యం మూటగట్టుకుంటున్నారు. ప్లాస్టిక్ నిషేధం విషయంలో జపాన్, సింగపూర్ లాంటి చిన్న దేశాలను చూసి మనదేశం నేటికీ గుణపాఠం నేర్వలేకపోవడం విచారకరం. మన కృషి ఎంత? భారత్‌లో కూడా ఈ ఎల్‌నినో అంశంపై పూర్తి స్థాయిలో పరిశోధనలను నిర్వహించాలి. ప్రపంచ జల వలయంపై ప్రభావాన్ని చూపగల ఎల్‌నినోను తేలిగ్గా తీసుకోవడం భవిష్యత్ ఆహార భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది.దారిద్య్ర రేఖకు దిగువనున్న జనాభాకు నిరంతర ఆహారభద్రతను కల్పించాలంటే అది వ్యవసాయ దిగుబడులను పెంచడం ద్వారానే సాధ్యమవుతుంది. వరుసగా సంభవించే ఎల్‌నినోలతో ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతోంది. దీన్ని అధిగమించాలంటే ఎల్‌నినో మూలాలను వెతికి పట్టుకొని అడ్డుకట్ట వేయాలి. ఆ దిశగా మన శాస్త్రవేత్తలు ప్రగతి సాధించాలి. క్లిష్ట పరిస్థితులను తట్టుకోగలిగే వ్యవసాయ వంగడాలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. ఎల్‌నినో, భూతాపం లాంటి వైపరీత్యాలను సమర్థంగా ఎదురొడ్డే సాంకేతిక పరిజ్ఞానం మన సొంతమవ్వాలి.