* ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికం
* నామమాత్రంగా చలి ప్రభావం
* ఎల్‌నినో, యాంటీ సైక్లోన్ కారణం
* 2015, డిసెంబర్‌ను హాటెస్ట్ వింటర్‌గా తేల్చిన ఐఎండీ
సాక్షి, విశాఖపట్నం: శీతాకాలమంటేనే వణికించే సీజన్.. సాధారణంగా నవంబర్ రెండోవారం నుంచి ఆరంభమై డిసెంబర్, జనవరిల్లో గజగజలాడిస్తుంది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి ఎక్కడుంది? చలికాలం అనుభూతి కలిగించకుండానే నిష్ర్కమిస్తోంది. వెచ్చని శీతాకాలంగా రికార్డులకెక్కింది. ఈ ఏడాది తెలుగురాష్ట్రాల్లో శీతాకాలంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 3 నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. చలి తీవ్రంగా ప్రభావం చూపే డిసెంబర్ తొలి రెండువారాల్లోనైతే ఏకంగా 6 నుంచి 10 డిగ్రీలదాకా అధికంగా నమోదయ్యాయి. ఎల్ నినో ప్రభావం, రాజస్థాన్‌పై బలమైన యాంటీ సైక్లోన్ కొనసాగడం, ఉత్తర భారత పర్వత శ్రేణుల్లో పశ్చిమ ఆటంకాలు ప్రభావం చూపకపోవడం వంటివి ఈ పరిస్థితికి కారణంగా వాతావరణ నిపుణులు విశ్లేషించారు.
2015 వేసవిలో ఎల్‌నినో వల్ల తెలుగురాష్ట్రాల్లో 45-48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో 2015 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నిలిచింది. దీనికితోడు రాజస్థాన్‌లో యాంటీ సైక్లోన్‌వల్ల పశ్చిమదిశ నుంచి వేడితో కూడిన పొడిగాలులు వీచాయి. మరోవైపు ఉత్తరాదిన పశ్చిమ ఆటంకాలు బలంగా లేక అక్కడ మంచు అధికంగా కురవలేదు. ఉత్తర భారతంలో అధిక పీడనం(హై ప్రెషర్) ప్రభావం చూపింది. ఇవన్నీ ఉష్ణోగ్రతలు పెరిగి శీతల ప్రభావాన్ని తగ్గించడానికి కారణమయ్యాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ, సముద్ర అధ్యయన విభాగపు పూర్వ విభాగాధిపతి భానుకుమార్ ‘సాక్షి’తో చెప్పారు.
114 ఏళ్లలో హాటెస్ట్ డిసెంబర్‌గా రికార్డు..
2015 డిసెంబర్‌లో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు సృష్టించినట్టు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) పేర్కొంది. 1901 నుంచి 2015(114 ఏళ్ల) వరకు డిసెంబర్ నెల ఉష్ణోగ్రతల్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ధారణకొచ్చింది. సాధారణంగా శీతాకాలంలో డిసెంబర్ నెల అత్యంత చలిగా ఉంటుంది. దీంతో ఆ నెలనే లెక్కల్లోకి తీసుకుంది. ఆ మేరకు 2006 డిసెంబర్‌లో 0.82 డిగ్రీలు, 2012లో 1.0, 2009లో 1.04, 2008లో 1.10, 2015లో 1.20 డిగ్రీలు చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినట్టు గుర్తించింది.
ఇకపై పెరగనున్న ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా శీతాకాలంలో తెలంగాణలోని ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా లంబసింగిలోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 2014లో ఆదిలాబాద్‌లో 4 డిగ్రీలు, లంబసింగిలో సున్నా డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కానీ ప్రస్తుత శీతాకాలం(2015-16)లో ఆదిలాబాద్‌లో 8, లంబసింగిలో 3 డిగ్రీలకంటే తక్కువ నమోదు కాలేదు. ‘‘సంక్రాంతి నుంచి సూర్యుడు మకరరేఖలోకి వెళ్లడంతో ఉష్ణోగ్రతలు ఊపందుకుంటాయి. ఇకపై కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశంలేదు’ అని రిటైర్డ్ వాతావరణ శాస్త్రవేత్త ఆర్.మురళీకృష్ణ తెలిపారు.
ఈ శీతాకాలమంతా వెచ్చనే!
Published Sun, Jan 17 2016 3:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM
Advertisement
Advertisement