- సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికం
- ఎల్‌నినో పోయినా... లానినా రాని పరిస్థితి
- వర్షాలు లేక విలవిలలాడుతోన్న రైతన్న
- వచ్చే నెలలో మరిన్ని వర్షాలుంటాయంటోన్న వాతావరణశాఖ
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో అనేకచోట్ల ఉక్కపోత వాతావరణం కనిపిస్తోంది. ఖమ్మంలో సాధారణంగా గరిష్ట ఉష్ణోగత్ర 31 డిగ్రీలు ఉండాల్సి ఉండగా... గత 24 గంటల్లో అక్కడ 37 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో సాధారణంగా 30 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా... ఐదు డిగ్రీలు అధికంగా 35 డిగ్రీలు నమోదైంది. మెదక్, భద్రాచలం, హకీంపేట్, హన్మకొండ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో పది రోజులకు పైగా ఒక్క చుక్క వర్షం కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. కీలకమైన పూత, కాత దశలో వర్షాలు లేకపోవడం... ఎండలు మండుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలు ముఖం చాటేయడంతో మొక్కజొన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని పంటల కంటే కూడా భారీగా నష్టపోయేది మొక్కజొన్నేనని చెబుతున్నారు. తేలికపాటి నేలల్లో వేసిన ఈ పంట ఎండిపోతుందని ఆందోళన చెందుతున్నారు. పత్తి పంట నల్లరేగడి భూముల్లో వేయడం వల్ల ప్రస్తుతానికి ఫర్వాలేదనుకున్నా... వారం రోజులపాటు వర్షాలు పడకుంటే పరిస్థితి ఘోరంగా ఉంటుంది.
ఎల్‌నినో వెళ్లినా... లానినా రాని పరిస్థితి
పరస్పర విరుద్ధ చర్యలు కలిగించే ఎల్‌నినో, లానినాలు వాతావరణ పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అధిక ఎండలకు కారణమయ్యే ఎల్‌నినో ప్రభావం పూర్తిగా తగ్గింది. కానీ అధిక వర్షాలకు కారణమయ్యే లానినా మాత్రం ఇంకా ఏర్పడలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఎల్‌నినో, లానినాల ప్రభావం లేదని... రెండింటికి మధ్య తటస్థ స్థితి కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెలలో లానినా ఉధృతి పెరిగే అవకాశం ఉందని... ఆ నెలలో సాధారణం కంటే భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
అల్పపీడనం...
ఇదిలావుంటే పశ్చిమబెంగాల్, గ్యాంగ్‌టక్ వైపు అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వచ్చే మూడు రోజుల తర్వాత రాష్ట్రంపై ఉంటుంది. కానీ సాధార ణం లోపే వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.