ఎండ తగలనివ్వం!
♦ ఎండ తీవ్రతనుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్రం సన్నద్ధం
♦ అహ్మదాబాద్ ప్లాన్ అమలుకు రాష్ట్ర విపత్తు శాఖ ఏర్పాట్లు
♦ మార్చి నుంచి అమలయ్యేలా ప్రణాళిక
♦ ఈసారి మరింత తీవ్రం కానున్న ఎండలు
హెచ్చరికలు
రెడ్ అలర్ట్ : అత్యంత తీవ్రమైన ఎండలతో కూడిన వడగాలులు ఉన్నప్పుడు చేసే హెచ్చరిక
ఆరెంజ్ అలర్ట్ : తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు..
ఎల్లో అలర్ట్ : సాధారణంగా ఎండాకాలంలో వేడిగా ఉంటే
వైట్ అలర్ట్ : సాధారణం కంటే తక్కువ ఎండలు ఉన్నప్పుడు చేసే హెచ్చరిక.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి ఎండలు మరింత మండనున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి నెలాఖరు వరకు చలికాలం ఉంటుంది. కానీ అప్పుడే సాధారణం కంటే ఐదారు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తీవ్రమైన ఎల్‌నినో కారణంగా వాతావరణంలో భారీ మార్పులు సంభవించి అదనపు ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయని, వచ్చే వేసవిలో పరిస్థితి మరింత తీవ్రం కానుందని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. వచ్చే వేసవిలో గత ఏడాది కంటే రెండు మూడు డిగ్రీల అదనంగా నమోదవుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అహ్మదాబాద్ కార్యాచరణ ప్రణాళికను అమలుచేయాలని నిర్ణయించింది.
అహ్మదాబాద్ బాటలో...
గత వేసవిలో ఖమ్మంలో అత్యధికంగా 47.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకాగా, అనేక చోట్ల 45 డిగ్రీలకు మించింది. ఈసారి 49 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వై.కె.రెడ్డి చెబుతున్నారు. గతంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు 10 రోజుల వరకు మాత్రమే ఉంటే... వచ్చే వేసవిలో ఏకంగా నెల రోజులపాటు సుదీర్ఘ కాలం వడగాలులు ఉంటాయన్నారు. గత ఏడాది రాష్ట్రంలో 500 మందికి పైగా వడదెబ్బతో చనిపోయారు. ఈ పరిస్థితిని నివారించేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రణాళికే దేశంలో ఆదర్శంగా ఉన్నందున దాని ఆధారంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని విపత్తు నిర్వహణశాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద్ చెప్పారు. మార్చి నుంచి అమలు చేసేందుకు ఇప్పటికే ముసాయిదా తయారుచేశారు.
అహ్మదాబాద్ ప్రణాళిక ఇదీ...
♦ రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్స్ పెట్టి ఉష్ణోగ్రతల వివరాలు ప్రదర్శించడం.
♦ టీచర్లకు శిక్షణ ఇచ్చి విద్యార్థులకు వడదెబ్బ నుంచి రక్షణ తీసుకునేలా చేయడం.
♦ పాఠశాలల వేళలను మార్పు చేయడం.
♦ ఎఫ్‌ఎం రేడియోతో అప్రమత్తం చేయడం.
♦ ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను, 108 సర్వీసును అందుబాటులో ఉంచడం.
♦ ఆరోగ్య కేంద్రాల వేళలను పెంచడం.
♦ ఆరు బయట శ్రమ చేసేవారికి నీడ కల్పిం చడం. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఐదింటి వరకు పని లేకుండా చూడటం.
ఫ్యాక్టరీల్లో ఏసీ ఏర్పాటు చేయడం.
♦ ట్వీటర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం. మొబైల్ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపడం.
♦ అత్యంత ఎండ తీవ్రతలున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం.
♦ అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి తాగునీరు, వైద్య వసతి, నీడ కల్పించడం.
♦ వడదెబ్బకు గురైన వారికోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను నెలకొల్పడం.