న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలపై గత రెండేళ్లుగా ప్రతికూల ప్రభావం చూపి కరువుకు కారణమైన ఎల్‌నినో ఈ ఏడాది కూడా కొనసాగవచ్చని వాతావరణ అధ్యయన సంస్థ ‘స్కైమెట్’పేర్కొంది. దీనిని కొట్టి పారేస్తూ ఎల్‌నినోపై ఇప్పుడే మాట్లడటం తొందరపాటు అవుతుందని భారత వాతావరణ సంస్థ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ అన్నారు. ప్రస్తుతం లానినా ఉందనీ, వర్షాలు తగినంత కురవొచ్చని ఆయన తెలిపారు. లానినా వల్ల పసిఫిక్ మహా సముద్రంలో నీళ్లు చల్లబడి సమృద్ధిగా వర్షాలు కురిస్తే..ఎల్‌నినో వల్ల నీళ్లు వేడెక్కి అల్ప వర్షపాతం నమోదవుతుంది.
ఈ ఏడాది ప్రస్తుతం లానినా ఉన్నప్పటికీ, ఎల్‌నినో మళ్లీ వస్తుందని వాతావరణ నమూనాలను పరిశీలిస్తే అనిపిస్తోందని స్కైమెట్ పేర్కొంది. అలాగే, నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపేది ఎల్‌నినో మాత్రమే కాదనీ, ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) కూడా ప్రభావితం చేస్తుందని తెలిపింది. కాబట్టి రుతుపవనాల సమయంలో ఎల్‌నినో ప్రభావాన్ని ఐఓడీ తటస్థీకరించగలదేమో వేచి చూడాలని స్కైమెట్ అంటోంది.