KJ Ramesh
-
తమిళనాడు, రాయలసీమలపై తుపాను ప్రభావం
-
7న మరో తుపాను!
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఈనెల ఏడో తేదీన మరో తుపాను ఏర్పడబోతోంది. ఇది తమిళనాడు, రాయలసీమలపై ప్రభావం చూపుతుంది. అయితే ఇది తుపానుగానే కొనసాగుతుంది తప్ప తీవ్రరూపం దాల్చే అవకాశం లేదని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ తెలిపారు. అనంతరం ఆ తుపాను అరేబియా సముద్రంలోకి ప్రవేశించి అక్కడ మరింత బలపడుతుందన్నారు. ఈ తుపాను ప్రభావంతో తమిళనాడు, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురవడానికి వీలుందన్నారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలపై తక్కువగా ఉంటుందని, దీంతో అక్కడ లోటు వర్షపాతం నమోదయ్యే వీలుందని చెప్పారు. తమిళనాడులో మాత్రం సాధారణంకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్నారు. ఐఎండీ అంచనా వేసిన మేరకే నైరుతి రుతుపవనాల సీజనులో వర్షపాతం నమోదైందని, గతేడాదికంటే రిజర్వాయర్లలో నీటిమట్టాలు 117 శాతానికి పెరిగాయని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో దేశంలో ఆహారధాన్యాల దిగుబడి 1.8 శాతం మాత్రమే తక్కువని పేర్కొన్నారు. తిత్లీ తుపాను తీరం దాటే ప్రాంతాన్ని ఐఎండీ సరిగా అంచనా వేయలేకపోయిందన్న విమర్శలను ఆయన కొట్టేశారు. ఐఎండీ అంచనా వేసిన ప్రాంతంలోనే తీరం దాటిందని, ఇది ఐఎండీ కచ్చితత్వానికి నిదర్శనమని చెప్పారు. తుపాను కళింగపట్నం–ఇచ్ఛాపురంల మధ్య తీరాన్ని దాటుతుందని అక్టోబర్ 10వ తేదీ ఉదయమే ఐఎండీ వెల్లడించిందని, దీనికి అనుగుణంగానే తిత్లీ 30 కిలోమీటర్ల దూరంలో తీరం దాటిందని తెలిపారు. అయితే ముందస్తు సమాచారం సాంకేతిక కారణాల వల్ల సమాచార, ప్రసార మాధ్యమాలకు చేరకపోయి ఉండవచ్చన్నారు. వాతావరణశాఖలో 1,102 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ జరుగుతోందని, దీంతో సిబ్బంది కొరత సమస్య తీరుతుందని రమేష్ చెప్పారు. ముంపు ముప్పుపై ముందస్తు సమాచారం..: ఇకపై వరద, తుపానుల వల్ల ముంపు ముప్పు ఎక్కడ ఏర్పడుతుందన్న దానిపై ముందస్తు సమాచారం ఇవ్వగలుగుతామని ఆయన తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 25 వేల మైక్రోవాటర్ షెడ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ వాతావరణ సంస ప్రమాణాలకనుగుణంగా ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ విధానంలో ఇవి పనిచేస్తాయన్నారు. మొదలైన ‘ఈశాన్య’ వర్షాలు రాయలసీమలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవడం మొదలయింది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు దక్షిణ తమిళనాడుపై కొమరిన్ ప్రాంతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. ఈనెల 6 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలపై ఉంటుందని అంచనా వేస్తోంది. గడచిన 24 గంటల్లో తొట్టంబేడులో 8, నగరిలో 7, శ్రీకాళహస్తి, కందుకూరులో 6 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. అమరావతిలో ఐఎండీ కేంద్రం! రాజధాని అమరావతిలో ఐఎండీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు రమేష్ వెల్లడించారు. అక్కడ ఐఎండీ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఎకరం భూమి కేటాయించిందని, దీని నిర్మాణానికి కొంత సమయం పట్టనుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమరావతిలోని ఎస్ఆర్ఎం భవనాల్లో గదులను అద్దెకు తీసుకుని తాత్కాలికంగా ఐఎండీ కేంద్రాన్ని నడుపుతామని చెప్పారు. -
ఆగస్టులోనూ తక్కువ వర్షపాతమే
న్యూఢిల్లీ: ఈ సీజన్లో దేశవ్యాప్తంగా పరస్పర విరుద్ధ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. భారీ వర్షాలు, వరదలతో కేరళకు తీవ్రనష్టం వాటిల్లగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మరికొన్ని రాష్ట్రాల్లో అతిగా వర్షాలు కురిశాయని పేర్కొంది. అదే సమయంలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో వరుసగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ వివరించారు. సాధారణ వర్షపాతం 261.3 మిల్లీమీటర్లు కాగా ఆగస్టులో 241.4 మిమీ మాత్రమే నమోదైందన్నారు. అయితే, దేశ వ్యాప్తంగా చూస్తే వర్షాలు మంచిగానే కురిశాయని తెలిపారు. సాధారణంగా సెప్టెంబర్ 15 తర్వాత రుతు పవనాల నిష్క్రమణ రాజస్తాన్ నుంచి మొదలవుతుంది. దీని ఫలితంగా వానలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. -
రైతన్నకు తీపి కబురు
సాక్షి, న్యూఢిల్లీ: దేశానికి వెన్నెముకైన రైతన్నలకు సంతోషాన్నిచ్చే కబురును భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం చెప్పింది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ వర్షపాతాన్ని తెస్తాయని వెల్లడించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ వాతావరణ విభాగం తొలివిడత అంచనాలను విడుదల చేశారు. రెండో అంచనాలను జూన్ ప్రారంభంలో, రుతుపవనాల ప్రారంభాన్ని మే మాసంలో వెల్లడిస్తారు. సాధారణంగా జూన్ 1కి నాలుగు రోజులు అటుఇటుగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. రమేశ్ మాట్లాడుతూ ‘2018 నైరుతి రుతుపవనాల కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షపాతం సాధారణంగా ఉంటుంది. 2016, 2017 సీజన్లలాగే విస్తృతంగా వర్షాలు పడి రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. దీర్ఘకాలిక సగటు వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది 97 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అంచనా వాస్తవంలో ఐదు శాతం తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. 1951 నుంచి 2000 వరకు చూస్తే దీర్ఘకాలిక సగటు వర్షపాతం 890 మి.మీ.’ అని చెప్పారు. వాన రోజులు తగ్గుతున్నాయి జాగ్రత్త! గ్లోబల్ వార్మింగ్ కారణంగా గత కొన్నేళ్లుగా వర్షాలు పడే రోజులు తగ్గుతున్నాయనీ, నీటి సంరక్షణ, నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని రమేశ్ సూచించారు. ‘ఒక ఏడాదిలో వర్షం కురిసే రోజుల సంఖ్య గతంలో కంటే తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో వాననీటిని ఒడిసిపట్టుకునేందుకు నీటి సంరక్షణ పద్ధతులను మెరుగ్గా పాటించాలి. నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాల సగటులో 96% వర్షం కురుస్తుందని గతేడాది మేం అంచనా వేసినా మధ్య భారతంలో కొన్ని రోజులు వర్షాలు పడలేదు. సెప్టెంబరు ఆఖరు వరకు చూస్తే 95% వర్షపాతమే నమోదైంది. అయితే అక్టోబరు మొదటి వారంలో మరికొంత వర్షం పడటంతో మా అంచనాలు నిజమయ్యాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఒక శాతం ఎక్కువగానే మా అంచనాలు ఉన్నాయి’ అని రమేశ్ వివరించారు. పరిస్థితులు అనుకూలం: గత ఏడాది ఓ మోస్తరుగా ఉన్న లా నినా పరిస్థితులు ఈ ఏడాది ప్రారంభంలో బలహీనపడ్డాయనీ, రుతుపవనాల సీజన్ ప్రారంభమయ్యే నాటికి తటస్థ పరిస్థితికి వచ్చే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ‘ఈ ఏడాది రుతుపవనాలు ప్రారంభమయ్యేనాటికి లా నినా తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఎల్‌నినో పరిస్థితులకు అవకాశం లేదు’ అని చెప్పారు. ఈ అంచనాలు నిజమైతే దేశ ఆర్థిక వ్యవస్థకూ మేలు జరుగుతుందనీ, జీడీపీ వృద్ధిరేటు కూడా పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 27.75 కోట్ల టన్నుల ధాన్యాల దిగుబడి జరగ్గా.. వర్షాలు బాగా కురిస్తే వచ్చే ఏడాది ఉత్పత్తి అంతకు దాటి పోవచ్చని వ్యవసాయ శాఖ కార్యదర్శి పట్నాయక్ చెప్పారు. 50 శాతానికిపైగా రైతులు వర్షాధారిత సాగు చేస్తుండటంతో వారి దిగుబడి పెరిగి తద్వారా కొనుగోలు శక్తి కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని అంటున్నారు. -
మళ్లీ ఎల్‌నినో!: స్కైమెట్
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలపై గత రెండేళ్లుగా ప్రతికూల ప్రభావం చూపి కరువుకు కారణమైన ఎల్‌నినో ఈ ఏడాది కూడా కొనసాగవచ్చని వాతావరణ అధ్యయన సంస్థ ‘స్కైమెట్’పేర్కొంది. దీనిని కొట్టి పారేస్తూ ఎల్‌నినోపై ఇప్పుడే మాట్లడటం తొందరపాటు అవుతుందని భారత వాతావరణ సంస్థ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ అన్నారు. ప్రస్తుతం లానినా ఉందనీ, వర్షాలు తగినంత కురవొచ్చని ఆయన తెలిపారు. లానినా వల్ల పసిఫిక్ మహా సముద్రంలో నీళ్లు చల్లబడి సమృద్ధిగా వర్షాలు కురిస్తే..ఎల్‌నినో వల్ల నీళ్లు వేడెక్కి అల్ప వర్షపాతం నమోదవుతుంది. ఈ ఏడాది ప్రస్తుతం లానినా ఉన్నప్పటికీ, ఎల్‌నినో మళ్లీ వస్తుందని వాతావరణ నమూనాలను పరిశీలిస్తే అనిపిస్తోందని స్కైమెట్ పేర్కొంది. అలాగే, నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపేది ఎల్‌నినో మాత్రమే కాదనీ, ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) కూడా ప్రభావితం చేస్తుందని తెలిపింది. కాబట్టి రుతుపవనాల సమయంలో ఎల్‌నినో ప్రభావాన్ని ఐఓడీ తటస్థీకరించగలదేమో వేచి చూడాలని స్కైమెట్ అంటోంది.