సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఈనెల ఏడో తేదీన మరో తుపాను ఏర్పడబోతోంది. ఇది తమిళనాడు, రాయలసీమలపై ప్రభావం చూపుతుంది. అయితే ఇది తుపానుగానే కొనసాగుతుంది తప్ప తీవ్రరూపం దాల్చే అవకాశం లేదని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ తెలిపారు. అనంతరం ఆ తుపాను అరేబియా సముద్రంలోకి ప్రవేశించి అక్కడ మరింత బలపడుతుందన్నారు. ఈ తుపాను ప్రభావంతో తమిళనాడు, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురవడానికి వీలుందన్నారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలపై తక్కువగా ఉంటుందని, దీంతో అక్కడ లోటు వర్షపాతం నమోదయ్యే వీలుందని చెప్పారు.
తమిళనాడులో మాత్రం సాధారణంకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్నారు. ఐఎండీ అంచనా వేసిన మేరకే నైరుతి రుతుపవనాల సీజనులో వర్షపాతం నమోదైందని, గతేడాదికంటే రిజర్వాయర్లలో నీటిమట్టాలు 117 శాతానికి పెరిగాయని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో దేశంలో ఆహారధాన్యాల దిగుబడి 1.8 శాతం మాత్రమే తక్కువని పేర్కొన్నారు. తిత్లీ తుపాను తీరం దాటే ప్రాంతాన్ని ఐఎండీ సరిగా అంచనా వేయలేకపోయిందన్న విమర్శలను ఆయన కొట్టేశారు. ఐఎండీ అంచనా వేసిన ప్రాంతంలోనే తీరం దాటిందని, ఇది ఐఎండీ కచ్చితత్వానికి నిదర్శనమని చెప్పారు. తుపాను కళింగపట్నం–ఇచ్ఛాపురంల మధ్య తీరాన్ని దాటుతుందని అక్టోబర్ 10వ తేదీ ఉదయమే ఐఎండీ వెల్లడించిందని, దీనికి అనుగుణంగానే తిత్లీ 30 కిలోమీటర్ల దూరంలో తీరం దాటిందని తెలిపారు. అయితే ముందస్తు సమాచారం సాంకేతిక కారణాల వల్ల సమాచార, ప్రసార మాధ్యమాలకు చేరకపోయి ఉండవచ్చన్నారు. వాతావరణశాఖలో 1,102 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ జరుగుతోందని, దీంతో సిబ్బంది కొరత సమస్య తీరుతుందని రమేష్ చెప్పారు.
ముంపు ముప్పుపై ముందస్తు సమాచారం..: ఇకపై వరద, తుపానుల వల్ల ముంపు ముప్పు ఎక్కడ ఏర్పడుతుందన్న దానిపై ముందస్తు సమాచారం ఇవ్వగలుగుతామని ఆయన తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 25 వేల మైక్రోవాటర్ షెడ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ వాతావరణ సంస ప్రమాణాలకనుగుణంగా ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ విధానంలో ఇవి పనిచేస్తాయన్నారు.
మొదలైన ‘ఈశాన్య’ వర్షాలు
రాయలసీమలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవడం మొదలయింది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు దక్షిణ తమిళనాడుపై కొమరిన్ ప్రాంతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. ఈనెల 6 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలపై ఉంటుందని అంచనా వేస్తోంది. గడచిన 24 గంటల్లో తొట్టంబేడులో 8, నగరిలో 7, శ్రీకాళహస్తి, కందుకూరులో 6 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.
అమరావతిలో ఐఎండీ కేంద్రం!
రాజధాని అమరావతిలో ఐఎండీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు రమేష్ వెల్లడించారు. అక్కడ ఐఎండీ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఎకరం భూమి కేటాయించిందని, దీని నిర్మాణానికి కొంత సమయం పట్టనుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం భవనాల్లో గదులను అద్దెకు తీసుకుని తాత్కాలికంగా ఐఎండీ కేంద్రాన్ని నడుపుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment