సాధారణం కంటే తక్కువ వర్షపాతమే!
ఈసారి నైరుతి రుతుపవనాల తీరిది
ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావం
వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ అంచనా
హైదరాబాద్: మరో నెలన్నర గడిస్తే తొలకరి పలకరించాలి. నాగళ్లు కదలాలి. మరి ఈ ఏడాది వ్యవసాయానికి రుతుపవనాలు సహకరిస్తాయా? వానలతో కరుణిస్తాయా లేక ఇబ్బంది పెడతాయా? దేశంలోనే తొలి ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థ ‘స్కైమెట్’.. రుతుపవనాల తీరును విశ్లేషించింది. దీని అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాల ప్రభావం ఈసారి కొంచెం మోదం.. కొంచెం ఖేదం తరహాలోనే ఉండబోతోంది. తెలంగాణతోపాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం కరవు పరిస్థితు..లు ఏర్పడవచ్చని, ఆయా ప్రాంతాల్లో దీర్ఘకాలిక సగటులో పది శాతం కంటే తక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయని స్కైమెట్ అంచనా వేసింది.
ఆరు శాతం తగ్గుదల: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో దీర్ఘకాలిక సగటు(896 మిల్లీమీటర్లు)లో ఆరు శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని స్కైమెట్ అంచనా. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం కొన్ని చోట్ల ఎక్కువగా, మరికొన్ని చోట్ల తక్కువగా వర్షపాతం ఉంటుంది. దేశం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది. కానీ, తెలంగాణతోపాటు విదర్భ, మరఠ్వాడ, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి.
ఆగస్టులో కాస్త మెరుగు: నైరుతి రుతుపవనాల ప్రభావం ఈ ఏడాది కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ.. జూన్-సెప్టెంబరు మధ్యకాలంలో ఒక్క ఆగస్టులోనే కొంచెం మెరుగైన వర్షాలు నమోదవుతాయని స్కైమెట్ పేర్కొంది. ఆ నెలలో దీర్ఘకాలిక సగటు 253 మిల్లీమీటర్లు కాగా, ఈ మేర వర్షాలు పడేందుకు 70 శాతం అవకాశాలున్నాయి. అదే విధంగా జూన్ నెలలో సాధారణ వర్షం(174 మిల్లీమీటర్లు) కురిసేందుకు 68 శాతం అవకాశముండగా, జూలై, సెప్టెంబర్లో మాత్రం 59 శాతమే అవకాశముంది. ఈ పరిస్థితికి కారణం ఎల్నినో అని స్కైమెట్ పేర్కొంది.