Anti
-
కెన్యా నిరసనల్లో మృతుల సంఖ్య 39
ఆఫ్రికన్ దేశం కెన్యాలో పన్నుల పెంపునకు వ్యతిరేకంగా జనం చేపట్టిన నిరసనల్లో 39 మంది మృతి చెందారని జాతీయ హక్కుల పర్యవేక్షణ సంస్థ ప్రకటించింది. ఈ విషయంలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు సరికావని పేర్కొంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం జూన్ 18 నుండి జూలై ఒకటి వరకు జరిగిన నిరసనల్లో 627 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసినట్లు జాతీయ హక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపింది. నిరసనకారులు పార్లమెంట్ కాంప్లెక్స్‌ను ధ్వంసం చేసిన సందర్భంగా వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాగా ప్రెసిడెంట్ విలియం రూటో సెప్టెంబరు 2022లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఏదో ఒక పేరుతో నిరసనలు కొనసాగుతున్నాయి.ప్రెసిడెంట్ రూటో ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ నిరసనల్లో 19 మంది మృతి చెందారన్నారు. ఈ మరణాలపై దర్యాప్తు చేపడతామన్నారు. కాగా నిరసనకారులు, వైద్య సిబ్బంది, న్యాయవాదులు, జర్నలిస్టులపై చేపడుతున్న బలవంతపు చర్యలపై మానవ హక్కుల సంఘం గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Israel: ప్రజా ఆందోళనలు.. ముందస్తు ఎన్నికలకు డిమాండ్
ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టారు. గాజాలో బందీలుగా ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని, దేశంలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.ఇజ్రాయెల్‌లోని కప్లాన్ స్ట్రీట్‌లో ప్రముఖ రచయిత డేవిడ్ గ్రాస్మాన్ ఈ ఆందోళనల్లో పాల్గొని, దేశం కోసం ప్రజలంతా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే షిన్ బెట్ మాజీ అధిపతి యువల్ డిస్కిన్ తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశిస్తూ ‘దేశ చరిత్రలో అత్యంత చెత్త , విజయవంతం కాని ప్రధాన మంత్రి’ అని పేర్కొన్నారు. వెంటనే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. డిస్కిన్ 2005 నుండి 2011 వరకు షిన్ బెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అధ్యక్షునిగా పనిచేశారు. అధికార లికుడ్ పార్టీ ప్రధాన కార్యాలయం బీట్ జబోటిన్స్కీ వెలుపల ప్రజలు నిరసనలు చేపట్టారు. నిరసనకారులు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనే నినాదాలు కలిగిన బ్యానర్లు పట్టుకున్నారు. మరికొందరు గాజాలో యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ర్యాలీ అనంతరం పలువురు ఆందోళనకారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. వాహనాల టైర్లను తగులబెట్టారు. ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపిన వివరాల ప్రకారం మౌంటెడ్ పోలీసు సిబ్బంది ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సమయంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నివాసం వెలుపల వేలాది మంది ప్రజలు నిరసన తెలిపారు. హమాస్ చేతిలో బందీలైనవారి కుటుంబ సభ్యులు కింగ్ జార్జ్ స్ట్రీట్‌లో నిరసన కవాతు నిర్వహించారు. -
Canada: కెనడాలో ‘ట్రూడో’కు షాక్.. సర్వేల్లో సంచలన ఫలితాలు
ఒట్టావా: కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పోస్ట్ మీడియా కోసం ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 70 శాతం మంది ట్రూడో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు తేలింది. దేశంలో పాలన సరిగా లేదని 60 శాతం మంది ట్రూడో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో 43 శాతం మంది 2021 ఎన్నికల్లో ట్రూడో ప్రభుత్వానికి ఓటు వేసిన వారే కావడం గమనార్హం. దేశంలో పెరగిపోతున్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న జీవన ఖర్చు, ఆరోగ్య రంగం, ప్రజల ఇళ్లు కొనుగోలుచేసే శక్తి వంటి అంశాల వచ్చే ఏడాది (2025) జరిగే సాధారణ ఎన్నికల్లో ట్రూడోకు వ్యతిరేకంగా పనిచేయనున్నట్లు చెబుతున్నారు. కాగా, నాన్ ప్రాఫిట్ అంగుస్ రెడ్ సంస్థ(ఏఆర్ఐ) నిర్వహించిన సర్వేలోనూ కేవలం 17 శాతం మంది మాత్రమే ట్రూడో తిరిగి ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారు. 28 శాతం మంది ‘నన్ ఆఫ్ ద అబోవ్’ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ఈ సర్వేలో కన్జర్వేటివ్ నేత పియెర్రే పొలీవర్ పట్ల మాత్రం కాస్త మెరుగైన స్పందన వచ్చింది. లిబరల్స్‌తో పోల్చుకుంటే కన్జర్వేటివ్ పార్టీ గత 12 నెలల నుంచి దేశంలో నిర్వహించిన సర్వేల్లో ముందు నిలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 338 సీట్లున్న కెనడా పార్లమెంట్లో కన్జర్వేటివ్ పార్టీ 206 సీట్లు, లిబరల్స్ 67 సీట్లు గెలుచుకుంటాయని అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. వయసుపై జోకులు వేసుకున్న బైడెన్.. పాపులర్‌గా మారిన యాడ్ -
Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్ చెప్పేయ్..!
ఫిబ్రవరి అంటే ప్రేమికుల నెలమాత్రమే కాదు. మరొకటి కూడా ఉంది. ఫిబ్రవరి 14 వరకు వారంరోజుల పాటు వాలెంటైన్స్ వీక్ సందడి ఉంటుంది. అంతా ప్రేమికులకు, ఓకే చెప్పడానికి అయితే.. తిరస్కరించడానికీ, భగ్న ప్రేమికులకీ ఉండాలిగా అన్నట్టు యాంటీ వాలెంటైన్స్ వీక్ సందడి కూడా షురూ అవుతుంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి! రోజ్ డే, ప్రపోజల్ డే, లవ్ డే, కిస్ డే, హగ్ డే, టెడ్డీ డే అంటూ ప్రేమ పక్షులు సందడి చేస్తే ..ఫిబ్రవరి 15నుంచి యాంటీ వాలెంటైన్స్ వీక్ భగ్నప్రేమికులకు, ప్రేమను తిరస్కరించే కిక్కు అన్నట్టు..ఫిబ్రవరి 15న చెంపదెబ్బతో మొదలై, ఫిబ్రవరి 21న బ్రేకప్‌తో తృప్తి పడతారు వాలెంటైన్స్ వీక్ అంతా. యాంటీ వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 15, స్లాప్ డే: గుండె పగిలిన వారందరూ తమ బాధలన్నింటికీ కారణమైన తమ మాజీలను చెంపదెబ్బ కొట్టడానికి ఈ రోజు అనుమతిస్తుంది. ఒక విధంగా ఇది ఇబ్బంది పెట్టే చెడు ఆలోచనలు, జ్ఞాపకాలను దూరం చేసే రోజు. ఫిబ్రవరి 16,కిక్ డే: ప్రేమలో మోసం చేసిన వారి జ్ఞాపకాలన్నింటినీ వదిలించుకోవడం, జీవితంలో నింపిన విషాదాన్ని, కోపాన్ని వదిలేయడం. అంతేకాదు వాళ్లిచ్చిన గిఫ్ట్స్‌లు, ఇతర గుర్తులను పూర్తిగా వదిలివేయడం. ఫిబ్రవరి 17, పెర్ఫ్యూమ్ డే: పదే పదే వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలను మర్చిపోయి, మంచి పరిమళంతో కొత్త ఆహ్లాదాన్ని నింపుకోవడం ఫిబ్రవరి 18, ఫ్లర్ట్ డే: ఈ రోజున కొత్త వ్యక్తిని కలుసుకుని వారితో సరదాగా గడపడం ఫిబ్రవరి 19, కన్ఫెషన్ డే: తప్పులను ఒప్పుకోవడం, ఎదుటివారిని క్షమించమని అడగడం ఫిబ్రవరి 20, మిస్సింగ్ డే : ఎవరైనా తమ వాలెంటైన్‌ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటే వాళ్లకి మెమొరీస్‌ని గుర్తు చేయడం ఫిబ్రవరి 21, బ్రేకప్ డే:ఇది కీలకమైందీ.. చివరి రోజు కూడా అవతలి వారి ప్రేమ నిజమైంది కాదనిపిస్తే..నిస్సందేహంగా వదిలివేయడం హ్యాపీగా ఉండటం. ప్రేమ అందమైందే ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం చాలా చాలా అందంగా కనిపిస్తుంది. కానీ తేడా వస్తే విడిపోతే భరించడం కష్టమే. నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది.. కానీ జీవితం అక్కడితో ఆగిపోకూడదు. మనలాంటివాళ్లని దక్కించుకోలేని దురదృష్టవంతులు అనుకొని వదిలేయాలి. నిజానికి గమనిస్తే.. నిస్వార్థంగా మనల్ని మనంగా ప్రేమించే వాళ్లు చాలామంది ఉంటారు. దాన్ని మనం గుర్తించగలగాలి అంతే. -
Telangana: ఇక డ్రగ్స్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: మత్తులో జోగుతూ వాహనాలు నడిపేవాళ్ల కట్టడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారు. కొత్త ఏడాది నుంచి ఇక తెల్లవారులూ ప్రధాన నగరాల్లో.. పట్టణాల్లో మందు బాబుల భరతం పట్టేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర పోలీస్ శాఖ. ఈ తరుణంలో.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రయోగాత్మకంగా డ్రగ్స్ డ్రైవ్ నిర్వహణకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో సిద్ధమైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల తరహాలోనే.. డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో నిర్ణయించుకుంది. ఇందుకోసం కొత్త కిట్లను రప్పించుకుని పోలీస్ శాఖకు అప్పగించింది. ఇక శాంపిల్స్, ల్యాబ్ టెస్టులు పాత ముచ్చట. ఈ కొత్త కిట్ల ద్వారా మూడు రోజుల తర్వాత కూడా రక్త, మూత్ర పరీక్షల ద్వారా డ్రగ్స్ తీసుకున్న సంగతి బయపడుతుంది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ రాగానే అప్పటికప్పుడే డ్రగ్స్ తీసుకుంటే పాజిటివ్ రిపోర్టు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే.. పాజిటివ్ రిపోర్టు రాగానే మరిన్ని పరీక్షల కోసం మూత్ర పరీక్షలు అధికారులు చేస్తారు. రెండింటిలోనూ పాజిటివ్ రిపోర్టు వస్తే సదరు వ్యక్తిని అదుపు తీసుకుంటారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం అరికట్టడమే లక్ష్యం నార్కోటిక్ బ్యూరో చర్యలు తీసుకుటోంది. ఇప్పటికే కొత్త పరికరాలు ఒక్కో కమిషనరేట్‌కు పాతిక దాకా పంపించారు. డ్రగ్ డిటేక్షన్ పరీక్షలపై పోలీసులకు ఇప్పటికే శిక్షణ పూర్తి అయిందిని అధికారులు తెలిపారు. ట్రై కమిషనరేట్ పరిధిలో జంక్షన్ల వద్ద డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ టెస్టులు ఇచ్చే ఫలితం ఆధారంగా.. వారాంతాల్లో రెగ్యులర్‌గా ఇలాంటి చెకింగ్లు నిర్వహించే యోచనలో ఉంది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. మరోవైపు రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టే విషయంలో తెలంగాణ కొత్త సర్కార్ సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించుకుంది. కఠిన చర్యలు తప్పవు నయా సాల్ వేడుకల్లో మత్తులో ఊగితే కఠిన చర్యలు తప్పవని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. పబ్బు, రిసార్ట్ మేనేజర్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాం. ఎవరైనా డ్రగ్స్ వాడినట్లయితే వారిపై చర్యలు ఉంటాయి. పబ్బులపైన పూర్తిస్థాయిలో నిఘా పెట్టాం. పబ్బుల్లో.. రిసార్టుల్లో డ్రగ్స్ దొరికితే వారి లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్తులో వారికి లైసెన్స్ రాకుండా చేస్తాం. కొన్ని రంగాల వారికి డ్రగ్స్ అవసరాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది. ఆయా ఫీల్డ్ వారిని కూడా హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ వాడొద్దు అని హెచ్చరించారాయన. అలాగే.. కొత్త సంవత్సర వేడుకలు సందర్భంగా నగరంలో ఆంక్షలు ఉంటాయని తెలిపారు. నగరంలో పలు బ్రిడ్జిలపై రాకపోకలు నిషేధిస్తామని తెలిపారాయన. రాత్రి 10 గంటల నుంచి ‘పీవీ ఎక్స్‌ప్రెస్ వే’ను మూసివేస్తాం. అయితే.. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు టికెట్‌ను చూసి పీవీ ఎక్స్‌ప్రెస్ మార్గంలో అనుమతిస్తాం. రాత్రి ఒంటిగంట వరకే వ్యాపారాలను అనుమతిస్తాం. ఒంటి గంట తర్వాత ఎట్టి పరిస్థితిలో వ్యాపారాలు అనుమతించబడవు.. మూసేయాల్సిందే. -
గ్రాము ఖరీదు కోట్ల డాలర్లట!... ఏందబ్బా అది?
ఈ భూమండలంపై అత్యంత ఖరీదైన పదార్థమేమిటనే ప్రశ్న ఎవరినైనా అడిగితే ప్లాటినం, వజ్రం లేదా బంగారం అని చెబుతుంటారు. అయితే వీటికి మించిన ఖరీదైన పదార్థం ఒకటుందనే సంగతి మీకు తెలుసా? దాని విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆ పదార్ధం ఒక గ్రాము ధర 7,553 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) ఆ ఖరీదైన పదార్ధం పేరు యాంటీమాటర్. దీని గురించి ఎవరూ అంతగా వినివుండకపోవచ్చు. అయితే సైన్స్ ప్రపంచంలో ఇది ఒక రహస్యమైన, శక్తిమంతమైన పదార్ధం. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం యాంటీమాటర్ అనేది పదార్థంతో సమానంగానే ఉంటుంది. కానీ ఇది సాధారణ పదార్ధానికి పూర్తిగా వ్యతిరేకం. యాంటీమాటర్లోని ఉప పరమాణు కణాలు సాధారణ పదార్థానికి వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి. దీనిని 20 వ శతాబ్దపు ప్రథమార్థంలో కనుగొన్నారు. యాంటీమాటర్ను మొట్టమొదట ప్రపంచానికి 1928 లో శాస్త్రవేత్త పాల్ డిరాక్ పరిచయం చేశారు. న్యూ సైంటిస్ట్ పత్రిక ఈ మహనీయుడిని ‘సర్ ఐజాక్ న్యూటన్ తరువాత గొప్ప బ్రిటిష్ సిద్ధాంతకర్త’ అని అభివర్ణించింది. నాటి నుంచి యాంటీమాటర్ శాస్త్రవేత్తలకు సైతం ఉత్సుకత కలిగించే అంశంగా మారింది. యాంటీమాటర్ అత్యధిక శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక గ్రాము యాంటీమాటర్ 43 మెగాటన్నుల ట్రినిట్రోటోల్యూన్ (టీఎన్టీ) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే జపాన్.. హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే మూడు వేల రెట్లు అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. యాంటీమాటర్ అంతరిక్ష ప్రయాణానికి సమర్థవంతమైన ఇంధనంగా లేదా మన గ్రహానికి అత్యధిక శక్తి వనరుగా కూడా ఉపయోగపడుతుంది. విశ్వం యొక్క మూలం, పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి యాంటీమాటర్ సహాయపడుతుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం అనేది అధిక సాంద్రత, ఉష్ణోగ్రత స్థితి నుండి ఉద్భవించింది. ఇక్కడ పదార్థం, యాంటీమాటర్ సమానంగా, సమృద్ధిగా ఉన్నాయి. అయితే ప్రారంభ విశ్వంలో పదార్థం, యాంటీమాటర్ మధ్య కొంత అసమానత లేదా అసమతుల్యత ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది యాంటీమాటర్ కంటే పదార్థం అధికంగా ఉండటానికి దారితీసింది. ఇది భౌతిక శాస్త్రంలో అతిపెద్ద పజిల్‌గా నిలిచింది. యాంటీమాటర్ను శాస్త్రీయ పరిశోధనలు, వైద్య అనువర్తనాలకు సాధనంగా ఉపయోగించవచ్చు. ఇది సాంప్రదాయిక పద్ధతులకు మించి మరింత ఖచ్చితంగా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకునే రేడియేషన్ థెరపీకి ఉపయుక్తమవుతుంది. యాంటీహైడ్రోజన్ (యాంటీమాటర్తో తయారు చేసిన సరళమైన పరమాణువు) సమానత్వ సూత్రం, ఛార్జ్-పారిటీ-టైమ్ (సీపీటీ) సమరూపత వంటి భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను పరీక్షించడానికి యాంటీమాటర్ ఉపయోగపడుతుంది. శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం యాంటీమాటర్ను సృష్టించడం, నిల్వ చేయడం అంత సులభం కాదు. దీనికి పార్టికల్ యాక్సిలరేటర్లు, వాక్యూమ్ ఛాంబర్లు వంటి అధునాతన సౌకర్యాలు, సాంకేతికతలు అవసరమవుతాయి. ప్రస్తుతం మనం స్వల్ప పరిమాణంలోని యాంటీమాటర్ను మాత్రమే ఉత్పత్తి చేయగలం. దీనికి కూడా అధికంగా ఖర్చు అవుతుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం యాంటీమాటర్ అనేది భూమిపై అత్యంత ఖరీదైన పదార్థం. శాస్త్రవేత్తలు భూమిపైనే లార్జ్ హాడ్రాన్ కొలైడర్ లాంటి అధిక శక్తి కణాల యాక్సిలరేటర్ల ద్వారా యాంటీ పార్టికల్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశోధనలు విజయవంతం కావాలని కోరుకుందాం. ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల! -
హిందూ దేవుళ్ల విషయంలో అది సాధ్యం కాదా?: ట్విటర్‌కు చురకలు
సున్నిత అంశంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందూ దేవుళ్లపై అభ్యంతరకర కంటెంట్ పోస్ట్ చేసేవాళ్లపై స్వచ్ఛందంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ట్విటర్‌ను నిలదీసింది. ఈ క్రమంలో మైక్రోబ్లాగింగ్ సైట్‌కు చురకలు అంటించింది. 'AtheistRepublic' అనే ట్విటర్ పేజీలో కాళి మాతకు వ్యతిరేకంగా కొన్ని పోస్టులు కనిపించాయి. దీంతో ట్విటర్ ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. సోమవారం ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అయితే అమెరికాకు అధ్యక్షుడిగా పని చేసిన డొనాల్డ్ ట్రంప్ విషయంలో ట్విటర్ అనుసరించిన తీరును ఈ సందర్భంగా ట్విటర్‌కు గుర్తు చేసింది ఢిల్లీ హైకోర్టు. ఇలా హిందూ దేవుళ్లపై అభ్యంతరకర పోస్టులు చేసేవాళ్ల అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేయడం లేదంటూ, చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. అలాగే ఇతర ప్రాంతాల, జాతుల ప్రజల సున్నితత్వాల గురించి ట్విట్టర్ పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఆక్షేపించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ నవీన్ చావ్లా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్లాట్‌ఫారమ్‌లో కొంతమంది వ్యక్తులను బ్లాక్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తూ.. అసలు ఖాతాల బ్లాక్‌ను ఎలా చేపడతారో వివరించాల’ని ట్విట్టర్‌ను ఆదేశించింది. అందరి అకౌంట్లు అలా బ్లాక్ చేయలేమని ట్విటర్ వివరణ ఇవ్వగా.. మరి ట్రంప్ అకౌంట్ ఎలా చేశారని నిలదీసింది. కంటెంట్ సున్నితమైందని, వ్యక్తులు సున్నితమైన వాళ్లని భావించినప్పుడు వాళ్లను బ్లాక్ చేశారు కదా. అలాంటప్పుడు ఇక్కడ కూడా సున్నితమైన అంశాలపై పట్టించుకోరా? ఈ తీరు సరైందేనా? అని నిలదీసింది. అభ్యంతకర కంటెంట్ విషయంలో కేసు, ఎఫ్ఆర్లు నమోదు అవుతున్నాయని ట్విటర్ తరపున సీనియర్ అడ్వొకేట్ సిదార్థ్ లుథ్రా వెల్లడించారు. ఈ నేపథ్యంలో... ఐటీ యాక్ట్ ప్రకారం.. ప్రస్తుత సందర్భంలో(కేసు విషయంలో) అకౌంట్ బ్లాక్ చేయడం సబబేనా పరిశీలించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తర్వాతి వాదనలను సెప్టెంబర్ 6వ తేదీన విననుంది ఢిల్లీ హైకోర్టు. -
Afghanistan: తాలిబన్ల వెన్నులో వణుకు.. అఫ్గాన్ హీరో ఇతడే..!
Ahmad Massoud History In Telugu: తాలిబన్లు.. రాక్షసత్వానికి మారు పేరు. వాళ్ల పేరు చెబితే అఫ్గాన్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వెన్నులో వణుకు పుడుతుంది. తాలిబన్ల అరాచకాలు ఒకటా..? రెండా..? ఎన్నో ఎన్నెనో..! అయితే తాలిబన్ల దురాక్రమణపై సింహంలా గర్జిస్తున్న ప్రాంతం పంజ్‌షిర్. ఒకప్పుడు అక్కడ గెరిల్లా పోరాటంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడే అహ్మద్ షా మసూద్. ఆయన తాలిబన్ల అంతానికి అహర్నిశలు కృషిచేశారు. ఇప్పుడు ఆయన లేకపోవచ్చు. కానీ ఆయన నాటిన విత్తనాలు పంజ్‌షిర్ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. ఆయన కొడుకు అహ్మద్ మసూద్ ప్రపంచ దేశాల మద్దతుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబూల్: అహ్మద్ షా మసూద్ కొడుకు అహ్మద్ మసూద్(32) తన బలమైన కోటైన పంజ్‌షిర్ లోయ నుంచి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం అఫ్గాన్ మిలిటరీ సభ్యులు, కొంతమంది ప్రత్యేక దళ సభ్యులతో కలిసి పోరాడనున్నట్లు మసూద్ తెలిపారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే గుర్తించి తన తండ్రి ఉన్నప్పుడే మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను భద్రపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. తాలిబన్లు తమ పై దాడి చేస్తే తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటారని హెచ్చరించారు. అయితే పాశ్చాత్య దేశాల సహాయం లేకుండా తమ దళాలు నిలవలేవని, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు ఇచ్చి, అవసరమైన వాటిని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య కేవలం అఫ్గాన్ ప్రజలది మాత్రమే కాదన్నారు. తాలిబన్ల నియంత్రణలో నిస్సందేహంగా అఫ్గాన్‌లో పెను విధ్వంసం సృష్టిస్తుందన్నారు. ఇది ప్రజాస్వామ్యాలకు వ్యతిరేకంగా మరోసారి బాటలు పరుస్తుందని అహ్మద్ మసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అహ్మద్ షా మసూద్ ఎవరు? హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షిర్ ప్రావిన్స్ ఉంది. దాదాపు లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో తజిక్ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. పంజ్‌షిర్ ప్రజల్లో తెగింపు చాలా ఎక్కువ. అక్కడి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని మరింతగా నింపిన నాయకుడు అహ్మద్ షా మసూద్. ఆయన మార్గదర్శకత్వంలో పంజ్‌షిర్ ప్రజలు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడారు. 1970-80లలో సోవియట్ రష్యా దండయాత్రను తిప్పికొట్టడంతో పాటు.. 1996-2001లో తాలిబన్ల రాక్షస పాలనపై అవిశ్రాంత పోరాటం జరిపిన యోధుల్లో అహ్మద్ షా పాత్ర కీలకమైనది. ఆయన కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు.. మిలటరీ కమాండర్ కూడా. 2001లో యూరప్‌ను సందర్శించి తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతు లేకుండా ఒత్తిడి చేయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ నేతలను కోరారు. తాలిబన్ పాలనలో అఫ్గాన్ ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, మానవతా దృక్పథంతో సాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. కాగా తాలిబన్లు, ఆల్‌ఖైదాలు కలిసి నకిలీ విలేకరుల వేషాల్లో మీడియా ఇంటర్వ్యూ చేస్తూ.. 2001 సెప్టెంబర్ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. చదవండి: Afghanistan: విషాదం, ఆకలితో కన్నవారి చేతుల్లోనే కన్నుమూసింది -
ఔను, ఆ యువతులిద్దరూ ఒక్కటయ్యారు.!
చంఢీగఢ్: సాధారణంగా పెళ్లి ఎవరు చేసుకుంటారు? ఇంకెవరు.. ఆడ, మగ చేసుకుంటారు. కానీ అంతటా ఇలా జరగదు. కొన్ని చోట్ల ఆడవారు ఆడవారిని, మగవారు మగవారిని పెళ్లి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి ఓ వింత వివాహం హర్యానాలో జరిగింది. వివరాలు.. గురుగ్రామ్‌కు చెందిన 20 ఏళ్ల బాలిక, జాజర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల బాలిక మంచి స్నేహితులు. వీరిద్దరు కూడా జాజర్ జిల్లాలోని ఒకే పాఠశాలలో చదువుకునేవారు. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండేవాళ్లు కాదు. అలా 7 సంవత్సరాల స్నేహాం కాస్తా ప్రేమగా మారింది. ఎలాగైనా ఒక్కటవ్వాలనుకున్నారు. దీంతో వీరి ప్రేమను వారి తల్లిదండ్రులకు చెప్పారు. ఇదెక్కడి ఘోరమని వారి నిర్ణయాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సమాజంలో ఆమోద యోగ్యం కాదు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని చెప్పారు. కానీ అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న యువతలికీ వారి మాటలను వినిపించుకోలేదు. ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఒకరోజు ఇద్దరూ తమ ఇంట్లో నుంచి పారిపోయి సోన్‌హాలోని ఒక ఆలయానికి చేరుకున్నారు. అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాం చేసుకున్నారు. ఈ విషయం తెలియని జాజర్ యువతి తండ్రి తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా యువతులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అమ్మాయిలిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక న్యాయస్థానం ముందు హజరుపర్చారు. ఈ క్రమంలో వీరి మధ్య వాదనలు ఆసక్తిగా జరిగాయి. ఆ యువతులిద్దరు తాము మేజర్లమని.. తమ ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని కోర్టుకు తెలిపారు. అయితే, ఆ యువతుల తల్లిదండ్రులు మాత్రం వారికి నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారట కానీ వారు అస్సలు వినిపించుకోవడం లేదట. ఏదేమైనా ఇద్దరూ కలిసి జీవించడానికి మొగ్గుచూపుతున్నారని హెలినామ్డి పోలీసు అధికారి మహేష్ కుమార్ తెలిపారు. చదవండి: Odisha DGP: హిజ్రాలకు కూడా పోలీసు ఉద్యోగాలలో అవకాశం.. -
దళిత వ్యతిరేక ప్రభుత్వాలపై పోరాటం
కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు జిల్లాకు చేరిన కేవీపీఎస్ బస్సుయాత్ర కూసుమంచి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, ఈ ప్రభుత్వాలపై పోరాటం కొనసాగించాలని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 23న సంగారెడ్డి నుంచి మొదలైన దళిత ఆత్మగౌరవ బస్సుయాత్ర మంగళవారం సాయంత్రం కూసుమంచికి చేరింది. యాత్ర బృందం సభ్యులు బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో స్కైలాబ్‌బాబు మాట్లాడారు. దళితులపై ఆరెస్సెస్, బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన దాడులకు పాల్పడుతున్నాయన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల మాట్లాడుతూ దళితులను కొట్టకండి అవసరమైతే తనను కా ల్పండి అంటూ మొసలికన్నీరు పెడుతూ మాట్లాడారని విమర్శించారు. రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం కూడా దళిత వ్యతిరేకమేనన్నారు. సీఎం కేసీఆర్ పిట్టల దొరకు మించిన ఘనుడన్నారు. సీఎం కూతురు కవిత, బంగారు తెలంగాణ పేరుతో బతుకమ్మలాడుతూ అగ్రకులాల మహిళలతోనే పండుగ చేస్తున్నారని, దళితులను దూరంగా పెడుతున్నారని విమర్శించారు. అసలు దళితులు లేనిదే బతుకమ్మ ఎక్కడిది.. బతుకమ్మ ఎరవూ అంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాద్యక్షుడు కె.నర్సింహారావు, నాయకులు మామిడి సర్వయ్య, జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్, డివిజన్ కార్యదర్శి కొమ్ము శ్రీను, పగిడికత్తుల నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ ఎడవెల్లి ముత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పొ¯ð ్నకంటి సంగయ్య, తాళ్లూరి వెంకటేశ్వరరావు, రైతు సంఘం డివిజన్ అద్యక్షుడు రేలా వెంకటరెడ్డి, నందిగామ కృష్ణ, గోపె వెంకన్న, నలగాటి మైసయ్య, భూక్యా సంతూనాయక్, రజక సంఘం నాయకులు కొక్కిరేణి వెంకన్న, కొరట్ల పాపయ్య తదిరతులు పాల్గొన్నారు. -
యవ్వనత్వాన్ని పెంచే కొత్తరకం 'జిన్'
సౌందర్య ప్రేమికుల కోసం ఓ కొత్త ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది. వృద్ధాప్యాన్ని తగ్గించి యవ్వనంగా కనిపించేందుకు కొల్లాజిన్ కలిసిన మద్యపానీయాన్నిప్రపంచంలోనే మొట్ట మొదటిసారి బ్రిటన్ కు చెందిన ఓ సంస్థ కనిపెట్టింది. యాంటే ఏ జిన్ పేరిట మార్కెట్లోకి విడుదల చేసింది. సౌందర్య ప్రేమికులు, యవ్వన ప్రియులు వృద్ధాప్యాన్ని అధిగమించేందుకు ఈ నూతన మద్యం ఎంతగానో ఉపయోగపడుతుందని తయారీదారులు చెప్తున్నారు. బ్రిటన్ కు చెందిన బోంపాస్ అండ్ పార్ కంపెనీ 'యాంటే ఏ జిన్' నూతన మద్యాన్ని ఆవిష్కరించింది. చిన్న వయసులోనే వయసు మీదపడినట్లు కనిపించేవారు, వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించాలనుకునే వారికి ఈ కొత్తరకం మద్యం వరమేనని సృష్టికర్తలు చెప్తున్నారు. కొత్తగా కనుగొన్న ఈ సౌందర్యసాధనం ఒక బాటిల్ ఖరీదు సుమారు 35 పౌండ్ల వరకూ ఉంటుందని చెప్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉండే సాధారణ కొల్లాజిన్ గుళికలకు బదులుగా ఈ కొత్తరకం మద్యం తీసుకొని సౌందర్యాన్ని పెంచుకోవచ్చని, యవ్వనాన్ని నిలుపుకోవచ్చని వెల్లడించారు. ఈ జిన్నును తాగడం వల్ల చర్మం ముడతలు పడుకుండా కాపాడుతుందని, యవ్వన వయస్కులుగా కనిపిస్తారని ఉత్పత్తిదారులు భరోసా ఇస్తున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి బ్రిటన్ కు చెందిన బోంపాస్ అండ్ పార్ సంస్థ 'యాంటీ ఏ జిన్' పానీయాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఆహార పానీయంలో ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతోపాటు, 40శాతం ఛమోమైల్, టీ సువాసనలతో కలసిన స్పిరిట్ ఉంటుందని తెలిపారు. అంతేకాక ఇతర రంగులతోపాటు దురదగొండి, కొత్తిమీర, జునిపెర్ వంటి సుగంధ మొక్కల వేళ్ళను కూడ ఈ పానీయం తయారీలో వినియోగించారు. ఈ సరికొత్త ఉత్పత్తి శరీరంపై మచ్చలను నిరోధించి, చర్మాన్ని మృదువుగా ఉండేందుకు సహాయపడటంతోపాటు.. పునరుత్తేజాన్ని కలిగిస్తుందని ఉత్పత్తిదారులు వార్నర్ లీజర్ హోటల్స్ తమ వెబ్ సైట్ లో వివరించారు. శరీరంలో కొల్లాజిన్ సహజంగానే ఉత్పత్తి అయినప్పటికీ తమ ఉత్పత్తి.. వయసును తగ్గించి యవ్వనాన్ని కలిగిస్తుందని సూచించారు. కొల్లాజిన్ ఉత్పత్తులను తీసుకోవడం లేదా అటువంటి బ్యూటీ ఉత్పత్తులను వాడటంవల్ల చర్మం ముడుతలు రాకుండా చేసి, అకాల వృద్ధాప్య సమస్యలను నివారించవచ్చని యాంటీ ఏ జిన్ ఉత్పత్తిదారులు చెప్తున్నారు. -
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ప్రభుత్వం!
న్యూ ఢిల్లీః ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ చర్యలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పార్టీ చర్యలు ఉంటున్నాయని, ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్త పరుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీకి మంచి అవకాశం ఉందని, ప్రజల్లో సానుకూల స్పందన ఉందని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వంగా ఉందంటూ అరుణ్ జైట్లీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. గత ఎన్నికట్లో ఢిల్లీలో బిజేపీ అతి తక్కువ శాతం ఓట్లతో అధికారాన్ని కోల్పోయి ఉండొచ్చుకానీ, ప్రస్తుతం తిరిగి ఆ మెజారిటీని సంపాదించుకున్నామని ఢిల్లీ బిజేపీ కార్యవర్గ సమావేశంలో జైట్లీ చెప్పారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చలేదని, ఒక్క పని కూడ పూర్తి చేయలేదని అన్న ఆర్థిక మంత్రి... ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించని కేజ్రీవాల్ తీరును ప్రజలు గుర్తించారని, కాంగ్రెస్ లెక్కల్లోనే లేకపోగా, బిజెపి తిరిగి రాజకీయ స్థానాన్ని సంపాదించేందుకు ఇదే మంచి అవకాశం అని తెలిపారు. ప్రజల దగ్గరకు వెళ్ళేందుకు ఇదే సరైన సమయమని, వారు చాలా నిరాశలో ఉన్నారని మంత్రి చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించి, ఢిల్లీ ప్రభుత్వ చర్యలను కూడ ఎత్తి చూపాలని ఆయన కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిరాశకు దారి తీసిందని, దేశంలో అన్ని మూలలా రాజకీయ ఉనికిని పెంచేందుకు పోరాడాలని సూచించారు. దేశ వ్యతిరేక నినాదాలను అన్ని విధాలా మౌఖికంగా ఖండించాల్సిన అవసరం ఉందని, జాతి వ్యతిరేక అంశాలను సమ్మతిస్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వంపై అసమ్మతి తెలపాల్సిన అవసరం ఉందని జైట్లీ అన్నారు. తాముకూడ ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నామని, అయితే పార్లమెంట్ లో ప్రస్తుత పరిస్థితులు అపూర్వంగా కనిపిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు జైట్లీ ఆరోపించారు. -
దద్దరిల్లిన అసెంబ్లీ
జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాల హోరు జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. శుక్రవారం ఉదయం పది గంటలకు సభ ప్రారంభం కావడానికి ముందుగానే వివిధ పార్టీల సభ్యులు పోడియంలోకి వెళ్లి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడం ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర కోసం నినాదాలు చేయగా, టీఆర్ఎస్, టీడీపీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అంతలోనే అధికార పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి దూసుకొచ్చారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని నినాదాలు చేశారు. వివిధ పార్టీలు వాయిదా తీర్మానాలను ఇచ్చాయని, వాటి గురించి వివరిస్తానని సభ్యులంతా తమతమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పదేపదే విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు నినాదాలు కొనసాగించారు. గందరగోళం కొనసాగుతుండగానే స్పీకర్.. వివిధ పార్టీల వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి సభను అరగంట వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో స్పీకర్ సభను రెండోసారి వాయిదా వేశారు. మధ్యాహ్నం 1.45 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కూడా గందరగోళం కొనసాగింది. దీంతో సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క.. సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో బిల్లుల పత్రాలు సభలో ప్రవేశపెట్టినట్లు భావించాలంటూ, సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ‘జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర’ నినాదాలతో శుక్రవారం శాసనమండలి హోరెత్తింది. సభ్యులు పార్టీలకతీతంగా ప్రాంతాలవారీగా విడిపోయి ఆందోళనకు దిగటంతో మండలి సోమవారానికి వాయిదా పడింది. -
హోరెత్తిన సమైక్య నినాదం
సమైక్యాంధ్రకు మద్దతుగా అబీద్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద విద్యార్థి జేఏసీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. దీక్షల్లో చిన్నపిల్లల వైద్యనిపుణుడు పి.వి.ఎస్.లక్ష్మీకాంత్, లోకేష్, సాయికిరణ్, విశ్వనాధ్, తాతాజీ, చందు, అనిల్, అంజి, హరీష్ పాల్గొన్నారు. కళాశీలు, వర్తకులు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో ప్రముఖ వైద్యుడు పి.వి.ఎస్.రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి రాజీవ్, ఇందిరాగాంధీ ఏనాడూ పూనుకోలేదని, విదేశీయురాలైన సోనియాగాంధీ ఆంధ్ర విభజనకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పెదబొడ్డేపల్లికి చెందిన వర్తక సంఘం, నాయీబ్రాహ్మణుల ఆధ్వర్యంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర చేపట్టి బొడ్డేపల్లి నుంచి అబీద్సెంటర్కు ర్యాలీ నిర్వహించి దహనం చేశారు. విశ్వబ్రాహ్మణ నాయకులు పెదపాటి గోవిందరావు, శాస్త్రి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం సిటీక్లబ్ ఆవరణలో అర్చక పురోహిత బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో విఘ్ననివారిత శాంతిహోమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జేఏసీ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం కృష్ణ, గోదావరి సహితంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అర్చకులు తెలుగుతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మున్సిపల్ సిబ్బంది విధులను బహిష్కరించి అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. అబీద్‌సెంటర్ నుంచి శ్రీకన్య కూడలి వరకు ప్రదర్శనగా వెళ్లి మానవహారంగా ఏర్పడ్డారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కళాశాల నుంచి ర్యాలీగా బయల్దేరి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాల్ఘాట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. చెట్టుపల్లిలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.