జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాల హోరు
జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. శుక్రవారం ఉదయం పది గంటలకు సభ ప్రారంభం కావడానికి ముందుగానే వివిధ పార్టీల సభ్యులు పోడియంలోకి వెళ్లి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడం ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర కోసం నినాదాలు చేయగా, టీఆర్‌ఎస్, టీడీపీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అంతలోనే అధికార పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి దూసుకొచ్చారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని నినాదాలు చేశారు.
వివిధ పార్టీలు వాయిదా తీర్మానాలను ఇచ్చాయని, వాటి గురించి వివరిస్తానని సభ్యులంతా తమతమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పదేపదే విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు నినాదాలు కొనసాగించారు. గందరగోళం కొనసాగుతుండగానే స్పీకర్.. వివిధ పార్టీల వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి సభను అరగంట వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో స్పీకర్ సభను రెండోసారి వాయిదా వేశారు. మధ్యాహ్నం 1.45 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కూడా గందరగోళం కొనసాగింది. దీంతో సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క.. సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో బిల్లుల పత్రాలు సభలో ప్రవేశపెట్టినట్లు భావించాలంటూ, సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ‘జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర’ నినాదాలతో శుక్రవారం శాసనమండలి హోరెత్తింది. సభ్యులు పార్టీలకతీతంగా ప్రాంతాలవారీగా విడిపోయి ఆందోళనకు దిగటంతో మండలి సోమవారానికి వాయిదా పడింది.