హోరెత్తిన సమైక్య నినాదం
Published Wed, Aug 7 2013 12:38 AM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM
సమైక్యాంధ్రకు మద్దతుగా అబీద్ సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద విద్యార్థి జేఏసీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. దీక్షల్లో చిన్నపిల్లల వైద్యనిపుణుడు పి.వి.ఎస్.లక్ష్మీకాంత్, లోకేష్, సాయికిరణ్, విశ్వనాధ్, తాతాజీ, చందు, అనిల్, అంజి, హరీష్ పాల్గొన్నారు. కళాశీలు, వర్తకులు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో ప్రముఖ వైద్యుడు పి.వి.ఎస్.రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి రాజీవ్, ఇందిరాగాంధీ ఏనాడూ పూనుకోలేదని, విదేశీయురాలైన సోనియాగాంధీ ఆంధ్ర విభజనకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పెదబొడ్డేపల్లికి చెందిన వర్తక సంఘం, నాయీబ్రాహ్మణుల ఆధ్వర్యంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర చేపట్టి బొడ్డేపల్లి నుంచి అబీద్‌సెంటర్‌కు ర్యాలీ నిర్వహించి దహనం చేశారు.
విశ్వబ్రాహ్మణ నాయకులు పెదపాటి గోవిందరావు, శాస్త్రి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం సిటీక్లబ్ ఆవరణలో అర్చక పురోహిత బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో విఘ్ననివారిత శాంతిహోమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జేఏసీ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం కృష్ణ, గోదావరి సహితంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అర్చకులు తెలుగుతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మున్సిపల్ సిబ్బంది విధులను బహిష్కరించి అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. అబీద్‌సెంటర్ నుంచి శ్రీకన్య కూడలి వరకు ప్రదర్శనగా వెళ్లి మానవహారంగా ఏర్పడ్డారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కళాశాల నుంచి ర్యాలీగా బయల్దేరి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాల్ఘాట్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. చెట్టుపల్లిలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Advertisement
Advertisement