యవ్వనత్వాన్ని పెంచే కొత్తరకం 'జిన్'
సౌందర్య ప్రేమికుల కోసం ఓ కొత్త ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది. వృద్ధాప్యాన్ని తగ్గించి యవ్వనంగా కనిపించేందుకు కొల్లాజిన్ కలిసిన మద్యపానీయాన్నిప్రపంచంలోనే మొట్ట మొదటిసారి బ్రిటన్ కు చెందిన ఓ సంస్థ కనిపెట్టింది. యాంటే ఏ జిన్ పేరిట మార్కెట్లోకి విడుదల చేసింది. సౌందర్య ప్రేమికులు, యవ్వన ప్రియులు వృద్ధాప్యాన్ని అధిగమించేందుకు ఈ నూతన మద్యం ఎంతగానో ఉపయోగపడుతుందని తయారీదారులు చెప్తున్నారు.
బ్రిటన్ కు చెందిన బోంపాస్ అండ్ పార్ కంపెనీ 'యాంటే ఏ జిన్' నూతన మద్యాన్ని ఆవిష్కరించింది. చిన్న వయసులోనే వయసు మీదపడినట్లు కనిపించేవారు, వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించాలనుకునే వారికి ఈ కొత్తరకం మద్యం వరమేనని సృష్టికర్తలు చెప్తున్నారు. కొత్తగా కనుగొన్న ఈ సౌందర్యసాధనం ఒక బాటిల్ ఖరీదు సుమారు 35 పౌండ్ల వరకూ ఉంటుందని చెప్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉండే సాధారణ కొల్లాజిన్ గుళికలకు బదులుగా ఈ కొత్తరకం మద్యం తీసుకొని సౌందర్యాన్ని పెంచుకోవచ్చని, యవ్వనాన్ని నిలుపుకోవచ్చని వెల్లడించారు. ఈ జిన్నును తాగడం వల్ల చర్మం ముడతలు పడుకుండా కాపాడుతుందని, యవ్వన వయస్కులుగా కనిపిస్తారని ఉత్పత్తిదారులు భరోసా ఇస్తున్నారు.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి బ్రిటన్ కు చెందిన బోంపాస్ అండ్ పార్ సంస్థ 'యాంటీ ఏ జిన్' పానీయాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఆహార పానీయంలో ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతోపాటు, 40శాతం ఛమోమైల్, టీ సువాసనలతో కలసిన స్పిరిట్ ఉంటుందని తెలిపారు. అంతేకాక ఇతర రంగులతోపాటు దురదగొండి, కొత్తిమీర, జునిపెర్ వంటి సుగంధ మొక్కల వేళ్ళను కూడ ఈ పానీయం తయారీలో వినియోగించారు. ఈ సరికొత్త ఉత్పత్తి శరీరంపై మచ్చలను నిరోధించి, చర్మాన్ని మృదువుగా ఉండేందుకు సహాయపడటంతోపాటు.. పునరుత్తేజాన్ని కలిగిస్తుందని ఉత్పత్తిదారులు వార్నర్ లీజర్ హోటల్స్ తమ వెబ్ సైట్ లో వివరించారు. శరీరంలో కొల్లాజిన్ సహజంగానే ఉత్పత్తి అయినప్పటికీ తమ ఉత్పత్తి.. వయసును తగ్గించి యవ్వనాన్ని కలిగిస్తుందని సూచించారు. కొల్లాజిన్ ఉత్పత్తులను తీసుకోవడం లేదా అటువంటి బ్యూటీ ఉత్పత్తులను వాడటంవల్ల చర్మం ముడుతలు రాకుండా చేసి, అకాల వృద్ధాప్య సమస్యలను నివారించవచ్చని యాంటీ ఏ జిన్ ఉత్పత్తిదారులు చెప్తున్నారు.