న్యూ ఢిల్లీః ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ చర్యలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పార్టీ చర్యలు ఉంటున్నాయని, ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్త పరుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీకి మంచి అవకాశం ఉందని, ప్రజల్లో సానుకూల స్పందన ఉందని అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వంగా ఉందంటూ అరుణ్ జైట్లీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. గత ఎన్నికట్లో ఢిల్లీలో బిజేపీ అతి తక్కువ శాతం ఓట్లతో అధికారాన్ని కోల్పోయి ఉండొచ్చుకానీ, ప్రస్తుతం తిరిగి ఆ మెజారిటీని సంపాదించుకున్నామని ఢిల్లీ బిజేపీ కార్యవర్గ సమావేశంలో జైట్లీ చెప్పారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చలేదని, ఒక్క పని కూడ పూర్తి చేయలేదని అన్న ఆర్థిక మంత్రి... ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించని కేజ్రీవాల్ తీరును ప్రజలు గుర్తించారని, కాంగ్రెస్ లెక్కల్లోనే లేకపోగా, బిజెపి తిరిగి రాజకీయ స్థానాన్ని సంపాదించేందుకు ఇదే మంచి అవకాశం అని తెలిపారు. ప్రజల దగ్గరకు వెళ్ళేందుకు ఇదే సరైన సమయమని, వారు చాలా నిరాశలో ఉన్నారని మంత్రి చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించి, ఢిల్లీ ప్రభుత్వ చర్యలను కూడ ఎత్తి చూపాలని ఆయన కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిరాశకు దారి తీసిందని, దేశంలో అన్ని మూలలా రాజకీయ ఉనికిని పెంచేందుకు పోరాడాలని సూచించారు.
దేశ వ్యతిరేక నినాదాలను అన్ని విధాలా మౌఖికంగా ఖండించాల్సిన అవసరం ఉందని, జాతి వ్యతిరేక అంశాలను సమ్మతిస్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వంపై అసమ్మతి తెలపాల్సిన అవసరం ఉందని జైట్లీ అన్నారు. తాముకూడ ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నామని, అయితే పార్లమెంట్ లో ప్రస్తుత పరిస్థితులు అపూర్వంగా కనిపిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు జైట్లీ ఆరోపించారు.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ప్రభుత్వం!
Published Sat, Mar 26 2016 2:36 PM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM
Advertisement