ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టారు. గాజాలో బందీలుగా ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని, దేశంలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్‌లోని కప్లాన్ స్ట్రీట్‌లో ప్రముఖ రచయిత డేవిడ్ గ్రాస్‌మాన్ ఈ ఆందోళనల్లో పాల్గొని, దేశం కోసం ప్రజలంతా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే షిన్ బెట్ మాజీ అధిపతి యువల్ డిస్కిన్ తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశిస్తూ ‘దేశ చరిత్రలో అత్యంత చెత్త , విజయవంతం కాని ప్రధాన మంత్రి’ అని పేర్కొన్నారు. వెంటనే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. డిస్కిన్ 2005 నుండి 2011 వరకు షిన్ బెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అధ్యక్షునిగా పనిచేశారు. అధికార లికుడ్ పార్టీ ప్రధాన కార్యాలయం బీట్ జబోటిన్స్కీ వెలుపల ప్రజలు నిరసనలు చేపట్టారు. నిరసనకారులు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనే నినాదాలు కలిగిన బ్యానర్లు పట్టుకున్నారు. మరికొందరు గాజాలో యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ర్యాలీ అనంతరం పలువురు ఆందోళనకారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. వాహనాల టైర్లను తగులబెట్టారు. ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపిన వివరాల ప్రకారం మౌంటెడ్ పోలీసు సిబ్బంది ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సమయంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నివాసం వెలుపల వేలాది మంది ప్రజలు నిరసన తెలిపారు. హమాస్ చేతిలో బందీలైనవారి కుటుంబ సభ్యులు కింగ్ జార్జ్ స్ట్రీట్‌లో నిరసన కవాతు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment