ఈ భూమండలంపై అత్యంత ఖరీదైన పదార్థమేమిటనే ప్రశ్న ఎవరినైనా అడిగితే ప్లాటినం, వజ్రం లేదా బంగారం అని చెబుతుంటారు. అయితే వీటికి మించిన ఖరీదైన పదార్థం ఒకటుందనే సంగతి మీకు తెలుసా? దాని విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆ పదార్ధం ఒక గ్రాము ధర 7,553 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. (ఒక బిలియన్ అంటే వంద కోట్లు)
ఆ ఖరీదైన పదార్ధం పేరు యాంటీమాటర్. దీని గురించి ఎవరూ అంతగా వినివుండకపోవచ్చు. అయితే సైన్స్ ప్రపంచంలో ఇది ఒక రహస్యమైన, శక్తిమంతమైన పదార్ధం. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం యాంటీమాటర్ అనేది పదార్థంతో సమానంగానే ఉంటుంది. కానీ ఇది సాధారణ పదార్ధానికి పూర్తిగా వ్యతిరేకం. యాంటీమాటర్‌లోని ఉప పరమాణు కణాలు సాధారణ పదార్థానికి వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి. దీనిని 20 వ శతాబ్దపు ప్రథమార్థంలో కనుగొన్నారు. యాంటీమాటర్‌ను మొట్టమొదట ప్రపంచానికి 1928 లో శాస్త్రవేత్త పాల్ డిరాక్ పరిచయం చేశారు. న్యూ సైంటిస్ట్ పత్రిక ఈ మహనీయుడిని ‘సర్ ఐజాక్ న్యూటన్ తరువాత గొప్ప బ్రిటిష్ సిద్ధాంతకర్త’ అని అభివర్ణించింది. నాటి నుంచి యాంటీమాటర్ శాస్త్రవేత్తలకు సైతం ఉత్సుకత కలిగించే అంశంగా మారింది.
యాంటీమాటర్ అత్యధిక శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక గ్రాము యాంటీమాటర్ 43 మెగాటన్నుల ట్రినిట్రోటోల్యూన్ (టీఎన్‌టీ) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే జపాన్.. హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే మూడు వేల రెట్లు అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. యాంటీమాటర్ అంతరిక్ష ప్రయాణానికి సమర్థవంతమైన ఇంధనంగా లేదా మన గ్రహానికి అత్యధిక శక్తి వనరుగా కూడా ఉపయోగపడుతుంది.
విశ్వం యొక్క మూలం, పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి యాంటీమాటర్ సహాయపడుతుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం అనేది అధిక సాంద్రత, ఉష్ణోగ్రత స్థితి నుండి ఉద్భవించింది. ఇక్కడ పదార్థం, యాంటీమాటర్ సమానంగా, సమృద్ధిగా ఉన్నాయి. అయితే ప్రారంభ విశ్వంలో పదార్థం, యాంటీమాటర్ మధ్య కొంత అసమానత లేదా అసమతుల్యత ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది యాంటీమాటర్ కంటే పదార్థం అధికంగా ఉండటానికి దారితీసింది. ఇది భౌతిక శాస్త్రంలో అతిపెద్ద పజిల్‌గా నిలిచింది.
యాంటీమాటర్‌ను శాస్త్రీయ పరిశోధనలు, వైద్య అనువర్తనాలకు సాధనంగా ఉపయోగించవచ్చు. ఇది సాంప్రదాయిక పద్ధతులకు మించి మరింత ఖచ్చితంగా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకునే రేడియేషన్ థెరపీకి ఉపయుక్తమవుతుంది. యాంటీహైడ్రోజన్ (యాంటీమాటర్‌తో తయారు చేసిన సరళమైన పరమాణువు) సమానత్వ సూత్రం, ఛార్జ్-పారిటీ-టైమ్ (సీపీటీ) సమరూపత వంటి భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను పరీక్షించడానికి యాంటీమాటర్ ఉపయోగపడుతుంది.
శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం యాంటీమాటర్‌ను సృష్టించడం, నిల్వ చేయడం అంత సులభం కాదు. దీనికి పార్టికల్ యాక్సిలరేటర్లు, వాక్యూమ్ ఛాంబర్‌లు వంటి అధునాతన సౌకర్యాలు, సాంకేతికతలు అవసరమవుతాయి. ప్రస్తుతం మనం స్వల్ప పరిమాణంలోని యాంటీమాటర్‌ను మాత్రమే ఉత్పత్తి చేయగలం. దీనికి కూడా అధికంగా ఖర్చు అవుతుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం యాంటీమాటర్ అనేది భూమిపై అత్యంత ఖరీదైన పదార్థం. శాస్త్రవేత్తలు భూమిపైనే లార్జ్ హాడ్రాన్ కొలైడర్ లాంటి అధిక శక్తి కణాల యాక్సిలరేటర్ల ద్వారా యాంటీ పార్టికల్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశోధనలు విజయవంతం కావాలని కోరుకుందాం.
ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల!
Comments
Please login to add a commentAdd a comment