సాయిరెడ్డిగూడలోని ప్రవీణ్‌కుమార్ వ్యవసాయ క్షేత్రంలో తనిఖీలు చేస్తున్న అటవీ అధికారులు
సాక్షి, హైదరాబాద్/కందుకూరు: క్యాసినోవాలాగా పేరుగాంచిన చీకోటి ప్రవీణ్‌కుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బుధ, గురువారాల్లో చీకోటితోపాటు మాధవరెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో హవాలా లావాదేవీలకు సంబంధించి మరో నలుగురు పేర్లు బయటపడినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
అందులోభాగంగా అధికారులు జూబ్లీహిల్స్‌లోని బబ్లూ, బేగంబజార్‌లోని సంపత్, సికింద్రాబాద్‌లోని రాకేష్, వెంకటేశ్ నివాసాల్లోనూ ఏకకాలంలో సోదాలు చేసినట్టు తెలిసింది. చెన్నై, హైదరాబాద్ నుంచి విదేశాలకు తరలించాల్సిన హవాలా డబ్బును ఈ నలుగురే ఆపరేట్ చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. అయితే వీరిలో సంపత్‌కు రాజకీయ ప్రముఖులతో సంబంధాలున్నాయని, ఎన్నికల సమయంలో పలువురికి ఇచ్చిన డబ్బును డైరీలో రాసుకున్నట్టు ఈడీ వర్గాల ద్వారా తెలిసింది.
చీకోటి కీలకంగా ఉంటూ హవాలా డబ్బు మొత్తం సంపత్ ఆపరేట్ చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నలుగురి ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు వీరికీ నోటీసులిచ్చి విచారించాలని భావిస్తున్నారు. సోమవారం ఈడీ ఎదుట చీకోటితోపాటు మాధవరెడ్డి హాజరుకానున్నారు. వీరి విచారణ తర్వాత ఈ నలుగురికి నోటీసులిచ్చి విచారించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
అదేవిధంగా జూన్‌లో చీకోటి ప్రవీణ్ జన్మదిన వేడుకలకు రూ.5 కోట్లకు పైగా ఖర్చుపెట్టినట్టు ఈడీ పలు ఆధారాలు సేకరించింది. అందులో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల పాత్రపైనా ఆరా తీసేందుకు ఈడీ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మంత్రితో చీకోటికి ఉన్న సాన్నిహిత్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం.
విదేశీ ఊసరవెల్లులు, కొండ చిలువలు
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో చీకోటి ప్రవీణ్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం అటవీశాఖ అధికారులు దాడులు చేశారు. అటవీశాఖ రేంజ్ అధికారి రమేశ్‌కుమార్, డీఆర్‌ఓలు విజయ శ్రీనివాస్‌రావు, హేమ తదితరులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సాయిరెడ్డిగూడ పరిధిలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూమిని 2016–17లో ప్రవీణ్ కొనుగోలు చేశాడు. అందులో ఉన్న పౌల్ట్రీతోపాటు మిగతా ప్రాంతంలో షెడ్లు నిర్మించాడు.
విదేశాల నుంచి తెప్పించిన కొండ చిలువలు, ఊసరవెల్లులు, ఆఫ్రికన్ పాములు, మకావ్ చిలుకలు, హంసలు, బాతులు, ఉడుము, బల్లి జాతికి చెందిన రకాలు, జింక రకం మేకలు, టర్కీ కోళ్లు, ఆస్ట్రిచ్ పక్షులు, మేలు జాతి గుర్రాలు, సాలీళ్లు, రకరకాల కుక్కలు, పక్షుల వంటి వాటితోపాటు ఆవులు, గేదెలను పెంచుతున్నాడు. అలాగే, పురాతన కాలం నాటి రథం కూడా ఉంది. ఎఫ్‌ఆర్‌ఓ రమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. నిబంధనల మేరకు అన్నీ సక్రమంగా ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఇంకా పూర్తిస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment