ఎల్.రమణను యశోద ఆసుపత్రికి తరలిస్తున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు తీసుకెళ్లి కేసినోలు ఆడించిన చీకోటి ప్రవీణ్‌కుమార్ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూపీ లాగు తోంది. ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు తదితర అంశాలు ఇందులో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ కేసినోలో పాలుపంచుకున్న వారందరికీ నోటీసులు జారీ చేసి క్షుణ్ణంగా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
ఇదివరకే నోటీసులు అందుకున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. తన బ్యాంకు లావాదేవీల పత్రాలతో వచ్చిన రమణ తాను కేసినోలో పాలు పంచుకోలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. నేపాల్‌లోని డాడీ గ్యాంగ్ కేసినోకు సంబంధించి తనకు ఆహ్వానం అందిన విషయం వాస్తవమే అయినా.. తాను వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేదని చెప్పినట్లు తెలిసింది.
ఈడీ అధికారులు మాత్రం నేపాల్‌కు వెళ్లడానికి తీసుకున్న విమాన టికెట్ల ఆధారంగా ఆయనను ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఉదయం పది గంటల సమయంలోనే రమణ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. బ్యాంకు లావాదేవీల పత్రాలను అధికారులకు అందించినట్లు సమాచారం. మూడంతస్తులు మెట్లు ఎక్కి వెళ్లిన ఆయన.. ఈడీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో ఘగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. దీనితో అధికారులు ఆయనను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు.
మంత్రి తలసాని పీఏకు కూడా ..
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పీఏ హరీశ్‌ను విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల వ్యవహారం ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేసినో వ్యవహారంలో మొత్తం 18 మంది రాజకీయ నేతలకు సంబంధం ఉందని అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీరందరికీ నోటీసులు జారీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
చీకోటి ప్రవీణ్‌కుమార్ తన సన్నిహితుడు మాధవరెడ్డితో జరిపిన సంభాషణలో బయటపడిన వివరాలు, నేపాల్, ఇండోనేషియా, శ్రీలంక, గోవాకు కేసినో ఆడటానికి విమానాల్లో వెళ్లిన టికెట్ల ఆధారంగా వీరిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌కుమార్, మాధవరెడ్డిలతోపాటు తలసాని సోదరులు మహేశ్, ధర్మేందర్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఊర్వశీ బార్ యజమాని యుగంధరను ప్రశ్నించిన విషయం విదితమే. మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవందర్‌రెడ్డిని కూడా విచారించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment