మీడియాతో మాట్లాడుతున్న చీకోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్/ సైదాబాద్: చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో కేంద్రాలుగా సాగించిన హవాలా లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరే ట్ (ఈడీ) దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వందల కోట్ల సొమ్ము చెన్నై, హైదరాబాద్ కేంద్రాల నుంచి విదే శాలకు డాలర్ల రూపంలో తరలిపోయినట్లు ఈడీ అనుమానిస్తోంది. చీకోటితోపాటు ఆయన భాగ స్వామి మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు గురువారం ఇద్దరికీ నోటీసులు జారీచేశారు.
సోమవారం ఈడీ కార్యా లయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. నేపా ల్, శ్రీలంక, ఇండోనేసియా తదితర దేశాల్లో క్యాసి నోలకు ఉపయోగించిన రూ.కోట్లాది సొమ్ము కేవ లం జూదరుల కోసమేనా లేక హవాలా మార్గం ద్వారా దేశం దాటించారా అన్న దానిపై ఈడీ అధి కారులు తీగలాగుతున్నట్టు తెలిసింది. రూ.వందల కోట్ల మేర జరిగిన లావాదేవీలు కేవలం క్యాసినో కోసం కాదని, బంగారం హవాలా కోసం కూడా దారి మళ్లించి ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక దేశానికి హవాలా జరిగిన సొమ్ము అక్కడి నుంచి మరెన్ని దేశాలకు దాటించి ఉంటారన్న దానిపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ సెలబ్రిటీలు
ప్రవీణ్‌తో లావాదేవీలు సాగించిన వ్యవహారంలో ఈడీ పలు సంచలనాత్మక సందేశాలను మొబైల్ ఫోన్‌లో గుర్తించినట్టు తెలిసింది. ప్రధానంగా ఇద్దరు మంత్రులకు సంబంధించి వాట్సాప్, సిగ్నల్ మెసెంజర్ల ద్వారా సాగిన సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నట్టు ఈడీ వర్గాలు చెప్పాయి. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాట్సాప్ సందేశాల్లో క్యాసినో కేంద్రాల వివరాలు, విమాన టికెట్లు, క్యాసినో ఆడేందుకు డబ్బు ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి అప్పజెప్పాలి అన్న కీలక విషయాలను ఈడీ గుర్తించినట్టు తెలిసింది.
ఓ జిల్లా డీసీసీబీ చైర్మన్ భూమి పత్రాలు సైతం ప్రవీణ్ ఇంట్లో లభించడం కలకలం రేపింది. ఇకపోతే సినీ ప్రముఖుల నంబర్లకు లొకేషన్ మ్యాప్‌లుండటంపై అధికారులు కూపీలాగే పనిలో ఉన్నట్టు తెలిసింది. ప్రముఖులకు సంబంధించిన ఖాతా నంబర్లు, వాటి ద్వారా జరిగిన లావాదేవీల స్క్రీన్ షాట్లు తదితరాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
ఆ నలుగురు ఎవరు?
హవాలా మార్గంలో సొమ్ము తరలించేందుకు చీకోటితో మరో నలుగురు భాగస్వాములుగా ఉన్నట్టు ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు, బెంగళూరుకు చెందిన ఒకరు, చెన్నైకి చెందిన మరొకరు హవాలా ఏజెంట్లుగా వ్యవహరించిన వివరాలను ప్రవీణ్ మొబైల్‌తోపాటు ల్యాప్‌టాప్‌లో గుర్తించినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. సోదాల్లో లభించిన డాక్యుమెంట్లతోపాటు హార్డ్‌డిస్క్ నుంచి రిట్రీవ్ చేయాల్సిన అంశాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేయాలని భావిస్తున్నారు. నేపాల్, శ్రీలంక, ఇండోనేసియానే కాకుండా సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్ దేశాల్లోనూ ప్రవీణ్ క్యాసినోలు నిర్వహించినట్లు సమాచారం.
స్టిక్కర్‌ను రోడ్డు మీద పడేశానన్న మంత్రి
హవాలా ఆరోపణలెదుర్కొంటున్న మాధవరెడ్డి కారుకు మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంపై మంత్రి స్పందించారు. మార్చి 2022 వరకు చెల్లుబాటున్న స్టిక్కర్‌ను తీసి ఎక్కడో రోడ్డు మీద పడేశానని, అది ఎవరో తీసుకుని పెట్టుకుంటే తనకేం సంబంధమన్నారు. అయితే ఎమ్మెల్యే స్టిక్కర్‌ను ఎక్కడపడితే అక్కడ పడేయటం ఏంటన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
చట్టపరంగానే క్యాసినోలు: చీకోటి
గోవాలో, నేపాల్‌లో చట్టపరంగానే తాను క్యాసినోలు నిర్వహించానని చీకోటి ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఈడీ దాడుల అనంతరం గురువారం తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు ఎందుకు మీ ఇంటిపై దాడులు నిర్వహించారని ప్రశ్నించగా.. ఎందుకో మీకు తెలియదా అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఈడీ నోటీసుల మేరకు సోమవారం విచారణకు హాజరై అధికారుల సందేహాలను నివృత్తి చేస్తానని చెప్పారు.
ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో...
గత జూన్ 10 నుంచి నాలుగు రోజులపాటు నేపాల్‌లో క్యాసినో నిర్వహణలో భాగంగా ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో సినీ సెలబ్రిటీలకు భారీగా పారితోషకాలిచ్చినట్టు ఈడీ గుర్తించింది. అందులోభాగంగా బాలీవుడ్ నటులు మల్లికా షెరావత్‌కు రూ.కోటి, అమీషా పటేల్‌కు రూ.80 లక్షలు, గోవిందకు రూ.50 లక్షలు, డింపుల్ హయతీకి రూ.40 లక్షలు, టాలీవుడ్ నటి ఇషారెబ్బకు రూ.40 లక్షలు, గణేష్ ఆచార్యకు రూ.20 లక్షలు, ముమైత్‌ఖాన్‌కు రూ.15 లక్షలు పారితోషకం కింద ఇచ్చినట్టు ఈడీ ఆధారాలు సేకరించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment