సాహసోపేత నిర్ణయాలు.. టైటాన్స్‌ ఈసారి విజృంభిస్తుందా? | IPL 2025 Gujarat Titans Top Players To Watch Out For Team Strengths | Sakshi
Sakshi News home page

సాహసోపేత నిర్ణయాలు.. టైటాన్స్‌ ఈసారి విజృంభిస్తుందా?

Published Fri, Mar 21 2025 5:13 PM | Last Updated on Fri, Mar 21 2025 5:38 PM

IPL 2025 Gujarat Titans Top Players To Watch Out For Team Strengths

బట్లర్‌- గిల్‌- రషీద్‌ (Photo Courtesy: GT)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే (2022)లో టైటిల్ సాధించి తనదైన ముద్రవేసింది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans). ఆ తర్వాత సీజన్లో మళ్ళీ ఫైనల్లోకి ప్రవేశించింది. కానీ టైటిల్‌ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమితో రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. అయితే, గతేడాది గుజరాత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 

ఆ జట్టుకి స్ఫూర్తిదాయకంగా నిలిచి ముందుండి నడిపించిన భారత్ అల్ రౌండర్, జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు బదిలీ అయ్యాడు.

ఈ మార్పుతో భారత్ యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ (Shubman Gill)కు కెప్టెన్‌గా పగ్గాలు అప్పగించారు. కానీ గత సీజన్ గుజరాత్ కి పెద్దగా కలిసిరాలేదు. కేవలం 5 విజయాలు, 7 ఓటములతో గుజరాత్ 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనితో కొత్త సీజన్‌ కోసం గుజరాత్ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది.

భారత్ సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, దక్షిణాఫ్రికాకి చెందిన డేవిడ్ మిల్లర్ వంటి సీనియర్ ఆటగాళ్ళని పక్కకుపెట్టాలని నిర్ణయించారు. ఇందుకు బదులుగా కొత్త తరహా జట్టుని నిర్మించాలని నిర్ణయించారు. ప్రపంచ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది.

మాజీ ఆరెంజ్ క్యాప్ విజేత జోస్ బట్లర్, దక్షిణాఫ్రికా పేస్ స్పియర్‌హెడ్ కగిసో రబాడను దక్కించుకోవడానికి గుజరాత్ పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో తన వీరోచిత ప్రదర్శనలతో అందరినీ ఆశ్చర్యపరిచిన గ్లెన్ ఫిలిప్స్‌ను కూడా తీసుకున్నారు.

వేలంలో గుజరాత్ ఎలా రాణించింది?
ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. గిల్, రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ మరియు షారుఖ్ ఖాన్‌లతో పాటు రషీద్ ఖాన్‌ను వేలానికి ముందు రెటైన్ చేసింది. వేలంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ని రూ 15.75 కోట్లు కు కనుగోలు చేసారు.

ఇంకా భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ( (రూ12.25 కోట్లు), రబాడ (రూ 10.75 కోట్లు) మరియు ప్రసిధ్ కృష్ణ (రూ 9.5 కోట్లు) ముగ్గురితో పేస్ బౌలింగ్ ని బలోపేతం చేశారు. గత సీజన్‌లో వారికి సమస్యగా ఉన్న రంగాల కోసం భారీగా ఖర్చు చేశారు. ఇక మిల్లర్ స్థానంలో జిటి ఫిలిప్స్ మరియు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌లను జట్టులోకి తీసుకువచ్చారు

గుజరాత్ టైటాన్స్ జట్టులో ప్రధాన ఆటగాళ్లు
శుబ్‌మన్ గిల్
ఒకప్పుడు భారత టీ20ఐ జట్టులో ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇప్పుడు మునుపటి రీతిలో రాణించలేక పోతున్నాడన్నది వాస్తవం. 2023 ఐపీఎల్ లో చెలరేగిపోయిన గిల్ దాదాపు 900 పరుగులు సాధించాడు.

గత సీజన్‌ను ఆశాజనకంగా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత అతని ఫామ్ తగ్గింది . 2024లో తన మొదటి ఆరు మ్యాచ్‌ల్లో 151.78 స్ట్రైక్ రేట్‌తో 255 పరుగులు చేశాడు, కానీ ఆ తర్వాత 147.40 సగటుతో 426 పరుగులు చేశాడు. ఈ సీజన్లో గిల్ మళ్ళీ మునుపటి ఫామ్ ని ప్రదర్శించాలని, జట్టుని విజయ బాటలో నడిపించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు.

జోస్ బట్లర్
జట్టులో అత్యంత ఖరీదైన ఆటగాడు కావడంతో, బట్లర్ పై అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహం లేదు. 2022 ఐపిఎల్ లో ఏకంగా 863 పరుగులు చేసిన తర్వాత, బట్లర్ 2023 మరియు 2024 సీజన్లలో 400 కి మించి పరుగులు చేయలేకపోయాడు. అయితే గత సంవత్సరం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్కతా పై జరిగిన ఫైనల్లో 224 పరుగుల లక్ష్యం సాధించడంలో బట్లర్ చేసిన సెంచరీ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది. 

బట్లర్ ఈ సీజన్ లో గిల్ తో కలిసి గుజరాత్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. లేదా గత సీజన్‌లో లేని ఫైర్‌పవర్‌ను అందించడానికి 3వ స్థానంలోకి వస్తాడని భావిస్తున్నారు. అదనంగా అతన్ని స్టంప్స్ వెనుక కూడా చూడవచ్చు.

రషీద్ ఖాన్
గాయం నుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరోసారి గుజరాత్‌కు ట్రంప్ కార్డ్ గా భావించవచ్చు. గత సీజన్‌లో, రషీద్ శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నందున తన పూర్తి స్థాయిలో ఆడలేక పోయాడు. ఈసారి మాత్రం గుజరాత్ టైటిల్ సాధించాలన్న ఆశయాన్ని సాధించడంలో రషీద్ పెద్ద పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.

కగిసో రబాడ
పంజాబ్ కింగ్స్‌ తరుపున ఆది కాస్త నిరాశబరిచిన కగిసో రబాడ ఇప్పుడు గుజరాత్ జట్టులో చేరడంతో కోచ్ ఆశిష్ నెహ్రా ఆధ్వర్యంలో మళ్ళీ పుంజుకోగలడని భావిస్తున్నారు.

మహ్మద్‌ సిరాజ్
ఇటీవలి కాలంలో పెద్దగా రాణించలేక పోతున్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కి మళ్ళీ మునుపటి వైభవం సాధించడానికి ఐపీఎల్ మంచి అవకాశం కల్పిస్తోంది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు లో స్థానం పొందలేకపోయిన సిరాజ్ తన విమర్శకులను సమాధానము చెప్పాలని, తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నాడు.

గుజరాత్ టైటాన్స్ జట్టు
రషీద్ ఖాన్, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, జోస్ బట్లర్. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిషాంత్ సింధు, మహిపాల్ లోమ్రోర్, కుమార్ కుషాగ్ర, అనుజ్ రావత్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, జెరాల్డ్ కోట్జీ, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా.  

చదవండి: విధ్వంసకర వీరులు.. పంత్‌కు పగ్గాలు.. లక్నో ఫైనల్‌ చేరుతుందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement