Top 5 of the ICC ODI Rankings for batters And Bowlers: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టాప్-3లోకి దూసుకొచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ప్రదర్శనతో మూడో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ టాప్ ర్యాంకును నిలుపుకొన్నాడు.
అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో టాప్-5లో టీమిండియా బ్యాటర్ల సంఖ్య మూడుకు చేరింది. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ టోర్నీలో కోహ్లి అదరగొట్టిన విషయం తెలిసిందే.
ఈ ఐసీసీ ఈవెంట్లో మొత్తంగా 11 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 3 శతకాలు, 6 అర్ధ శతకాల సాయంతో 765 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 791 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. గతంలో 1258 రోజుల పాటు నంబర్ 1లో కొనసాగిన ఈ పరుగుల యంత్రం సుదీర్ఘకాలం తర్వాత మరోసారి టాప్ ర్యాంకుకు చేరువకావడం విశేషం.
భారీ జంప్ కొట్టిన హెడ్
ఇక రోహిత్ శర్మ సైతం.. 11 మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో కలిపి 597 పరుగులు చేశాడు. దీంతో మరిన్ని పాయింట్లు మెరుగుపరచుకుని నాలుగో ర్యాంకు సాధించాడు. మరోవైపు.. వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించిన ట్రవిస్ హెడ్ ఏకంగా 28 పాయింట్లు మెరుగుపరచుకుని 15వ స్థానానికి చేరుకున్నాడు.
సిరాజ్‌ను వెనక్కి నెట్టిన హాజిల్‌వుడ్..
ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ నాలుగు స్థానాలు ఎగబాకాడు. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌ను వెనక్కినెట్టి రెండో ర్యాంకు సాధించాడు.
ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్ ఎనిమిది స్థానాలు మెరుగుపరచుకుని 12, ప్యాట్ కమిన్స్ ఏడు స్థానాలు మెరుగుపరచుకుని 27వ ర్యాంకుకు చేరుకున్నారు. ఇక మరో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు.
ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ టాప్-5 బ్యాటర్లు
1. శుబ్‌మన్ గిల్(ఇండియా)- 826 పాయింట్లు
2. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 824 పాయింట్లు
3. విరాట్ కోహ్లి(ఇండియా)- 791 పాయింట్లు
4. రోహిత్ శర్మ(ఇండియా)- 769 పాయింట్లు
5. క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా)- 760 పాయింట్లు
టాప్-5 బౌలర్లు
1. కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా)- 741 పాయింట్లు
2. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 703 పాయింట్లు
3. మహ్మద్ సిరాజ్(ఇండియా)- 699 పాయింట్లు
4. జస్‌ప్రీత్ బుమ్రా(ఇండియా)- 685 పాయింట్లు
5. ఆడం జంపా(ఆస్ట్రేలియా)- 675 పాయింట్లు.
చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం?
Comments
Please login to add a commentAdd a comment