ICC Cricket World Cup 2023 - India vs Sri Lanka: ఆసియా కప్-2023 ఫైనల్.. కొలంబోలో.. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ సృష్టించిన వికెట్ల విధ్వంసం గుర్తుండే ఉంటుంది. తన బౌలింగ్ మ్యాజిక్‌తో శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ హైదరాబాదీ స్టార్.. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి వారెవ్వా అనిపించాడు.
అంతటితో మనోడి వికెట్ల దాహం తీరలేదు.. ఆ మరుసటి రెండో ఓవర్లో మరో వికెట్ పడగొట్టాడు. తద్వారా 16 బంతుల్లోనే ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అక్కడితో ఆగక.. తన పదునైన ఫాస్ట్ ఇన్‌స్వింగర్‌తో మరో వికెట్ కూడా కూల్చాడు.
నాడు బుమ్రా లంక వికెట్ల పతనాన్ని ఆరంభిస్తే.. మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టి శ్రీలంకను కోలుకోకుండా చేశాడు సిరాజ్. తద్వారా టీమిండియాకు సంచలన విజయం అందించి.. ఆసియా వన్డే కప్ విజేతగా నిలిపాడు.
ఇప్పుడు.. వన్డే వరల్డ్‌కప్-2023.. ఈసారి వేదిక ముంబై.. ప్రఖ్యాత వాంఖడే స్టేడియం.. 2011 ఫైనల్లో టీమిండియా చేతిలో ఎదురైన పరాభవం, 2023 ఆసియా కప్‌లో ఘోర అవమానానికి బదులు తీర్చుకోవాలని ఆరాటంతో శ్రీలంక.. అయ్యే పనేనా?!
అసలే సొంతగడ్డపై ప్రపంచకప్ టోర్నీ.. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన.. అయినా లంకను తక్కువగా అంచనా వేయలేం...
ఇదే టోర్నీలో ఢిల్లీలో సౌతాఫ్రికా విధించిన 429 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అద్బుత పోరాట పటిమ కనబరిచింది.. అయితే, కుశాల్ మెండిస్(76), చరిత్ అసలంక(79), దసున్ షనక(68) మిగతా వాళ్లు రాణించకపోవడంతో 102 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు..
ఇక టీమిండియాతో మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంకకు పేసర్ మధుషాంక అద్భుత ఆరంభం అందించాడు. భారత ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మను 4 పరుగుల వద్దే పెవిలియన్‌కు పంపాడు.
అయితే, లంక ఆనందం ఎంతో సేపు నిలవలేదు. టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(92), విరాట్ కోహ్లి(88) శ్రీలంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఇక, శ్రేయస్ అయ్యర్(56 బంతుల్లో 82) వచ్చిన తర్వాత స్కోరు బోర్డు మరింత వేగంగా పరుగులు తీసింది.
ఇలా గిల్, కోహ్లి, అయ్యర్‌ల విజృంభణతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మొదటి బంతికే షాకిచ్చాడు.
లంక ఓపెనర్ పాతుమ్ నిసాంకను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో రెండో ఓవర్ మొదటి బంతి నుంచి సిరాజ్ తన ఆట మొదలుపెట్టాడు. లంక ఓపెనర్ కరుణరత్నెను ఎల్బీడబ్ల్యూ చేశాడు.
అదే ఓవర్ ఐదో బంతికి సమరవిక్రమను అవుట్ చేశాడు. దీంతో 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి లంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయినా.. సిరాజ్ ఏమాత్రం కనికరం చూపలేదు.
నాలుగో ఓవర్ తొలి బంతికి మెండిస్‌ను బౌల్డ్ చేశాడు. ఇలా ఐదు ఓవర్లలోపే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత పదో ఓవర్ మూడో బంతికి మరో పేసర్ మహ్మద్ షమీ.. చరిత్ అసలంకను, నాలుగో బంతికి హేమంతను.. 12 వ ఓవర్ మూడో బంతికి దుష్మంత చమీరను పెవిలియన్‌కు పంపాడు.
ఇక.. 14వ ఓవర్ తొలి బంతికి ఏంజెలో మాథ్యూస్‌ను షమీ బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పవచ్చు. దీంతో 14 ఓవర్లలో కేవలం 36 పరుగులు చేసిన శ్రీలంక ఏకంగా 8 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో 18వ ఓవర్లో లంక టెయిలెండర్ కసున్ రజిత రూపంలో ఐదో వికెట్ దక్కించుకున్న షమీ.. టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
ఇక 19.4వ ఓవర్లో రవీంద్ర జడేజా మధుషాంక(5)ను అవుట్ చేసి విజయ లాంఛనం పూర్తి చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో 50 పరుగులకు అవుటైన లంక ఈరోజు 55 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 302 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇప్పటి వరకు ఆడిన ఏడింట ఏడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment