ICC WC 2023- India Qualifies For Semis- Rohit Sharma Comments: వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ముంబై వేదికగా లీగ్ దశలో శ్రీలంకను 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. తద్వారా ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది.
ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఏడూ గెలిచి అజేయంగా నిలిచి ఈ ఘనత సాధించింది. సొంతగడ్డపై జైత్రయాత్ర కొనసాగిస్తూ అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో లంకపై భారీ విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు.
జట్టు సమిష్టి కృషితోనే సాధ్యమైంది
మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘మేము ఇప్పుడు అధికారికంగా సెమీఫైనల్లో అడుగుపెట్టాం. చెన్నై నుంచి మొదలుపెడితే ఇప్పటి దాకా.. మా జట్టు సమిష్టి కృషితో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ముందుకు సాగుతోంది.
మా లక్ష్యం అదే
సెమీస్‌లో మేమే తొలుత అడుగుపెట్టాలన్న లక్ష్యం నెరవేరింది. ఫైనల్ విషయంలోనూ మా టార్గెట్ అదే. ఈ ఏడు మ్యాచ్‌లలో మా ప్రదర్శన అత్యద్భుతం. జట్టులోని ప్రతి ఆటగాడు తమ వంతు పాత్ర పోషించాడు. అంతా కలిసికట్టుగా ఇక్కడిదాకా చేరుకున్నాం. వాంఖడేలో ఇలాంటి పిచ్‌పై 350 పరుగులంటే మామూలు విషయం కాదు.
అయ్యర్ అద్భుతం
మా బ్యాటర్లు అద్భుతం చేశారు. మా బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? అయితే, ఈ రోజు శ్రేయస్ అయ్యర్ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. తన నుంచి మేము ఎలాంటి ఇన్నింగ్స్ కోరుకున్నామో అదే చేసి చూపించాడు.
ఈరోజు తను కొత్తగా కనిపించాడు. కొత్త బంతిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇక మా సీమర్లు మొన్న ఇంగ్లండ్‌పై ఇప్పుడు శ్రీలంకపై.. ఎదురులేని విజయం సాధించారు’’ అంటూ బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి కృషితోనే ఈ గెలుపు సాధ్యమైందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
సిరాజ్ సూపర్.. చెలరేగిన షమీ
కాగా వాంఖడేలో గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. శుబ్‌మన్ గిల్(92), విరాట్ కోహ్లి (88), శ్రేయస్ అయ్యర్ (56 బంతుల్లోనే 82 రన్స్) అద్భుతం గా రాణించారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో రోహిత్ సేన 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన శ్రీలంకను భారత పేసర్లు చిత్తు చిత్తు చేశారు.
జస్‌ప్రీత్ బుమ్రా తొలి వికెట్ అందించగా.. సిరాజ్ మూడు, మహ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు. ఈ క్రమంలో భారత బౌలర్ల దెబ్బకు 19.4 ఓవర్లలో కేవలం 55 పరుగులు చేసి ఆలౌట్ అయిన శ్రీలంక ఘోర పరాభవం మూటగట్టుకుంది. షమీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. వరల్డ్‌కప్‌లోనే తొలి బౌలర్‌గా
Comments
Please login to add a commentAdd a comment