హేమమాలిని, మహేశ్ పట్నాయక్, నరేంద్రసింగ్
శ్రీకృష్ణుడి జన్మస్థలంగా హిందువులు భావించే, ‘టెంపుల్ టౌన్’గా పేరొందిన ఉత్తరప్రదేశ్‌లోని మథుర పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మథురలో ఈసారి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ హేమమాలిని పోటీ చేస్తుంటే, ఆర్‌ఎల్‌డీ నుంచి కున్వర్ నరేంద్రసింగ్, కాంగ్రెస్ నుంచి మహేష్ పట్నాయక్ బరిలోకి దిగారు. జాట్ ఓటర్లకు బాగా పట్టున్న ఈ స్థానంలో రెండోసారి ఎంపీ సీటు దక్కించుకోవడానికి సినీ నటి హేమమాలిని గత ఎన్నికల్లో ‘జాట్ బహూ’గా ఈ నియోజకవర్గం ప్రజల మనసు గెలుచుకున్నారు.
ఈసారి సైతం గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో 2014 మోదీ వేవ్‌లో బీజేపీ నుంచి మథుర లోక్‌సభకు పోటీ చేసి, అప్పటి ఆర్‌ఎల్‌డీ సిట్టింగ్ అభ్యర్థి జయంత్ చౌధరిని ఓడించి హేమమాలిని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇక్కడి గెలుపు ఓటములను ప్రభావితం చేయగల జాట్ సామాజిక వర్గం సెంటిమెంట్‌ని గత ఎన్నికల్లో హేమమాలిని వాడుకున్నారు. ‘జాట్ బహూ’ (జాట్ సామాజికవర్గం కోడలు)గా మీ ముందుకొస్తున్నాను. ఆదరించండం’టూ జోరుగా ప్రచారం చేసి విజయాన్ని సాధించగలిగినా ఇప్పుడా సెంటిమెంటు ఓట్లు రాలుస్తుందా లేదా అన్నది
అన్ని వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గెలుపు అంత ఈజీ కాదు..
2014 లోక్‌సభ ఎన్నికల్లో యావత్ దేశాన్నీ బీజేపీ స్వీప్ చేసిన సందర్భంలో హేమమాలిని గెలుపు సులువైంది. కానీ ఈసారి ఈ స్థానంలో విజయాన్ని చేజిక్కించుకోవడం నల్లేరు మీద నడక మాత్రం కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో బీజేపీపై జాట్ సామాజిక వర్గంలో నెలకొన్న వ్యతిరేక ప్రవాహానికి ఎదురీదడం అంత తేలికేం కాదన్నది స్థానిక పరిశీలకుల అభిప్రాయం. అందుకే హేమమాలిని ఓటర్లను ఆకట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. మథురలో జాట్ ఓటర్లు 4.5 లక్షల మంది ఉన్నారు.
ఈ లోక్‌సభ స్థానంలో గెలుపును ప్రభావితం చేయగలిగిన ఈ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకే అన్ని పార్టీలూ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 20 శాతం మందిగా ఉన్న జాట్ సామాజిక వర్గం ఇక్కడి గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో ఉంది. మథుర పార్లమెంటు పరిధిలో 70 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారే. ఠాకూర్లు, బ్రాహ్మణులు, షెడ్యూల్డ్ కులాలు ప్రధాన సామాజిక వర్గాలు. కొంత వరకు ముస్లింలు, వైశ్యులు కూడా ఉన్నారు. ప్రముఖ జాట్ నాయకుడు చౌధరీ చరణ్‌సింగ్ ఈ ప్రాంతం వారే కావడం విశేషం. చౌధరి చరణ్‌సింగ్ భార్య గాయత్రీదేవి 1984 ఎన్నికల్లో మథురలో ఓడిపోయారు. ఆయన కుమార్తె గ్యానవతి 2004లో ఓటమి పాలయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి మన్వీర్‌సింగ్ ఈ స్థానాన్ని దక్కించుకున్నారు.
అయితే 2009 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం చరణ్‌సింగ్ మనవడు జయంత్ చౌధరి మథుర నుంచి పార్లమెంటుకి సారథ్యం వహించారు. 2014 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ జయంత్ చౌధరీని ఓడించి హేమమాలిని గెలిచారు. ఆమె గెలుపునకు అనేక కారణాలున్నాయనీ, ‘జాట్ బహూ’ సెంటిమెంట్‌తో హేమమాలిని ఎమోషన్ అందుకు బాగా ఉపయోగపడిందనీ జాట్ సామాజిక వర్గానికే చెందిన స్థానికుడు ముఖేష్ చౌధరి అన్నారు. దీనికి తోడు మోదీ ఛరిష్మాకంటే «భర్త ధర్మేంద్రతో బంధం కూడా గత ఎన్నికల్లో పని చేసిందనీ, అయితే ఈసారి అది పనిచేస్తుందో లేదో దేవుడికే తెలియాలని గోవర్ధన్‌లో నివసించే జాట్ సామాజిక వర్గానికి చెందిన ప్రతిమా సింగ్ అభిప్రాయపడ్డారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో భాగంగా 2014లో మథురలోని రావాల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటికీ ఆ గ్రామానికి హేమమాలిని ఒరగబెట్టిందేమీ లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికీ ఆ గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉంటాయనీ, హేమమాలిని ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పని చేయడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment