పింప్రి, న్యూస్‌లైన్: సాంగ్లీ జిల్లాలో మొత్తం ఎనిమిది నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో ఈసారి అన్ని పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడంతో ఎవరి సత్తా ఎంటో తెలిసే అవకాశం ఉంది. జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్-ఎన్సీపీ-బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.
ఖానాపూర్...: ఇక్కడి నుంచి కాంగ్రెస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సదాశివరావు పాటిల్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, ఎన్సీపీ అభ్యర్థిగా అమర్ సిన్హా దేశ్‌ముఖ్, బీజేపీ నుంచి గోపీచంద్ పడల్‌కర్ బరిలోకి దిగగా ఎన్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనిల్ బాబర్‌ను శివసేన ఎన్నికల్లో పోటీకి నిలిపి పోటీని రసవత్తరంగా మార్చింది. ఈసారి సదాశివ్‌రావు గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తాస్‌గావ్ (కవఠే మహాంకాళ్)...: ఇది ఎన్సీపీ స్టార్, ప్రచాకర్త, ఆర్‌ఆర్ పాటిల్ నియోజక వర్గం. ఇక్కడ ఆర్‌ఆర్ పాటిల్‌కు కార్యకర్తల అండ, నియోజక వర్గంలో బలమైన సామాజిక వర్గం అనుకూలాంశాలుగా ఉన్నాయి. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో కొంత కాలంగా ఇంటింటి ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థి సంజయ్ కాకా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. బీజేపీ కూడా ఆర్‌ఆర్ పాటిల్ ప్రతిష్టను తగ్గించేందుకు ఎన్సీపీకి చెందిన అజిత్ ఘోర్పడేకు టికెట్ ఇచ్చి బరిలోకి దింపగా, కాంగ్రెస్ పార్టీ సురేష్ శేండగేను నిలిపి పోటీని కొత్తపుంతలు తొక్కించింది. ఈసారి ఆర్‌ఆర్ పాటిల్ గెలుపు నల్లేరుపై నడక కాకపోవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు.
పలుస్-కడేగావ్..: ముఖ్యమంత్రి కావాలని ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పతంగ్ రావు కదమ్ నియోజక వర్గం ఇది. పతంగ్‌రావును ప్రతిసారి ఎన్నికల్లో ఎదుర్కొంటు వస్తున్న పృథ్వీరాజ్ దేశ్‌ముఖ్ ఈసారి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్సీపీ నుంచి శ్రామిక్ ముక్తి దళ్‌కు చెందిన మోహన్ యాదవ్ పోటీ చేస్తుండగా బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య గట్టిపోటీ నెలకొంది.
సాంగ్లీ..: సాంగ్లీ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సంభాజీ పవార్‌కు కాకుండా ప్రముఖ నగల వ్యాపారి సుధీర్ గాడ్గిల్‌కు ఈసారి టిక్కెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలపగా, శివసేన అభ్యర్థిగా పృథ్వీరాజ్ పవార్, కాంగ్రెస్ నుంచి మదన్ పాటిల్ బరిలో ఉన్నారు. ఈసారి బీజేపీ తన స్థానాన్ని నిలుపు కొంటుందో లేదో చెప్పడం కష్టంగా ఉంది. అన్ని ప్రధాన పార్టీలు పోటీని సవాలుగా తీసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.
మీరజ్...: మీరజ్ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే సురేష్ ఖాడేకు బీజేపీ తిరిగి టిక్కెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలిపింది. ఈసారి మీరజ్‌ను గెలుచుకోవాలని కాంగ్రెస్..ప్రొఫెసర్ సిద్ధార్థ్ జాదవ్‌ను నిలబెట్టగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలాసాహెబ్ వాన్‌మోరేకు ఎన్సీపీ టిక్కెట్ ఇచ్చింది. శివసేన నుంచి తానాజీ సాత్‌పుతే, కాంగ్రెస్ రెబల్‌గా సీఆర్ సాంగలీకర్ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు అన్ని వైపులా తలనొప్పులు మోదలయ్యాయి. బుజ్జగింపులతో నాయకులను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
శిరాళా...: సిట్టింగ్ ఎమ్మెల్యే మాన్‌సింగ్‌రావు నాయిక్‌కు ఎన్సీపీ టిక్కెట్ ఇవ్వగా, బీజేపీ శివాజీరావు నాయిక్‌ను ఎన్నికల బరిలో దింపింది. కాంగ్రెస్‌పార్టీ సత్యజిత్ దేశ్‌ముఖ్‌ను నిలబెట్టింది. ఎన్సీపీ-బీజేపీల మధ్యనే పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి మాన్‌సింగ్ రావు ఓట్లను ఎంతవరకు చీల్చితే బీజేపీకి అంత లాభం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక జయంత్ పాటిల్ ఎన్సీపీకి సపోర్ట్ చేస్తాడా, లేకపోతే బావమరిది అయిన సత్యజిత్‌కు సపోర్టు చేస్తాడా వేచి చూడాలి. జయంత్ పాటిల్ ఎవరికి అనుకూలంగా ప్రచారం చేస్తే వారికి విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
ఇస్లాంపూర్...: ఇస్లాంపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ తిరిగి ఎన్సీపీ నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ జితేంద్ర పాటిల్‌ను నిలబెట్టి గట్టి పోటీ ఇవ్వాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే స్వతంత్య్ర అభ్యర్థిగా నానాసాహెబ్, శివసేన అభ్యర్థిగా భీంరావు మానే పోటీలో ఉన్నారు. జితేంద్ర పాటిల్ ఒక్కడే పోటీలో ఉన్నట్లయితే జయంత్ మరో నియోజకవర్గంలో ప్రచారం చేయడం కష్టమయ్యేది. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాలలో ప్రచారానికి సులువైంది.
జత్...: ఆఖరు వరకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించకుండా సస్పెన్స్ థ్రిల్లర్‌లా నడిచిన జత్ నుంచి ఎన్సీపీకి చెందిన విలాస్‌రావు జగతాప్‌కు బీజేపీ టికెట్ లభించింది. దీంతో ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ శేండగే మనస్థాపం చెంది ఎన్సీపీలోకి చేరి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా విక్రమ్ సిన్హా సావంత్, శివసేన నుంచి సంగమేశ్వర్ తేలి పోటీలో ఉన్నారు. ఈ నియోజక వర్గంలో బీజేపీ-ఎన్సీపీల మధ్య గట్టిపోటీ నెలకొంది.
సాంగ్లీ జిల్లా నుంచి మహా మహులు పోటీలో ఉన్నారు. అందులో ప్రస్తుత మంత్రులు హోం మంత్రి ఆర్‌ఆర్ పాటిల్, అటవీ, పునరావాస శాఖ మంత్రి పతంగ్‌రావు కదమ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జయంత్ పాటిల్‌తోపాటు విలాస్‌రావు జగతాప్‌లాంటి మహా నాయకులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
సాంగ్లీ జిల్లాలో రసవత్తరంగా ఎన్నికలపోరు
Published Mon, Oct 6 2014 10:23 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement