Sangli district
-
Maharashtra Family Death: ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పద మృతి
-
మహారాష్ట్ర: ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పద మృతి
-
మహారాష్ట్రలో విషాదం.. ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పద మృతి
ముంబై: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ముంబైకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీ జిల్లాలోని మహైసల్ గ్రామంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఇంట్లోనే విగత జీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ముగ్గురి మృతదేహాలు ఒకచోట, ఆరుగురి మృతదేహాలు వేర్వేరు చోట్ల లభ్యమయ్యాయని సాంగ్లీ ఎస్పీ దీక్షిత్ గెడమ్ తెలిపారు. అయితే పోస్టుమార్టం అనంతరం 9 మంది మరణానికి సంబంధించికచ్చితమైన కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. చదవండి: సాంకేతిక లోపం.. కేబుల్ కారులో చిక్కుకున్న 11 మంది టూరిస్టులు -
14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య
ముంబై: మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా భిలావడిలో గుర్తుతెలియని వ్యక్తులు 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మాలావలి గ్రామంలో రోడ్డు పక్కన బాధితురాలి మృతదేహం కనిపించడంతో జనవరి 5న ఈ సంఘటన వెలుగుచూసింది. ఆమెను అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో స్పష్టమైనట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఇంటి దగ్గర్లో నివసిస్తున్న కొందరు అనుమానితులను ప్రశ్నిస్తున్నామని, గుర్తుతెలియని నిందితులపై అత్యాచారం, హత్య కేసులు నమోదుచేశామని చెప్పారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ భిలావడి పోలీస్ స్టేషన్ బయట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిందితులు పలానా కులం, మతానికి చెందిన వారని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు వెల్లువెత్తాయి. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. శాంతి భద్రతలకు ముప్పు తలెత్తే పరిస్థితులు కనిపించడంతో భిలావడిలో భద్రతా సిబ్బందిని మోహరించారు. -
బాణసంచాకు 11 మంది బలి
- మృత్యువుతో పోరాడుతున్న మరొక వ్యక్తి - కొన్ని మీటర్ల మేర ఎగిరిపడిన మృతదేహాలు - సాంగ్లీ జిల్లా తాస్గావ్ తాలూకా కవాతే ఏకంద్‌లో ఘటన - టపాసుల తయారీకి ఆ గ్రామం ప్రసిద్ధి.. - అనుమతి లేని తయారీ కేంద్రాలెన్నో.. పట్టించుకోని అధికారులు సాక్షి, ముంబై: భద్రత లేని టపాసుల కేంద్రంలో పనిచేస్తూ మరోమారు బడుగుజీవులు అసువులు బాసారు. బతుకుతెరువు కోసం వెళ్లి మంటలకు ఆహుతయ్యారు. సాంగ్లీ జిల్లా తాస్గావ్ తాలూకా కవాతే ఏకంద్‌లోని ‘ఈగల్ ఫైర్ వర్క్స్’ టాపసుల తయారీ కంపెనీలో సంభవించిన భారీ పేలుడులో 11 మంది మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పేలుడు ధాటికి శరీరాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. ఘటనా స్థలి రక్తపు మరకలతో మాంసపు ముద్దలతో హృదయవిదారకంగా మారింది. రెండు భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తాస్గావ్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ పాటిల్ ‘సాక్షి’కి ఫోన్లో అందించిన వివరాల మేరకు.. సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. భారీ శబ్దంతో ఒక్కసారిగా ఈగల్ ఫైర్ కంపెనీలో పేలుడు సంభవించింది. దీంతో మొత్తం కవాతే ఏకంద్ గ్రామంతా ఉలిక్కిపడింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఈగల్‌ఫైర్ వర్క్స్ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి గ్రామస్తులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కొద్ది సేపటికే అగ్నిమాపక సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. ఈ ఘటనలో ప్రమాదస్థలిలోనే ఆరుగురు మరణించగా, తీవ్రగాయలైన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మరో అయిదుగురు మరణించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. మృతులు అనికేటి గురవ్(16), శరత్ గురవ్(30), ఇందూబాయ్(60), జిబిదా నదాబ్(53),సునందగిరి(45), శంభుగిరి, రామగిరి అని పోలీసులు తెలిపారు. మిగతా నలుగురు మృతుల పేర్లు తెలియ రాలేదు. భద్రత లోపమే...? భద్రత, నియమాల ఉల్లంఘనలే ఇలాంటి సంఘటనలకు కారణమవుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈగల్ ఫైర్ వర్క్స్‌లో జరిగిన పేలుడుకు కారణాలు ఏవన్నది ఇంకా తెలియరాలేదు. టపాసుల తయారీకి కవాతే ఏకంద్ గ్రామం ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ అనేక టపాసుల తయారీ ఫ్యాక్టరీలున్నాయి. కానీ ఏ ఫ్యాక్టరీలోనూ నిర్దేశించిన భ ద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. అనుమతి లేకుండా ఇష్టారీతిన ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవడం, నిర్దేశింన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని పలువురు స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల కిందట ఇదే గ్రామంలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం పాలయ్యారు. పదేపదే ఇలాంటి ఘటనలు జరిగినా మేలుకోని అధికారులు, ఫ్యాక్టర్లీ యజమానులు భద్రతపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనుమతి లేకుండానే చాలా ఫ్యాక్టరీల్లో టపాసులు తయారీ చేస్తున్నట్టు ఆరోపణ ఎప్పటి నుంచో ఉన్నాయి. పేలుడుకు సంబంధించి కంపెనీ యజమానిపై తాస్గావ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. -
సాంగ్లీ జిల్లాలో రసవత్తరంగా ఎన్నికలపోరు
పింప్రి, న్యూస్‌లైన్: సాంగ్లీ జిల్లాలో మొత్తం ఎనిమిది నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో ఈసారి అన్ని పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడంతో ఎవరి సత్తా ఎంటో తెలిసే అవకాశం ఉంది. జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్-ఎన్సీపీ-బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఖానాపూర్...: ఇక్కడి నుంచి కాంగ్రెస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సదాశివరావు పాటిల్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, ఎన్సీపీ అభ్యర్థిగా అమర్ సిన్హా దేశ్‌ముఖ్, బీజేపీ నుంచి గోపీచంద్ పడల్కర్ బరిలోకి దిగగా ఎన్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనిల్ బాబర్‌ను శివసేన ఎన్నికల్లో పోటీకి నిలిపి పోటీని రసవత్తరంగా మార్చింది. ఈసారి సదాశివ్రావు గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాస్గావ్ (కవఠే మహాంకాళ్)...: ఇది ఎన్సీపీ స్టార్, ప్రచాకర్త, ఆర్ఆర్ పాటిల్ నియోజక వర్గం. ఇక్కడ ఆర్ఆర్ పాటిల్‌కు కార్యకర్తల అండ, నియోజక వర్గంలో బలమైన సామాజిక వర్గం అనుకూలాంశాలుగా ఉన్నాయి. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో కొంత కాలంగా ఇంటింటి ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థి సంజయ్ కాకా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. బీజేపీ కూడా ఆర్ఆర్ పాటిల్ ప్రతిష్టను తగ్గించేందుకు ఎన్సీపీకి చెందిన అజిత్ ఘోర్పడేకు టికెట్ ఇచ్చి బరిలోకి దింపగా, కాంగ్రెస్ పార్టీ సురేష్ శేండగేను నిలిపి పోటీని కొత్తపుంతలు తొక్కించింది. ఈసారి ఆర్ఆర్ పాటిల్ గెలుపు నల్లేరుపై నడక కాకపోవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. పలుస్-కడేగావ్..: ముఖ్యమంత్రి కావాలని ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పతంగ్ రావు కదమ్ నియోజక వర్గం ఇది. పతంగ్రావును ప్రతిసారి ఎన్నికల్లో ఎదుర్కొంటు వస్తున్న పృథ్వీరాజ్ దేశ్‌ముఖ్ ఈసారి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్సీపీ నుంచి శ్రామిక్ ముక్తి దళ్‌కు చెందిన మోహన్ యాదవ్ పోటీ చేస్తుండగా బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య గట్టిపోటీ నెలకొంది. సాంగ్లీ..: సాంగ్లీ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సంభాజీ పవార్‌కు కాకుండా ప్రముఖ నగల వ్యాపారి సుధీర్ గాడ్గిల్‌కు ఈసారి టిక్కెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలపగా, శివసేన అభ్యర్థిగా పృథ్వీరాజ్ పవార్, కాంగ్రెస్ నుంచి మదన్ పాటిల్ బరిలో ఉన్నారు. ఈసారి బీజేపీ తన స్థానాన్ని నిలుపు కొంటుందో లేదో చెప్పడం కష్టంగా ఉంది. అన్ని ప్రధాన పార్టీలు పోటీని సవాలుగా తీసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మీరజ్...: మీరజ్ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే సురేష్ ఖాడేకు బీజేపీ తిరిగి టిక్కెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలిపింది. ఈసారి మీరజ్‌ను గెలుచుకోవాలని కాంగ్రెస్..ప్రొఫెసర్ సిద్ధార్థ్ జాదవ్‌ను నిలబెట్టగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలాసాహెబ్ వాన్మోరేకు ఎన్సీపీ టిక్కెట్ ఇచ్చింది. శివసేన నుంచి తానాజీ సాత్పుతే, కాంగ్రెస్ రెబల్‌గా సీఆర్ సాంగలీకర్ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు అన్ని వైపులా తలనొప్పులు మోదలయ్యాయి. బుజ్జగింపులతో నాయకులను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శిరాళా...: సిట్టింగ్ ఎమ్మెల్యే మాన్సింగ్రావు నాయిక్కు ఎన్సీపీ టిక్కెట్ ఇవ్వగా, బీజేపీ శివాజీరావు నాయిక్‌ను ఎన్నికల బరిలో దింపింది. కాంగ్రెస్‌పార్టీ సత్యజిత్ దేశ్‌ముఖ్‌ను నిలబెట్టింది. ఎన్సీపీ-బీజేపీల మధ్యనే పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి మాన్సింగ్ రావు ఓట్లను ఎంతవరకు చీల్చితే బీజేపీకి అంత లాభం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక జయంత్ పాటిల్ ఎన్సీపీకి సపోర్ట్ చేస్తాడా, లేకపోతే బావమరిది అయిన సత్యజిత్‌కు సపోర్టు చేస్తాడా వేచి చూడాలి. జయంత్ పాటిల్ ఎవరికి అనుకూలంగా ప్రచారం చేస్తే వారికి విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఇస్లాంపూర్...: ఇస్లాంపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ తిరిగి ఎన్సీపీ నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ జితేంద్ర పాటిల్‌ను నిలబెట్టి గట్టి పోటీ ఇవ్వాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే స్వతంత్య్ర అభ్యర్థిగా నానాసాహెబ్, శివసేన అభ్యర్థిగా భీంరావు మానే పోటీలో ఉన్నారు. జితేంద్ర పాటిల్ ఒక్కడే పోటీలో ఉన్నట్లయితే జయంత్ మరో నియోజకవర్గంలో ప్రచారం చేయడం కష్టమయ్యేది. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాలలో ప్రచారానికి సులువైంది. జత్...: ఆఖరు వరకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించకుండా సస్పెన్స్ థ్రిల్లర్‌లా నడిచిన జత్ నుంచి ఎన్సీపీకి చెందిన విలాస్‌రావు జగతాప్‌కు బీజేపీ టికెట్ లభించింది. దీంతో ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ శేండగే మనస్థాపం చెంది ఎన్సీపీలోకి చేరి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా విక్రమ్ సిన్హా సావంత్, శివసేన నుంచి సంగమేశ్వర్ తేలి పోటీలో ఉన్నారు. ఈ నియోజక వర్గంలో బీజేపీ-ఎన్సీపీల మధ్య గట్టిపోటీ నెలకొంది. సాంగ్లీ జిల్లా నుంచి మహా మహులు పోటీలో ఉన్నారు. అందులో ప్రస్తుత మంత్రులు హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్, అటవీ, పునరావాస శాఖ మంత్రి పతంగ్‌రావు కదమ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జయంత్ పాటిల్‌తోపాటు విలాస్‌రావు జగతాప్లాంటి మహా నాయకులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.