పింప్రి, న్యూస్‌లైన్: అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో పుణే పార్లమెంటుస్థానంలోని స్థానాల్లో పోటీకి అవకాశం దక్కించుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వచ్చే నెల 15న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలు సన్నద్ధంగా ఉన్నట్టు ప్రకటించాయి. కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తు, మహాకూటమి మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు.
ప్రస్తుతానికైతే అన్ని పార్టీల టికెట్లకూ భారీ పోటీ ఉంది. పుణే పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్‌కు పెట్టని కోటలా ఉండేది. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన బీజేపీ ఈ స్థానాన్ని సునాయాసంగా గెలుచుకోగలిగింది. ఇక్కడి నుంచి పోటీ చేయాలన్న కల్మాడీ ఆశలకు గండి కొట్టిన కాంగ్రెస్.. అవినీతిపరులకు టికెట్ ఇచ్చేది లేదని చెబుతూ విశ్వజిత్ కదమ్‌ను పోటీ నిలిపింది. దీంతో కల్మాడీ కాంగ్రెస్ కదమ్‌కు సహకరించలేదు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కోసం పుణేకు వచ్చినా కాంగ్రెస్ ఈ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీస్థానాల్లో పెద్ద ఎత్తున ఓట్లు కోల్పోయింది. బీజేపీ సునాయాసంగా 3.15 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.
కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే ఈ నియోజక వర్గంలోని ఆరు అసెంబ్లీ సీట్లలో కస్బాపేట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే గిరీశ్ బావట్ ప్రాతినిత్యం వహిస్తుండగా, పర్వతి నుంచి బీజేపీకే చెందిన మాధురి మీనల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కోత్‌రోడ్డు స్థానం నుంచి శివసేన నాయకుడు చంద్రకాంత్ మోకాటి, శివాజీ నగర్ నుంచి కాంగ్రెస్ నాయకుడు వినాయక్ నిమ్హర్, కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ నాయకుడు రమేష్ బాగావే, వడగావ్‌శేరి నుంచి ఎన్సీపీ నాయకుడు బాపు సాహెబ్ పఠారే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం పుణేలోని ఆరు నియోజకవర్గాల్లో మూడుసీట్లలో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి, మూడుసీట్లలో శివసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అన్ని అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సాధించడంతో కాంగ్రెస్‌కు వెన్నులో వణుకు మొదలైంది. బీజేపీ కస్బాపేట్ అభ్యర్థి శిరోలే 58 వేల ఓట్ల ఆధిక్యం సాధించగా, పర్వతి స్థానంలోనూ బీజేపీ 69 వేల మెజారిటీ సాధించింది. కోత్‌రోడ్డు బీజేపీ అభ్యర్థి 91 వేల మెజారిటీకి పెరిగింది. ఇతర నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులు కూడా మంచి మెజారిటీ సాధించారు.
కస్బాపేట్ ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే గిరీష్ తిరిగి ఇదే స్థానం నుండే సీటును ఆశిస్తుండగా, హేమంత్ రసనే, గణేష్ చిడకర్, అశోక్, ధీరజ్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మన్‌సే నుంచి గతంలో పోటీ చేసిన రవీంద్రకు టికెట్ లభించడం కష్టమేనని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో మన్‌సే నుంచి పోటీ చేసిన దీపక్ పాయ్‌గుడేకు ఆయన సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత మన్‌సే కార్పొరేటర్ రూపాలీ పాటిల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
పర్వతి నుంచి మాధురి మీనల్ గత ఎన్నికల్లో ఎన్సీపీకి చెందిన సచిన్ తావరేను ఓడించారు. అయితే ఈమెను కస్బాపేట్ నుంచి పోటీ చేయించి, పర్వతి నుంచి మాజీ ఎంపీ పురీష్ రావత్‌ను లేదా మాజీ మంత్రి దిలీప్ కాంబ్లేను నిలపాలని బీజేపీ యోచిస్తున్నది. కాంగ్రెస్ నుంచి అభయ్ ఛాజ్‌డ్, ఎన్సీపీ నుంచి కార్పొరేషన్ సభాగృహ నేత సుభాష్ జగతాప్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు.
శివాజీ నగర్ ప్రస్తుత ఎమ్మెల్యే వినాయక్ నిమ్హణ్ త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. బీజేపీ నాయకులు దత్తాఖాడే, ఎంపీ అనిల్ శిరోలే కుమారుడు సిద్దార్థ్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వికాస్ మటకరి కూడా తన ప్రయత్నం చేస్తున్నారు. మన్‌సే నుంచి రంజిత్ శిరోలే పేరు వినిపిస్తున్నది. కోత్ రోడ్డు నుంచి శివసేన నాయకుడు చంద్రకాంత్ మోకటే గెలుపొందగా, ఈసారి ఇక్కడి నుంచి పోటీకి సేన నగరాధ్యక్షుడు శ్యాం దేశ్‌పాండే, మాజీ మంత్రి శశికాంత్ సుతార్‌తోపాటు ఇతని కుమారుడు ప్రస్తుత కార్పొరేటర్ పృథ్వీరాజ్ సుతార్ ఉత్సాహం చూపిస్తున్నారు. మన్‌సే నుంచి కిషోర్ శిందే, గజానన్ మారణే పోటీలో ఉండగా, ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి పలువురు నాయకులు, కార్పొరేటర్లు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.
కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ బాగలే తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నాడు. అయితే కార్యకర్తల్లో రమేష్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. వడగావ్‌శేరి ఎన్సీపీ ఎమ్మెల్యే బావు సాహెబ్ పటారేకే ఈసారి కూడా టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీ మాత్రం మోడీ ప్రభావంపై గంపెడాశలు పెట్టుకుంది.
పైరవీలు ప్రారంభం
Published Fri, Sep 12 2014 11:42 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement