రియో డి జనేరియో: నైజీరియాకు చెందిన నలుగురు వలసదారులు 14 రోజులపాటు కార్గో షిప్ అడుగున ముందుభాగంలో ఉండే చుక్కానిపై కూర్చుని అత్యంత సాహసంతో కూడుకున్న యాత్ర చేసి బ్రెజిల్ చేరుకున్నారు. తిండి లేకుండా దీనావస్థలో ఉన్న వారిని ఆగ్నేయ పోర్టులోని బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు కనుగొని రక్షించారు.
యూరప్ చేరుకోవాలన్న తపనతో నలుగురు నైజీరియా వలసదారులు అక్రమంగా ఒక పెద్ద ఓడ చుక్కానిపైకి ఎక్కి కూర్చున్నారు. అట్లాంటిక్ మహాసముద్రం వైపుగా కదిలిన ఆ ఓడ యూరప్ వెళ్తుందనుకుంటే అదికాస్తా బ్రెజిల్ వైపుగా కదిలింది. నడిసంద్రంలో ఉన్నంతసేపు వారు ఎక్కడికి వెళ్తోంది కూడా వారికి తెలియదు. రేయింబవళ్లు ఆ చిన్న స్థలంలో ఇరుక్కుని అలా కూర్చుండిపోయారు. వారివద్ద తినడానికి కూడా ఏమీ లేదు. అలాగే బిక్కుబిక్కుమంటూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణించారు.
ఆ ఓడ 14 రోజులపాటు మహాసముద్రంలో 5,600 కిలోమీటర్లు ప్రయాణించి బ్రెజిల్ పోర్టు చేరుకుంది. ఓడ బ్రెజిల్ చేరుకున్నాక దయనీయ స్థితిలో చుక్కానిపై కూర్చుని ఉన్న నలుగురిని అక్కడి అధికారులు జాగ్రత్తగా కిందికి దించారు. వారి పరిస్థితి చూసి వెంటనే వారికి ఆహారమిచ్చి ఆశ్రయమిచ్చారు. మొత్తం నలుగురు వలసదారుల్లో ఇద్దరి అభ్యర్ధన మేరకు వారిని తిరిగి నైజీరియా పంపించగా మరో ఇద్దరు మాత్రం బ్రెజిల్లోనే ఉండిపోయారు.
వారు తమ అనుభవాలను పంచుకుంటూ చుక్కాని మీద కూర్చుని ప్రయాణించడం చాలా భయంకరమైన అనుభూతి. ఒక్కోసారి పెద్ద పెద్ద తిమింగలాలు మాకు దగ్గరగా వెళ్తూ కనిపించేవి. వాటిని చూస్తేనే భయమేసేది. ఒకపక్క సముద్రం మరోపక్క ఓడ ఇంజిన్ శబ్దం హోరెత్తించడంతో నిద్ర కరువైంది. దాహానికి మాత్రం అపుడప్పుడు వేరే మార్గంలేక సముద్రం నీళ్లనే తాగేవాళ్ళం. ఓడ సిబ్బంది కంటపడితే వారు మమ్మల్ని సముద్రంలోకి పడదోస్తారని భయపడి అలాగే ఉండిపోయాము.
ఒక్కోసారి మాలో ఎవరైనా కూడా ఆ పని చేస్తారేమోనని భయపడి కళ్ళు తెరచుకుని ఉండే వాళ్ళమన్నాడు. నైజీరియాలో ఆర్ధిక, రాజకీయ అస్థిరత వల్లనే తాము వలస వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నాడు. సావో పాలోలో వారికి ఆశ్రయమిచ్చిన చోట ఒక వ్యక్తి మాట్లాడుతూ మేము చాలా మంది వలసదారుల గాధలు విన్నాం కానీ ఇటువంటి సాహస యాత్రను నేనెన్నడూ చూడలేదని అన్నారు.
ఇది కూడా చదవండి: సైనిక తిరుగుబాటుతో ఫ్రాన్స్ దేశస్తులను వెనక్కి రప్పిస్తున్న ఎంబసీ
Comments
Please login to add a commentAdd a comment