అందుకోసం సైన్యాన్ని కూడా రంగంలోకి దించుతాం: ట్రంప్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఊహించినట్లుగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అతి కీలకమైన ఎన్నికల అంశంగా మారిన అక్రమ వలసలపై ఆయన తాజాగా కీలక నిర్ణయం వెలువరించారు. సరిహద్దు భద్రతపై జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే యోచన ఉందని సోమవారం ట్రంప్ ధ్రువీకరించారు.
అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించుతామని తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో ప్రకటించారు! ఈ మేరకు ఓ రిపబ్లికన్ కార్యకర్త చేసిన చేసిన పోస్టును ట్రంప్ రీ పోస్టు చేస్తూ, ‘నిజమే’ అంటూ కామెంట్ జోడించారు. వలసలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తనను గెలిపిస్తే కనీసం 10 లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కు పంపుతానని, మెక్సికోతో సరిహద్దులను దుర్భేద్యంగా మారుస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు.
అమెరికాలో ఏకంగా కోటీ 10 లక్షల మందికి పైగా అక్రమంగా నివసిస్తున్నట్టు అధికారుల అంచనా. ట్రంప్ భారీ బహిష్కరణ ప్రణాళిక లక్షలాది కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.ట్రంప్ జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుండటం తెలిసిందే. తన కేబినెట్‌ను ఇప్పటికే అతివాదులు, వలసల వ్యతిరేకులతో నింపేశారు. ముఖ్యంగా కీలకమైన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మాజీ చీఫ్ టామ్ హోమన్‌ను బోర్డర్ జార్ పదవికి ఎంపిక చేశారు. ‘అక్రమ వలసదారులారా! సామాన్లు ప్యాక్ చేసుకోవడం మొదలు పెట్టండి.
మీ దేశాలకు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది’ అని గత జూలైలోనే రిపబ్లికన్ పార్టీ సదస్సులో హోమన్ హెచ్చరికలు చేశారు. తమ విభాగం తొలుత 4.25 లక్షల మంది అక్రమ వలసదారులను బహిష్కరిస్తుందని ఆయన ఇటీవల పేర్కొన్నారు. అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో రికార్డు సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించారని ట్రంప్ పదేపదే ఆరోపించడం తెలిసిందే. వారంతా అమెరికా రక్తాన్ని విషపూరితం చేశారంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని తిప్పి పంపేందుకు అవసరమైతే 1798 నాటి ఏలియన్ ఎనిమీస్ చట్టాన్ని కూడా ప్రయోగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment