న్యూఢిల్లీ: యువత కలల ప్రపంచం అమెరికా. అగ్రరాజ్యం వెళ్లాలి.. డాలర్లు సంపాదించాలి అని మనలో చాలా మంది కలలు కంటుంటారు. అలానే అనుకున్నారు పంజాబ్‌కు చెందిన కొందరు యువకులు. అయితే సక్రమంగా వెళ్తే 15-20లక్షల రూపాయలు కావాలి. అంత స్థోమత లేదు. మరి ఏం చేయాలి. అలాంటి సమయంలో కొన్ని యూట్యూబ్ వీడియోలు వారిని ఆకట్టుకున్నాయి. తక్కువ ఖర్చుతో పాస్‌పోర్టు, వీసాలాంటి గొడవలేం లేకుండా అమెరికాలో ప్రవేశించవచ్చని వారిని ఊదరగొట్టాయి. దాంతో ముందున్న ప్రమాదాన్ని అంచనా వేయలేక నానా అవస్థలు పడి.. మెక్సికో వరకు చేరుకుని.. అక్కడి నుంచి తిరిగి ఇండియాకు పంపించబడ్డారు. ఈ ప్రయాణంలో వారు అనుభవించిన కష్టాలు వర్ణనాతీతం. ఆ వ్యథ వారి మాటల్లోనే..
యూట్యూబ్ వీడియోలు చూసి..
‘మా స్నేహితులు చాలా మంది అమెరికాలో ఉంటున్నారు. మేం కూడా అమెరికా వెళ్లాలి అనుకున్నాం. కానీ అందుకు 15-20లక్షల రూపాయలు అవసరమవుతాయన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలోనే కొన్ని యూట్యూబ్ వీడియోలు మమ్మల్ని ఆకర్షించాయి. చాలా తక్కువ ఖర్చుతో.. రోడ్డు, విమానం, నడక ద్వారా అమెరికా చేరుకున్నట్లు కొందరు ఆ వీడియోల్లో తెలిపారు. దాంతో మేం కూడా అలానే వెళ్లాలని భావించాం. మెక్సికో చేరుకుని అక్కడి నుంచి ఎలా అయినా అమెరికా వెళ్లాలనుకున్నాం. ఈ లోపు మా స్నేహితుల ద్వారా కొందరు ఏజెంట్లు పరిచయం అయ్యారు. వారి సాయంతో సులభంగా అమెరికా చేరవచ్చని తెలిసింది. అలా జూలై 29న పంజాబ్ నుంచి ఢిల్లీ చేరుకుని.. ఇండియాను విడిచి వెళ్లాం’ అన్నారు.
ఇంత భయంకరంగా ఉంటుందని తెలియదు..
‘ఈక్వేడార్ చేరుకున్నాం. ఆ తర్వాత మా స్నేహితులు చెప్పిన ఏజెంట్లు మమ్మల్ని రోడ్డు, విమానం ద్వారా కొలంబియా, బ్రెజిల్, పెరు, పనామా, కొస్టా రికా, నికరాగువా, హోండురాస్, గ్వాటెమాల ద్వారా చివరకు మెక్సికో చేర్చారు. ఈ ప్రయాణంలో ప్రతి ఇమ్మిగ్రేషన్ పాయింట్ వద్ద రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఏజెంట్లు మమ్మల్ని ఉంచిన హోటల్స్‌ని తలచుకుంటే.. ఇప్పటికి వెన్నులోంచి వణుకు పుడుతుంది. పనామా నుంచి మా ప్రయాణం అంత భయంకరంగా ఉంటుందని తెలిస్తే.. అసలు అమెరికా వెళ్లాలనే ఆలోచనే చేసే వాళ్లం కాదు. అక్కడ దట్టమైన అడవిలో మా ప్రయాణం. మాకంటే ముందే వెళ్లిన వారు.. తమ తర్వాత వచ్చే వారు సరైన మార్గంలో పయణించేలా ప్లాస్టిక్ కవర్లను వాడి గుర్తులు పెట్టుకుంటు వెళ్లారు. దాదాపు వారం రోజుల పాటు ఆ అడవి గుండా.. కొండలను ఎక్కుతూ మా ప్రయాణం సాగింది’ అన్నారు.
చెమటను పిండుకు తాగి దాహం తీర్చుకున్నాం..
‘తిండి కాదు కదా.. కనీసం తాగడానికి నీరు కూడా లభించలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మా చొక్కాలకు పట్టిన చెమటను పిండి.. దాని ద్వారా దాహం తీర్చుకున్నాము. ఈ భయంకరమైన ప్రయాణంలో మాలో కొందరు అనారోగ్యంతో కన్నుమూశారు. ఎట్టకేలకు చివరకు మెక్సికో చేరుకున్నాం. గమ్యం చేరామని సంతోషించే లోపలే మమ్మల్ని అరెస్ట్ చేశారు. జైలు కంటే దారుణంగా ఉన్న క్యాంపులో మమ్మల్ని ఉంచారు. ఎప్పుడు పడితే అప్పుడు క్యాంపులో నుంచి బయటకు రానిచ్చేవారు కాదు. రోజుకు రెండు పూటలా మాత్రమే భోజనం పెట్టేవారు. ఆ ఇరుకు వాతావరణంలో మాలో చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. మెక్సికో చేరుకున్న తర్వాత కొందరు ఏజెంట్లు 3500 డాలర్లు ఇస్తే పాస్ ఇస్తామని దాని ద్వారా అమెరికాలో అడుగుపెట్టవచ్చని తెలిపారు. దాంతో కొందరు ఆ మొత్తం చెల్లించి పాస్‌లు తీసుకున్నారు. కానీ అవి చెల్లవని తర్వాత తెలిసింది’ అన్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి..
‘దాదాపు నాలుగు నెలలు కష్టపడి మెక్సికో చేరాం. అక్కడ 45 రోజుల పాటు క్యాంప్‌లో గడిపాం. చివరకు ఇలా ఇండియా తిరిగి వచ్చేశాం. అమెరికా వెళ్లడానికి మాకున్న కొద్ది పాటి భూములను కూడా అమ్ముకున్నాం. ఇప్పుడు ఏం చేయాలో మాకు పాలు పోవడం లేదు. ప్రభుత్వమే మాకు దారి చూపాలి’ అని వాపోతున్నారు. శుక్రవారం మెక్సికోలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న ఒక మహిళ సహా 310 మందిని చార్టర్ విమానంలో తిప్పి పంపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment