ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తున్న ఫొటో | Photo Of Father Daughter Lying Dead On US Border | Sakshi
Sakshi News home page

చిన్నా నిన్ను ఇంతదూరం తీసుకువచ్చా.. ఇప్పుడు..

Published Wed, Jun 26 2019 1:24 PM | Last Updated on Tue, Dec 17 2019 9:40 PM

Photo Of Father Daughter Lying Dead On US Border - Sakshi

సరిగ్గా నాలుగేళ్ల క్రితం.. యూరప్‌నకు వలస వెళ్లే క్రమంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొని... టర్కీ బీచ్‌లోకి కొట్టుకు వచ్చిన మూడేళ్ల చిన్నారి అలన్‌ కుర్దీ ఫొటో చూసి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. ప్రస్తుతం ఇప్పుడు అలాంటి ఫొటోనే మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తన కూతురిని షర్ట్‌కు ముడివేసుకుని నీళ్లలో మునిగి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఓ తండ్రి శవం మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరి మనస్సును ద్రవింపజేస్తోంది. మరణంలోనూ మా బంధం వీడదు అని చెబుతున్నట్లుగా ఉన్న ఆ తండ్రీకూతుళ్ల ఫొటో శరణార్థుల దీనగాథలను మరోసారి కళ్లకు కట్టింది.

నిరంతరం గ్యాంగ్‌ వార్‌లతో దద్దరిల్లే తన దేశం నుంచి అమెరికాకు వెళ్లి.. అక్కడే స్థిరపడాలనుకున్నాడు ఓ ఓ మధ్యతరగతి తండ్రి. మహిళలకు రక్షణ లేని మాతృదేశంలో ఉంటే తన చిన్నారి కూతురు కూడా రాక్షస మూక అకృత్యాలకు బలవుతుందనే ఆవేదనతో ప్రాణాలకు తెగించైనా సరే అగ్రరాజ్యంలో ప్రవేశించాలనుకున్నాడు. కొంత డబ్బు సంపాదించి తిరిగి ఇంటికి రావొచ్చని భావించాడు. కానీ అదే తన పాలిట శాపమవుతుందని ఊహించలేకపోయాడు . అతడి పేరు ఆస్కార్‌ ఆల్బెర్టో మార్జినెజ్‌ రామిరెజ్‌. ఈఎల్‌ సాల్వేడార్‌కు చెందిన అతడు అమెరికాలో ఆశ్రయం పొందాలని భావించాడు. ఇందులో భాగంగా పలుమార్లు ఆ దేశ అధికారులకు తన పరిస్థితి గురించి మొరపెట్టుకున్నాడు. అయినప్పటికీ అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మెక్సికో గుండా అమెరికాలో ప్రవేశించాలని భావించాడు.

ఈ క్రమంలో ఆదివారం తన భార్యాపిల్లలతో కలిసి అమెరికా- మెక్సికో సరిహద్దులో ఉన్న రియో గ్రాండే నదిని దాటేందుకు సిద్ధమయ్యాడు. తొలుత కూతురిని వీపునకు కట్టుకుని ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చాడు. అనంతరం తన భార్యను కూడా తీసుకువచ్చేందుకు వెనుదిరిగాడు. అయితే తండ్రి తనను విడిచిపెట్టి వెళ్తున్నాడని భావించిన చిన్నారి వాలెరియా.. అతడిని అనుసరించాలని నీళ్లలో దూకింది. దీంతో షాక్‌కు గురైన రోమిరెజ్‌ వెంటనే వెనక్కి వచ్చి కూతురిని తన షర్టుకు ముడివేసుకున్నాడు. కూతురి చేతులు మెడ చుట్టూ వేసుకుని మళ్లీ ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తూ నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వారిద్దరు నీళ్లలో మునిగి చనిపోయారు. అనంతరం అలాగే ఒడ్డుకు కొట్టుకువచ్చారు. హృదయవిదారకంగా ఉన్న తండ్రీ కూతుళ్ల ఫొటోను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు. మెక్సికోలో నివసించే జర్నలిస్టు జులియా లీ డ్యూక్‌ ఈ ఫొటోను తీశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో సిరియా శరణార్థి చిన్నారి అలన్‌ కుర్దీ రూపాన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ శరణార్థుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వద్దని చెప్పినా వినలేదు..!
‘ఇక్కడే ఉందామని ఎంతగానో బతిమిలాడాను. కానీ మార్టినెజ్‌ వినలేదు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలని భావించాడు. అందుకోసం డబ్బు సంపాదించేందుకు అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అలాగే కొన్ని రోజులు ప్రశాంతంగా అక్కడే జీవించవచ్చని చెప్పాడు. వద్దన్నా వినకుండా కూతురితో కలిసి నదిలో ఈదుకుంటూ వెళ్లాడు. ఇప్పుడు వాళ్లిద్దరూ మాకు శాశ్వతంగా దూరమయ్యారు. నన్ను కూడా వాళ్లతో పాటు తీసుకువెళ్తే బాగుండు. చిన్నా నిన్ను ఇంతదూరం తీసుకువచ్చా.. ఇప్పుడు కూడా నీతోనే వస్తా అని బహుశా నా కొడుకు తన కూతురితో చెప్పి ఉంటాడు. అన్నట్లుగానే వెళ్లిపోయాడు’ అని రోమిరెజ్‌ తల్లి రోసా రోమిరెజ్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

దయచేసి ఇక్కడే ఉండండి..
రోమిరెజ్‌, వాలెరియా ఫొటోలు వైరల్‌గా మారడంతో ఈఐ సాల్వెడార్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అలెగ్జాండ్రా హిల్‌ ఈ ఘటనపై స్పందించారు. ‘మా దేశం మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక్కడున్న ప్రతీ కుటుంబాన్ని, తల్లిదండ్రులను వేడుకుంటున్నాను. దయచేసి జీవితాలను పణంగా పెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడకండి’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. మెక్సికో అధికారులతో మాట్లాడి మిమ్మల్ని వెనక్కి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఇక ఈఐ సాల్వెడార్‌ అధ్యక్షుడు నయీబ్‌ బుకేలే బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


సిరియా బాలుడు- అలన్‌ కుర్దీ

కాగా గత వారం అమెరికా- మెక్సికో సరిహద్దులో అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి గుర్‌ప్రీత్ కౌర్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక అమెరికాలో ఉన్న లక్షలాది మంది అక్రమ వలసదారులను త్వరలోనే వెళ్లగొడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన విషయం విదితమే. ‘అక్రమమార్గాల్లో వచ్చిన వారిని వెళ్లగొట్టేందుకు ఉద్దేశించిన ప్రక్రియను వచ్చే వారం ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ(ఐసీఈ) ప్రారంభించనుంది. ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంతో వాళ్లు వెళ్లిపోతారు’ అని ట్వీట్‌చేశారు. ఈ నేపథ్యంలో సాయం నిలిపి వేస్తామంటూ మెక్సికోను భయపెట్టి మరీ అమెరికా ఒప్పందానికి దిగేలా చేసింది. దాని ప్రకారం వలసదారులను నిలువరించేందుకు అమెరికాతో సరిహద్దుల్లో మెక్సికో అదనంగా 6 వేల మంది గార్డులను నియమించింది. దీంతో వలసదారులు వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం ప్రస్తుతం చర్చ నీయాంశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement