ట్రంప్ వేట మొదలైంది.. | Will deport illegal immigrants: Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్ వేట మొదలైంది..

Published Mon, Nov 14 2016 6:34 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ట్రంప్ వేట మొదలైంది.. - Sakshi

ట్రంప్ వేట మొదలైంది..

వాషింగ్టన్: ఎన్నికల ప్రచారంలో అమెరికన్లకు ఇచ్చిన ప్రధాన హామీ ‘అక్రమ వలసదారులపై వేటు’పై వెనకడుగు వేయబోనని కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికాలో కోటి మందికిపైగా అక్రమ వలసదారులు ఉన్నారని, వారిలో క్రిమినల్ రికార్డులున్న 30 లక్షల మందిని  దేశం నుంచి వెళ్లగొట్టేందుకు అవసరమైన చర్యలు త్వరితగతిన పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ వలసదారులపై చర్యలు తప్పవని తెలిపారు.

డోనాల్డ్ ట్రంప్ శనివారం కొలంబియన్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్(సీబీఎస్) చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. అమెరికాలో ఆదివారం రాత్రి ప్రసారంకానున్న ఆ కార్యక్రమంలో సరిహద్దు భద్రతపైనా ట్రంప్ కీలక అంశాలను వెల్లడించారు. ‘యూఎస్ లో అక్రమంగా నివసిస్తోన్న వారిలో చాలామంది డ్రగ్స్ డీలర్లు, క్రిమినల్స్, గ్యాంగ్స్ నడిపేవారున్నారు. అలాంటివాళ్లు కనీసం 20 నుంచి 30 లక్షల మంది ఉంటారని అంచనా. వాళ్లందరినీ దేశం నుంచి తరిమేస్తాం. అంతర్గత భద్రతను పటిష్టం చేసుకుంటూనే దేశసరిహద్దుల్లోనూ అవసరమైన మేరకు రక్షణ ఏర్పాటుచేస్తాం. వలసదారులను వెళ్లగొట్టడం ఒక సవాలైతే, అలాంటి వాళ్లు తిరిగి అమెరికాలోకి రాకుండా సరిహద్దుల వద్ద నిఘాను పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే ముందుగా సరిహద్దు భద్రతను పెంచి, తర్వాత వలసదారు వేట కొనసాగిస్తాం’అని ట్రంప్ చెప్పారు.

ట్రంప్ మొట్టమొదటి అధికారిక నియామకాలు
కాబోయే అధ్యక్షుడి హోదాలో డోనాల్డ్ ట్రంప్ మొట్టమొదటి అధికారిక నియామకాన్ని చేపట్టారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ ముఖ్య అధికారిగా రెయిన్స్ ప్రైబస్ ను ఎంపికచేశారు. కీలకమైన వ్యూహాత్మక విభాగం అధిపతిగా స్టీవ్ బనూన్ ను నియమించారు. దేశాన్ని ముందుకు నడిపించడంలో విజయవంతమైన బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement