‘వలస పిల్లల’ను వేరుచేయం | Trump Backs Down on Separating Children from Parents at US-Mexico Border | Sakshi
Sakshi News home page

‘వలస పిల్లల’ను వేరుచేయం

Published Fri, Jun 22 2018 3:01 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

Trump Backs Down on Separating Children from Parents at US-Mexico Border - Sakshi

ఉత్తర్వులపై సంతకం చేస్తున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: అక్రమ వలసదారుల కుటుంబాల నుంచి పిల్లలను వేరుగా నిర్బంధించటానికి సంబంధించిన ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెనక్కి తగ్గారు. కుటుంబాలను, వారి పిల్లలను కలిపి ఒకేచోట నిర్బంధంలో ఉంచుతామని చెప్పారు. మెక్సికో సరిహద్దుల గుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారి పిల్లలను, తల్లిదండ్రుల నుంచి వేరు చేయటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం కావటంతో గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం అధ్యక్ష భవనం వెలుపల ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ సమస్య ఇకపై ఉండదు. కుటుంబాల నుంచి వారి పిల్లలను వేరు చేయబోం. కుటుంబాలతోనే కలిపి ఉంచుతాం. ఇదే సమయంలో మా సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టం చేస్తాం. అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.  

ఆశ్రయం కోరిన వారిని నిర్బంధిస్తారా?
అక్రమ వలసదారుల పిల్లలను, కుటుంబాలతో కలిపి ఉంచుతున్నప్పటికీ వారిని కనీస సౌకర్యాలు లేని డిటెన్షన్‌ సెంటర్లలో ఉంచడంపై భారతీయ అమెరికన్‌ ప్రజాప్రతినిధులు, హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో పిల్లలను, వారి కుటుంబాలను నెలల తరబడి నిర్బంధంలో ఉంచడం ‘అమానవీయం, క్రూరం’ అని కాంగ్రెస్‌ సభ్యులు ప్రమీలా జయపాల్, కమలా హ్యారిస్‌ వ్యాఖ్యానించారు. ఆశ్రయం కోరుతూ వచ్చిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టి పిల్లలతో సహా నిర్బంధించడాన్ని కోర్టులో సవాల్‌ చేస్తామన్నారు.

పిల్లలను వేరుగా ఉంచడం ద్వారా ఉత్పన్నమైన సమస్యకు కుటుంబాన్నంతటినీ కలిపి నిర్బంధించడం పరిష్కారం కాదని సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ప్రోగ్రెస్‌ సంస్థ అధ్యక్షురాలు నీరా టాండెన్‌ అన్నారు. ట్రంప్‌ తాజా ఉత్తర్వు ఈ సమస్యకు పరిష్కారం కాదనీ, ఆయన ఇంకా ఎంతో చేయాల్సి ఉందని కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా అన్నారు. పిల్లలను వేరు చేసి ఉంచే సమస్య పరిష్కారానికి, కుటుంబ సభ్యులందరినీ ఒకే చోట నిర్బంధిస్తామనటం ద్వారా ఇంకో సమస్యను సృష్టించారని చెప్పారు. ఈ ఏడాది మార్చి–మే మధ్య కాలంలో మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన దాదాపు 50వేల మందిని అధికారులు నిర్బంధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement