వాషింగ్టన్ : అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపుతున్న ట్రంప్ సర్కార్.. తల్లిదండ్రులనుంచి పిల్లలను వేరు చేస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వలసదారుల పిల్లలను నిర్బంధ వసతి గృహానికి తరలిస్తుండటంతో.. తల్లిదండ్రులకు దూరమైన ఆ చిన్నారులు అల్లాడిపోతున్నారు. తల్లిదండ్రుల చెంతకు తమను పంపించాలని, లేదంటే కనీసం వారితో ఫోన్‌లో మాట్లాడే అవకాశమైనా కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో నిర్బంధ గృహంలో ఉన్న ఓ ఆరేళ్ల చిన్నారి తాజాగా ఫోన్‌లో తీవ్ర ఆవేదనతో మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. తన ఆంటీతో ఆ పాప మాట్లాడిన ఫోన్ సంభాషణ తాజాగా వైరల్‌గా మారింది. ఎనిమిది నిమిషాల నిడివి గల ఈ సంభాషణలో ‘నేను ఇంటి వద్ద మంచిగా నడుచుకుంటాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి. ఇక్కడ చాలా ఒంటరిగా ఉన్నాను’ అంటూ చిన్నారి ఏడుస్తూ అన్న మాటలు.. ప్రతి హృదయాన్ని కదిలించి వేస్తున్నాయి.
‘పాపి (స్పానిష్‌లో తండ్రి), మామి (తల్లి).. కనీసం బంధువులైన కలవండి. ఇక్కడ మేం ఒంటరిగా ఉన్నామనే బాధ ఎక్కువగా ఉంది. దయచేసి మాకు విముక్తి కల్పించండి’ అంటూ ఆ చిన్నారి అర్థిస్తున్న.. ఈ సంభాషణ ఆడియోను ప్రోపబ్లికా అనే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విడుదల చేసింది. ఆ చిన్నారి మాటలు వింటుంటే చాలా బాధగా ఉందని, ట్రంప్ ప్రభుత్వం త్వరగా ఆ పిల్లలను వారి తల్లి దండ్రులకు అప్పగించాలని అమెరికా ప్రజలు కోరుతున్నారు.
మరోవైపు ఈ ఆడియో టేప్‌ను విన్న హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సెక్రటరీ నీల్సన్.. చాలా నిర్లక్ష్యంగా స్పందించారు. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన వలస వ్యతిరేక విధానాన్ని ఆయన సమర్థించుకున్నారు. నిర్బంధ వసతి గృహంలోని పిల్లలను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయడం లేదని, వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా అక్రమ వలసదారులకు హాలిడే స్పాట్ కాదని, అక్రమవలస విధానాలపై చట్టాలు మార్చే ప్రసక్తేలేదని, యూరప్ దేశాల్లో చూస్తున్నారుగా అంటూ మరోవైపు ట్రంప్ పరుషంగా ట్వీట్ చేశారు. తల్లిదండ్రుల కోసం అలమటిస్తున్న పసి పిల్లల కోసమైన ఈ వలస చట్టాలు మారుస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment