వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అనుకున్నంతా పని చేశారు. ఇటీవల డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించిన కలకలం సృష్టించిన ట్రంప్...తాజాగా మరో సంచలనం నిర్ణయంపై అధికార ముద్ర వేశారు. కరోనా మారణహోమం సృష్టిస్తున్న నేపథ్యంలో అమెరికన్‌ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ...వలసలపై నిషేధ ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. వలసదారులపై 60 రోజుల నిషేధం విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేయడంతో అన్ని రకాల వలసలు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. ఈ వలసల తాత్కాలిక రద్దు అరవై రోజుల పాటు అమల్లో ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అంతేగాక గ్రీన్ కార్డుల జారీని కూడా రెండు నెలలపాటు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. (వలసల నిషేధంపై స్పష్టతనిచ్చిన ట్రంప్..!)
రెండు నెలలపాటు తమ దేశంలోకి ఎవరినీ అడుగుపెట్టనీయమని, తమ దేశ ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. అయితే టూరిస్ట్, బిజినెస్, విదేశీ వర్కర్ల వంటి వలసేతర వీసాలపై ఎలాంటి నిషేధం వుండదని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాతే ఉత్తర్వులను సమీక్షస్తామన్నారు. ఓ అంచనా ప్రకారం భారతీయ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు..దాదాపు అయిదున్నర లక్షల మందికి పైగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ఇక గ్రీన్ కార్డు వస్తుందా రాదా అని అమెరికాలో వున్న భారతీయులు ఆందోళనలో వున్నారు. కాగా కేవలం గ్రీన్ కార్డుల జారీని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేయడంతో లక్షలది మంది హెచ్-1బీ వీసాదారులు ఊపిరి పీల్చుకున్నారు. (కొత్త గ్రీన్ కార్డులకు బ్రేక్)
Comments
Please login to add a commentAdd a comment