
సాక్షి, హైదరాబాద్: కాకినాడలోని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామి నగర బహిష్కరణ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఆదేశాలను రద్దు చేసేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవాలంటే పరిపూర్ణానందస్వామి వాదనలు కూడా తెలుసుకోవాల్సి ఉన్నందున ఈ మేరకు ఆయనకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించా లని తెలంగాణ హోం శాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాల్లో చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌ల ధర్మాసనం బుధవారం తోసిపుచ్చింది.
పరిపూర్ణానంద స్వామి వాదనలు వినకుండా సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. కరీంనగర్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పరిపూర్ణానందస్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఆయనను ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిని ఆయన సవాల్ చేయడంతో వాటి అమలును సింగిల్ జడ్జి ఈ నెల 14న నిలుపుదల చేశారు. పోలీసులు చేసిన అప్పీల్‌లో ఇప్పటికిప్పుడే మధ్యంతర ఆదేశాలు జారీ చేయబోమని ధర్మాసనం తేల్చిచెబుతూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment