సాక్షి, హైదరాబాద్: హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నియమితులయ్యారు. ఆయన్ను ఏసీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. దీంతో జస్టిస్ చౌహాన్ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టులో నంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ చౌహాన్ ఏసీజేగా నియమితులయ్యారు. ఏప్రిల్ 2న జస్టిస్ రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ వెంటనే జస్టిస్ చౌహాన్ ఇక్కడ ఏసీజేగా బాధ్యతలు చేపడతారు.
రాజస్తాన్‌కు చెందిన జస్టిస్ చౌహాన్ గత ఏడాది నవంబర్ 21న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ చౌహాన్ 1959 డిసెంబర్ 24న జన్మించారు. 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2005లో రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment