
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఓటర్ల జాబితా అవకతవకలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణను ఉమ్మడి హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఓటర్ల జాబితా అక్రమాలపై మొత్తం నాలుగు పిటిషన్‌లు దాఖలు కాగా గత శుక్రవారం రెండు పిటిషన్‌లు కొట్టేసిన హైకోర్టు మిగతా రెండింటి విచారణను నేటికి వాయిదా వేస్తూ ఎన్నికల సంఘానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయడంతో ఈ విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.
అక్రమ ఓటర్ల జాబితా ఆధారంగా సీఎం కేసీఆర్ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచించారని ఆరోపిస్తూ మొత్తం 14 అంశాలపై మర్రిశశిధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్ల జాబితాపై వచ్చిన పిటిషన్‌లను త్వరగా విచారించాలని సుప్రీం కోర్టు సైతం హైకోర్టును ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికలను డిసెంబర్ 7న నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఓటర్ల తుది జాబితా పై హైకోర్టు తీర్పును బట్టి షెడ్యూల్‌లో మార్పు కూడా ఉంటుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment