
సాక్షి, హైదరాబాద్: ‘బహుళజాతి సంస్థలు ఉత్పత్తి చేసే మంచినీటి సీసాలను కొనుగోలు చేసి తాగాల్సిన దుస్థితి భారతీయులకు ఏర్పడింది. ఆ కంపెనీలు విక్రయించే మంచినీటి సీసాలు లేదా ప్యాకెట్లపై అభ్యంతరాలు తలెత్తినప్పుడు, వినియోగదారుడికి ఫిర్యాదు చేసేందుకు వీలుగా పూర్తి వివరాల్ని ముద్రించాలి’ అని హైకోర్టు అభిప్రాయపడింది. చట్ట నిబంధనల్ని పరిశీలిస్తే మంచినీటి బాటిళ్లు, ప్యాకెట్లను కొనుగోలు చేసిన వినియోగదారుడు ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడేలా పూర్తి వివరాలు వాటిపై ముద్రించాలని అభిప్రాయపడింది.
ఇరు పక్షాల వాదప్రతివాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. మెదక్ జిల్లా పటాన్‌చెరులోని హిమజల్ బేవరేజెస్ సంస్థ సరఫరా చేసే కిన్లే వాటర్ బాటిళ్లపై వినియోగదారుడు ఫిర్యాదు చేసేందుకు వీలుగా వివరాలు ముద్రించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరేడు లక్షల బాటిళ్లను సీజ్ చేసింది. టోల్‌ఫ్రీ నంబర్ ఇతర వివరాలు ఉన్నందున వాటిని విడుదల చేయాలని సింగిల్ జడ్జి ఆదేశించడాన్ని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ, తూనికలు కొలతల శాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలపై ధర్మాసనం ఎదుట వాదనలు ముగిశాయి.