సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్‌ల సభా బహిష్కరణ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌లను ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునివ్వగా.. ఈ తీర్పును రెండు నెలలపాటు సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేయడంతో.. దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ రెండు నెలలపాటు స్టే విధించింది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును అమలు చేయకపోవడంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేగాక కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సహ ప్రతివాదిగా చేర్చి, ఫాం 1 నోటీసులిచ్చి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఎందుకివ్వరాదో కూడా తెలియజేయాలని నోటీసుల్లో స్పీకర్‌కు స్పష్టం చేసింది. బహిష్కరణ నోటిఫికేషన్ ఉపసంహరణకు స్పీకర్ అనుమతివ్వకపోవడం ఎలా చూసినా కోర్టు తీర్పును అమలు చేయకపోవడమేనని, ఈ వ్యవహారంలో కోర్టు తీర్పు పట్ల స్పీకర్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించారని హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తాజా స్టే ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటిదాకా జరిగింది ఇదీ...
కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లను బహిష్కరిస్తూ సభ తీర్మానం చేసింది. ఆ వెంటనే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణ తీర్మానాన్ని, నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న జస్టిస్ శివశంకరరావు తీర్పు ఇచ్చారు. దీనిపై అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేయలేదు. వారికి బదులు 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. వారికి ఆ అర్హత లేదంటూ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. అయినా అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు కోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్ వారిపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇద్దరు కార్యదర్శులూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. వారికి ఫాం 1 నోటీసులిస్తానని స్పష్టం చేశారు. దాంతో కార్యదర్శులు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు 61 రోజుల ఆలస్యంతో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ధర్మాసనం వారికి అనుకూలంగా ఉత్తర్వులివ్వకుండా విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు మంగళవారం మధ్యాహ్నం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డీజీపీ, ఇద్దరు ఎస్‌పీలకు నోటీసులిస్తూ 83 పేజీలతో ఉత్తర్వులు, ఇరువురు కార్యదర్శులకు వ్యక్తిగత హాజరుకు ఫాం 1 నోటీసులిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment