సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ చేపట్టిన 16,925 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఓ వైపు పిటిషనర్ నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేసి.. మరో వైపు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న కారణంగా తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం మంగళవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. మెదక్ జిల్లా పుల్కల్ మండలం లక్ష్మీసాగర్ గ్రామస్తుడు మాదిగ మహేశ్ దాఖలు చేసిన పిల్‌లో.. తెలంగాణ ప్రత్యేక పోలీస్, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్, స్పెషల్ పోలీస్ ఫోర్స్‌ల్లో పోస్టుల భర్తీ సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి వెయిటేజీగా 3 మార్కులు ఇవ్వడం చట్టవ్యతిరేకమని, హోంగార్డుల వయోపరిమితి పెంపు వెనుక రాజకీయ నిర్ణయం ఉందని పేర్కొన్నారు. పోస్టుల కోసం దరఖాస్తు చేస్తూనే పిల్ వేయడంపై ధర్మాసనం అభ్యంతరం చెబుతూ పిల్‌ను కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment