సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేస్తున్నారని అధికారులు తొందరపడి ఓ స్థలంలోని కట్టడాన్ని కూల్చేశారు. తీరా విచారిస్తే అది ప్రైవేటు స్థలం. ఏం చేయాలో పాలుపోక రెవెన్యూ అధికారులు తలలు పట్టుకున్నారు. ఈలోగా ఆ నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. పాలక పెద్దల ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములు ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించామని తహసీల్దార్ కోర్టులో చెప్పారు. ప్రభుత్వ భూమిలోనే అక్రమ కట్టడాలు చేస్తున్నారనుకుని ఆ కట్టడాన్ని కూల్చేశానని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ) తప్పు ఒప్పుకోక తప్పలేదు. సొంత ఖర్చుతో కట్టడాన్ని నిర్మిస్తానన్నారు. కోర్టు చర్యలు తీసుకుంటుందని భయపడి కూల్చిన నిర్మాణాన్ని నిర్మిస్తామని కోర్టుకు ఆర్‌ఐ హామీ ఇచ్చారని నిర్మాణ సంస్థ అపనమ్మకం వ్యక్తం చేసింది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ స్పందిస్తూ.. కోర్టు చర్యలు ఉంటాయని భయపడి నిర్మాణం చేస్తామని హామీ ఇస్తే సరిపోదని, కచ్చితంగా తిరిగి నిర్మించాలన్నారు.
అక్రమ నిర్మాణం అనుకుని..
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సర్వే నం. 168/ పిలో ఎకరా 35 సెంట్ల భూమిలోని క్రీడా సముదాయ నిర్మాణాన్ని అధికారులు కూల్చేశారు. దీన్ని సవాల్ చేస్తూ నిర్మాణ సంస్థ డీసీఎస్ స్పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ‘సర్వే నం 1170 లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం అనుకుని అధికారులు క్రీడా సముదాయాన్ని కూల్చేశారు. చట్ట ప్రకారం నిర్మాణాన్ని కూల్చేయడానికి అనుసరించాల్సిన నిబంధనల్ని అధికారులు తుంగలోకి తొక్కారు’అని పిటిషనర్ తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి వాదిం చారు. దీనిపై తహసీల్దార్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. ‘సర్వే 1170లో నిర్మాణాలుంటే అడ్డుకోవాల ని ఆర్‌ఐ, వీఆర్వోలకు ఆదేశాలు జారీచేశాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్కారీ భూములు అన్యా క్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలనే ఆదేశించాను. కూల్చివేత చర్యలు తీసుకోవాలని ఆదేశించలేదు’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూమిని కాపాడాలనే..
అధికారుల మౌఖిక ఆదేశాల మేరకే ప్రభుత్వ భూమి ని కాపాడాలని ప్రహరీతో పాటు క్రీడా సముదాయ నిర్మాణ గోడ కూల్చేశామని విడిగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) పేర్కొన్నారు. ‘అది ప్రభుత్వ స్థలం కాదని తర్వాత తెలిసింది. చట్ట వ్యతిరేకంగా చేసినట్లు నిర్ధారణ చేసుకున్నాను. కూల్చిన నిర్మాణాలను సొంత సొమ్ముతో పునః నిర్మాణం చేస్తాను’అని హామీ ఇచ్చారు. ఆర్‌ఐ హామీపై పిటిషనర్ న్యాయవాది అనుమానం లేవనెత్తగా న్యాయమూర్తి స్పందిస్తూ.. కోర్టు చర్యలు తప్పవనే ఆర్‌ఐ హామీ ఇచ్చినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తిరిగి నిర్మాణం చేయాలే గానీ భవనం విషయంలో జోక్యం చేసుకోరాదన్నారు. చట్ట ప్రకారం హద్దులు నిర్ణయించి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. పూర్తి వివరాలు తమ ముందుంచాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేశారు.
సర్కారీ స్థలమనుకొని.. ప్రైవేట్ కట్టడం కూల్చివేత
Published Thu, Aug 23 2018 1:27 AM | Last Updated on Fri, Aug 31 2018 8:47 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment